CMR rice
-
గింజ కోత పెట్టినా ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించే ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల్సిందేనన్నారు. యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ బియ్యం, నూక శాతం తదితర అంశాలపై సచివాలయంలో ఆయన మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేసే ప్రభుత్వం తమదని, విపరీత పరిస్థితుల్లోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని సేకరించడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. యాసంగి ధాన్యంలో నూక శాతంపై నిపుణుల కమిటీ గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికను ప్రస్తుత పరిస్థితులకు ఎలా అన్వయించాలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వంతోపాటు మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి... నిర్ణీత గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు అందజేయాలని సూచించారు. నూక శాతాన్ని త్వరగా తేల్చాలి... తమ సమస్యలను మిల్లర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నూక శాతం విషయాన్ని ప్రభుత్వం త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. తమను రైతులకు శత్రువులుగా ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. ప్రభాకర్‌రావు, కోశాధికారి చంద్రపాల్‌తోపాటు అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
కేంద్ర నిర్ణయం బట్టి రాష్ట్రం స్పందన
సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగి ధాన్యం సీఎంఆర్ విషయంలో కేంద్రం నిర్ణయించే లక్ష్యానికి అనుగుణంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎంత మేర ముడి బియ్యంగా, ఉప్పుడు బియ్యంగా తీసుకుంటారనే స్పష్టత వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని స్పష్టంచేశారు. కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రాత్రి సీఎంతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో సేకరించే ధాన్యం లక్ష్యం, సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యం గురించి వివరించారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా కూడా బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఇవ్వడంలో ఉన్న ప్రతికూలతలపై చర్చించినట్లు సమాచారం. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేస్తే తప్ప రైతాంగానికి మేలు జరగదనే విషయంపై మరోసారి చర్చించినట్లు తెలిసింది. గత యాసంగి సీజన్‌కు సంబంధించి ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి బకాయి ఉన్న విషయాలను కూడా సీఎంకు వివరించారని తెలిసింది. -
బలవర్థక ఆహారమే లక్ష్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్ రైస్‌పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన బియ్యం) అంశం తెరపైకి వచ్చింది. గతేడాది రబీకి సంబంధించి సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సిన రైస్ మిల్లర్లు ఇకపై బలవర్థకమైన బియ్యాన్ని కలిపి ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లులకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) నిర్ణయం మేరకే ఆదేశాలిచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.89లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్‌తో కూడిన బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. క్వింటాల్‌కు ఒక కిలో.. గత రబీ సీజన్(2020–21)లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రైస్ మిల్లులకు ఇచ్చిన విషయం విధితమే. ఈ బియ్యంలో బలవర్థకమైన బియ్యాన్ని మిలితం చేసి ఇవ్వాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది. ఒక్కో క్వింటాల్ బియ్యంలో కిలో బలవర్థక బియ్యాన్ని కలపాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన బలవర్ధక బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంలో మిళితం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వెంటనే మిల్లులు ఈ మిక్చర్ ప్లాంట్లను అమర్చుకోవాలని ఆదేశించింది. బలవర్థక బియ్యంలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఈ ఫోర్టిఫైడ్‌రైస్‌ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
మిశ్రమ సూచిక పద్ధతిలో ముడిబియ్యం పరీక్ష
సాక్షి, హైదరాబాద్: కస్టంమిల్డ్ రైస్(సీఎంఆర్) సేకరణలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ దీపక్ శర్మ తెలిపారు. సెంట్రల్ పూల్ సీఎంఆర్‌లో పాత బియ్యం ఆమోదించేందుకు ముందుగా మిశ్రమ సూచిక పద్ధతిలో తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని దీని ప్రకారం సెంట్రల్ పూల్ కింద సీఎంఆర్ సేకరణ కోసం మిల్డ్ ముడి బియ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. ఆకుపచ్చ/అవకాడో ఆకుపచ్చలో ఉన్న నమూనాలను మాత్రమే ఆమోదిస్తామని, పసుపు/పసుపు నారింజ/నారింజ తదితర రంగులో ఉన్న నిల్వలను తిరస్కరిస్తామని తెలిపారు. వాటాదారులకు ఈ పద్ధతి గురించి అవగాహన కల్పిస్తామని, తెలంగాణ ప్రభుత్వం భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్లతో ఈ విధానంపై అవగాహన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మిల్లింగ్ బంద్
సాక్షి, కరీంనగర్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కొర్రీలపై రైస్ మిల్లర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. సీఎంఆర్ నాణ్యత విషయంలో పెడుతున్న కొర్రీలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మిల్లర్లు కఠిన నిబంధనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వానాకాలం సన్నరకం ధాన్యం ప్రభుత్వం కేటాయించనుండడం, సీఎంఆర్ తగ్గే అవకాశం ఉండడం, ఎఫ్‌సీఐ నిబంధనలతో కోట్లల్లో నష్టం వస్తుండడంతో ధాన్యం మిల్లింగ్ సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉన్న బియ్యంపై ఆ సంస్థ పెడుతున్న ఆంక్షలు మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ విషయమై అధికారులకు పలుమార్లు చేసిన విజ్ఞప్తులు ఫలించకపోవడంతో సీఎంఆర్ నిలిపివేతవైపే మిల్లర్లు మొగ్గు చూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేయాలని నిర్ణయించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితిలో మిల్లింగ్ నిలిపివేస్తే కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. మిల్లర్లపై ఒత్తిళ్లు.. ప్రతీ సీజన్లో ధాన్యం తీసుకునే విషయంలో మిల్లర్లపై పౌరసరఫరాలశాఖ ఒత్తిళ్లు సాధారణంగా మారాయి. పంట కోతల సమయంలో వర్షం, తెగుళ్లు ఇతర సమస్యలతో ధాన్యం నాణ్యత తగ్గిపోతోంది. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కొనుగోళ్లలో సడలింపులు ఇస్తోంది. ఇవే సడలింపులతో గత వానాకాలంలో తెగుళ్లు సోకిన ధాన్యం కొనుగోలు చేసి, తమకు కట్టబెట్టడాన్ని మిల్లర్లు వ్యతిరేకించారు. అనంతరం దిగుమతి చేసుకున్నారు. సదరు ధాన్యం మరాడించగా.. వచ్చిన బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ ఇబ్బంది పెడుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీంతో రెండునెలల క్రితం నాణ్యతతో కూడిన బియ్యం ఉత్పత్తిపై జిల్లా అధికారులు ఎఫ్‌సీఐ నాణ్యత నియంత్రణ అధికారులతో మిల్లర్లకు అవగాహన కల్పించారు. చివరికి బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ నిరాకరించడంతో ప్రభుత్వమే దిగి వచ్చి, పొడి బియ్యం బదులు బాయిల్డ్ బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా యాసంగికి సంబంధించి సీఎంఆర్ బియ్యం తీసుకోవడానికి కూడా ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. ఈ క్రమంలో బియ్యంతోపాటు ప్యాకింగ్ చేసే సంచుల నాణ్యత కూడా సమస్యగా మారడంతో మిల్లర్లు సమ్మెకు దిగుతున్నారు. సన్నధాన్యం సేకరణపై ప్రభావం నియంత్రిత సాగుపై ప్రభుత్వ ప్రచారంతో ఈ సీజన్లో 60 నుంచి 70శాతం మంది రైతులు సన్నరకం ధాన్యం సాగుచేశారు. దీంతో సన్నాల దిగుబడి ఈ సారి ఇబ్బడిముబ్బడిగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18,78,958 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. సన్నధాన్యం సాధారణ రకం కిందకు రావడం, ఈ సీజన్లో పొడి బియ్యం సీఎంఆర్‌గా ఇవ్వాల్సి ఉండడం, తదితర కారణాలతో మిల్లర్లు ఎఫ్‌సీఐ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ధాన్యాన్ని పొడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటం, ప్రభుత్వానికి పొడి బియ్యమే ఎక్కువగా అవసరం కావడంతో మిల్లర్లు సీజన్‌కు ముందే ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే మిల్లింగ్.. చిన్నచిన్న సాకులతో సీఎంఆర్ సేకరణకు ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. గోదాములకు పంపిన బియ్యాన్ని తిప్పి పంపుతోంది. తిరిగి పాలిష్ చేసి పంపడానికి ఒక లారీకి అదనంగా రూ.7 వేల భారం పడుతోంది. ఈ సారి సన్న వడ్ల లెవీ తక్కువ వస్తుంది. నిబంధనల ప్రకారం సీఎంఆర్ ఇవ్వడం మిల్లర్లకు కష్టమే. రైస్ మిల్లర్లకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. న్యాయం చేయాలని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌ను కలిసి వినతిపత్రాలు అందించాం. సమస్య పరిష్కారానికి సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేస్తున్నాం. – నగునూరి అశోక్‌కుమార్, రైస్‌ఇండస్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి -
సీఎంఆర్ బకాయిలపై సీరియస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సర్కారు ధాన్యంతో సొంత వ్యాపారాలు చేసుకోవడానికి మరిగిన కొందరు రైసు మిల్లర్లకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల సంస్థ కమిషనర్ అకున్ సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.90 కోట్లకు పైగా విలువ చేసే 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించకుండా సాకులు చెబుతున్న మిల్లర్ల నుంచి ఆ బియ్యాన్ని ముక్కుపిండి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. శనివారం జిల్లాలో పర్యటించిన సబర్వాల్.. జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు చాంబర్లో రైసుమిల్లర్లతో భేటీ అయ్యారు. ఈ సర్కారు బియ్యాన్ని వెంటనే ఎఫ్‌సీఐకి అప్పగించాలని ఆయన మిల్లర్లను ఆదేశించారు. సాకులు చెబుతున్న మిల్లర్లు..? 2018 ఖరీఫ్ సీజనులో జిల్లాలోని రైతుల వద్ద ప్రభుత్వం 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సీఎంఆర్ (మర ఆడించి బి య్యం ఇవ్వడం) కోసం రైసుమిల్లులకు ఈ ధాన్యా న్ని అప్పగించింది. సుమారు 1.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైసుమిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 35 వేల మెట్రిక్ టన్ను ల బియ్యం ఇవ్వకుండా మిల్లర్లు సాకులు చెబుతు వస్తున్నారు. ఎఫ్‌సీఐ అధికారులు నాణ్యత లేదం టూ బియ్యాన్ని తిరస్కరిస్తున్నారంటూ దాట వేస్తూ వస్తున్నారు. ఇలా నెలల తరబడి సర్కారు బియ్యాన్ని తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో సబర్వాల్ సీరియస్ అయ్యారు. దీనిపై ప్రత్యేక కమిటీ నియమించారు. పౌరసరఫరాల సంస్థలోని టెక్నికల్ అధికారి, రైసుమిల్లర్లకు సంబంధించిన ఓ ప్రతినిధి, ఎఫ్‌సీఐ అధికారులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ మిల్లర్లు ఇస్తున్న బియ్యాన్ని ఎఫ్‌సీఐకి వెంట వెంటనే అప్పగించడంలో కీలకంగా వ్యవహరించనుంది. నిర్వహణ వ్యయాన్ని అధిగమించేందుకు.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వద్ద ఇప్పటికే రాష్ట్ర ఏడాది అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలున్నాయి. ఈ 35 వేల మెట్రిక్ టన్నులను కూడా తమ వద్ద ఉంచుకుంటే రూ.90 కోట్ల విలువ చేసే ఈ బియ్యంపై వడ్డీతో పాటు నిల్వ చేసేందుకు నిర్వహణ వ్యయం భారం పడుతుందని భావించి ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ మిల్లర్లు మాత్రం ఈ బియ్యాన్ని ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే నాణ్యత పేరుతో ఎఫ్‌సీఐ అధికారులే బియ్యాన్ని తిరస్కరిస్తున్నారనే సాకులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా నియమించిన ఈ కమిటీ రైసుమిల్లర్లు ఇచ్చిన బియ్యం ఎఫ్‌సీఐకి వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. కాగా బకాయిపడిన 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ నెల 29 నుంచి సరఫరా చేస్తామని మిల్లర్లు హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. -
సీఎమ్మార్ కుంభకోణంపై విచారణ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి నెల్లూరు(బారకాసు): సీఎంఆర్ బియ్యం నిధుల్లో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ విధానం ద్వారా 2.2 లక్షల టన్నుల బియ్యం సేకరించడంలో కేంద్రప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. సీఎంఆర్ బియ్యం సేకరించేందుకు కేంద్రం నిధులు రూ.478 కోట్లును ఖర్చు చేయడంలో జిల్లా అధికారయంత్రాంగం విఫలమైందన్నారు. ఈ ప్రక్రియలో అధికారులు, దళారులు కమ్మక్కు కావడంతోపాటు కొంతమంది మిల్లర్ల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. కేవలం బ్యాంక్ గ్యారంటీ ద్వారా మాత్రమే మిల్లర్లకు ధాన్యం సరఫరా చేయాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.269కోట్లకు పోస్ట్ డేటెడ్ చెక్కును తీసుకున్నారన్నారు. చెక్కును తీసుకున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంఆర్ బియ్యం కుంభకోణం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విజయవంతంగా తిరంగాయాత్ర.. 70వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేట్టిన తిరంగయాత్ర విజయవంతమైందని ఆంజనేయరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు కుడుముల సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులగౌడ్, కాయలమధు, కామేశ్వరమ్మ, శ్రీహరి, శ్రీను పాల్గొన్నారు. -
సీఎమ్మార్ సేకరణకు ఏడు బృందాలు
114 రైస్‌మిల్లులకు వే బిల్లులు కట్ నెల్లూరు (పొగతోట): ప్రభుత్వం సరఫరా చేసిన సీఎమ్మార్ ధాన్యంలో అనేక మంది రైస్‌మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలించి తేల్చడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. సీఎమ్మార్ సేకరణకు గానూ ఏడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లు, ఒక ఏఎస్ఓ ఉంటారు. ఈ బృందాలు రైస్ మిల్లుల్లో «ధాన్యం నిల్వలను పరిశీలించి సీఎమ్మార్‌ను సరఫరా చేసేలా చర్యలు చేపడతారు. బృందాల ఆధ్వర్యంలో ధాన్యాన్ని ఆడించి సీఎమ్మార్‌ను సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం రైస్ మిల్లుల్లో రికార్డులు, ధాన్యం నిల్వలను పరిశీలించి సీఎమ్మార్‌ను సరఫరా చేయిస్తున్నారు. బయటపడుతున్న అవకతవకలు బృందాల పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. అధిక శాతం రైస్ మిల్లుల్లో ధాన్యం సరఫరా, నిల్వలకు సంబంధించిన రికార్డులను నిర్వహించడంలేదు. ధాన్యాన్ని ఎంత సరఫరా చేశారు.. ఎంత ఆడించారు.. నిల్వ..తదితర వివరాలను తెలిపే రికార్డులు లేవు. మిల్లుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం నిల్వలు కనిపించకపోవడంతో కేసులు నమోదు చేస్తున్నారు. గత సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సుమారు రూ.478 కోట్ల విలువజేసే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. రైస్‌మిల్లర్లు 2.25 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా సీఎమ్మార్‌ను సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేశారు. ప్రస్తుతం అధిక శాతం రైస్ మిల్లర్ల వద్ద గ్రేడ్ – బీ ధాన్యం నిల్వ ఉంది. ధాన్యాన్ని ఆడించి సీఎమ్మార్‌ను ఎఫ్‌సీఐకి సరఫరా చేసినా వాటిని సేకరించారు. ఈ క్రమంలో ఏమి చేయాలో పాలుపోక మిల్లర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్టోబర్ వరకు సమయం కోరుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల చివరిలోపు వంద శాతం సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. 114 మిల్లుల్లో విక్రయాలు జరగకుండా చర్యలు సీఎమ్మార్‌ను సరఫరా చేయకుండా జాప్యం చేస్తున్న 114 రైస్ మిల్లులకు వే బిల్లులను కట్ చేస్తూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో చర్చించి వీటికి వే బిల్లులు జనరేట్ కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ రైస్‌మిల్లుల్లో బియ్యం విక్రయాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీఎమ్మార్‌ను సరఫరా చేస్తేనే వే బిల్లులను మంజూరు చేయనున్నారు. మరోవైపు సీఎమ్మార్ అవకతవకలపై ఎవరిపై చర్యలు తీసుకుంటారోనని పౌరసరఫరాల శాఖ అధికారులు వణికిపోతున్నారు. అధికారులు అడిగిన నివేదికలను ఒకరికి తెలియకుండా మరొకరు సమర్పిస్తున్నారు. రైస్‌మిల్లర్లకు చినబాబు అభయం..! కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం చేసిన మిల్లర్లపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదికలు పంపిన నేపథ్యంలో మిల్లర్లు సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఆశ్రయించారు. విషయాన్ని తాను చూసుకుంటానని లోకేష్ వారికి అభయమిచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం సరఫరా చేసిన సీఎమ్మార్ ధాన్యాన్ని అనేక మంది మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించడంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్‌ను ఆశ్రయించి తమకు అండగా నిలవాలని అభ్యర్థించారు. సరఫరా చేసిన దానికి, ప్రస్తుతం రైస్ మిల్లుల్లో ఉన్న నిల్వలకు పొంతన లేకపోవడంతో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. -
రైస్ మిల్లర్లకు వేబిల్లుల నిలిపివేత
నిర్ధేశించిన సమయంలో సీఎంఆర్ ఇవ్వాలి ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా చేయకుండా కాకమ్మ కబుర్లు చెబితే సహించేది లేదని జేసీ ఇంతియాజ్ అహ్మద్ రైస్ మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. సీఎంఆర్ సరఫరా చేయడానికి సమయం కావాలని ఈ సందర్భంగా మిల్లర్లు జేసీని కోరారు. ధాన్యం బస్తాలు మిల్లుల్లో నిల్వ ఉంచితే కోతులు గందరగోళం చేస్తున్నాయని మిల్లర్లు చెప్పడంతో కుంటిసాకులు చెప్పడం మానుకుని సీఎంఆర్ సరఫరా చేయాలని జేసీ సూచించారు. సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేసేంత వరకు రైస్ మిల్లులకు వేబిల్లులు కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 10 నాటికి 90 శాతం, 15న నాటికి 100 శాతం సీఎంఆర్ సరఫరా చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లు వారికి కేటాయించిన రైస్ మిల్లుల్లో నిత్యం పర్యవేక్షిస్తూ ధాన్యం ఆడించి సీఎంఆర్ గోదాములకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీఎంఆర్ సరఫరా చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్ఓ టి.ధర్మారెడ్డి, డీఎం కొండయ్య సీఎస్డీటీలు, డీటీలు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆది నుంచే అడ్డదారే!
ధాన్యం సేకరణ నుంచి అవినీతి సీఎమ్మార్ బియ్యం కుంభకోణంలో కొత్త కోణం తలపండిన వారికే అర్థం కాని రీతిలో పౌరసరఫరాల శాఖ రికార్డులు రికార్డుల పరిశీలనకు ఎనిమిది మంది డెప్యూటీ తహసీల్దార్ల నియామకం విచారణ ముందుకు సాగకుండా రాజకీయాన్ని ఆశ్రయించిన అక్రమార్కులు రికార్డులు చూపకుండా తప్పించుకుని తిరుగుతున్న మిల్లర్లు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పౌరసరఫరాల శాఖ గత రబీ సీజన్లో చేసిన ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, సీఎమ్మార్ బియ్యం తీసుకోవడంలో అవినీతి ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసిందనే విషయం బేతాళ ప్రశ్నగా మారింది. నాలుగురోజులుగా రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ, రెవెన్యూ సిబ్బందికి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో అర్థం కానంతగా పౌరసరఫరాల శాఖ అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో కూడా అవినీతి జరిగిన జాడలు బయట పడతున్నాయి. ఈ గండికోట రహస్యం ఛేదించడానికి కలెక్టర్ ముత్యాల రాజు ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లను ప్రత్యేక విధులకు నియమించారు. ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆయన సిబ్బంది గురువారం రికార్డులతో కుస్తీ పడ్డారు. ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడిన మిల్లర్లు, అధికారులు తప్పించుకునేందుకు రాజకీయ చక్రం విసిరారు. ధాన్యం సేకరణ నుంచే అక్రమాలు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 169 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ ఏడాది మార్చి 21వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు రైతుల నుంచి 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.478.50 కోట్లు చెల్లించింది. అయితే ధాన్యం సేకరణ నుంచే సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారనే విషయం ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. కావలి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో రబీ సీజన్లో పండిన వరి కంటే రెండింతలు ఆ గ్రామం నుంచే సేకరించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ తీగ లాగి డొంకంతా కదిలించడానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నం మొదలు పెట్టారు. రబీ సీజన్లో గ్రామాల వారీగా రైతులు పండించిన వరి వివరాలు తెప్పించి పౌరసరఫరాల శాఖ ఏ గ్రామం నుంచి ఎంత ధాన్యం సేకరించిందో పరిశీలించే దిశగా ఆలోచన జరుగుతోంది. ఈ వ్యవహారంలో జిల్లాలోని కొందరు మిల్లర్లలో సంబంధిత అధికారులు చేతులు కలిపి ధాన్యం సేకరణ కేంద్రాల నుంచే అవినీతికి దారులు వేసిన జాడలు కనిపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది . తలపండిన వారికే అర్థం కాని రికార్డులు పౌరసరఫరాల శాఖ సేకరించిన 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలోని 176 మంది మిల్లర్లకు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అంకె మాత్రం ఠక్కుమని చెబుతున్న సంబంధిత అధికారులు, సిబ్బంది ఏ మిల్లుకు ఎంత ఇచ్చారు? ఎన్ని బియ్యం తిరిగి వచ్చాయి? ధాన్యం పంపిన మిల్లులను బాధ్యులైన అధికారులు తనిఖీ చేశారా? చేసింటే ఏ రోజు? అనే వివరాలే రికార్డుల్లో లేవు. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి దూకిన ఏసీబీ అధికారులు నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నా అసలు విషయం కనుక్కోలేక పోతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు నియమించిన రెవెన్యూ బృందాలు కూడా మిల్లుల తనిఖీల్లోనే తలమునకలవుతున్నాయి. ముందుగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పౌరసరఫరాల విభాగం జిల్లా మేనేజర్ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను పరిశీలించిన అధికారులకు వివరాలు అర్థం కానివిధంగా గందరగోళంగా ఉన్నాయి. దీంతో కలెక్టర్ ఆదేశం మేరకు ఈ రెండు కార్యాలయాల్లో ధాన్యం సేకరణ, సీఎమ్మార్ బియ్యం వెనక్కు తెప్పించడానికి సంబంధించిన రికార్డులు బాగా చదివి, అర్థం చేసుకోవడం కోసం జిల్లాలోని ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. రాజకీయ చక్రం అడ్డు సీఎమ్మార్ బియ్యం సేకరణ వ్యవహారం సీరియస్‌గా మారడంతో ఈ ప్రమాదం నుంచి బయట పడటానికి తప్పు చేసిన కొందరు మిల్లర్లు, అధికారులు రాజకీయ చక్రం అడ్డు వేసేందుకు రంగంలోకి దిగారు. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యుడి శరణు కోరారు. ఆయన ద్వారా ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నాయకుడి నుంచి విచారణాధికారుల మీద ఒత్తిడి తెప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖకు వెనక్కు ఇవ్వాల్సిన బియ్యం మొత్తం ఈనెల 30వ తేదీలోపు ఏదో ఒక విధంగా వెనక్కు ఇచ్చేస్తామని విచారణ ఇంతటితో ముగించేలా చూడాలని కోరినట్లు తెలిసింది. ఈ పనిచేసిపెడితే ఎవరిని ఎలా సన్మానించుకోవాలో అలా సన్మానించుకుంటామని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. తప్పించుకు తిరుగుతున్న అక్రమార్కులు ధాన్యం తీసుకోవడం, బియ్యం తిరిగి ఇవ్వడంలో కచ్చితంగా వ్యవహరించిన మిల్లర్లు దీని గురించి పట్టించుకోవడం లేదు. లేని మిల్లులు ఉన్నట్లు చూపించి ధాన్యం తీసుకున్న వారు మాత్రం ఏసీబీ, రెవెన్యూ అధికారులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వెంకటాచలంలో ఒక మిల్లు యజమాని తన రికార్డులు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తీసుకుని వెళ్లారని చెప్పారు. నెల్లూరు రూరల్‌లోని ఒక యజమాని మిల్లుకు తాళం వేసి ఎక్కడికో వెళ్లారు. విచారణ ముందుకు పోకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ఎవరికి దొరక్కుండా పోతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. 22 మిల్లుల నుంచి బస్తా బియ్యం వెనక్కు రాలేదని చెబుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ మిల్లుల వివరాలు, ఎంత ధాన్యం పంపిందీ, ఎంత బియ్యం వచ్చిందనే వివరాలు చెప్పకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కొందరు మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ఏ గ్రేడ్ ధాన్యాన్ని మర పట్టి ఆ బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారనే విషయం నిర్ధారణ అయింది. పౌరసరఫరాల శాఖకు ఇప్పటికే సరఫరాచేసిన బియ్యంలో నాసిరకంవి ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. -
మిల్లర్లు, అధికారులు మిలాఖత్
సీఎంఆర్ వ్యవహారంలో చేతులు మారిన రూ.50 కోట్లు గత ఏడాది విజిలెన్స్ దాడులతో మేల్కొనని అధికారులు ఈసారి 22 మిల్లుల నుంచి ఒక్క బస్తా బియ్యం వెనక్కు రాలేదు (సాక్షి ప్రతినిధి – నెల్లూరు) గత రబీ సీజన్లో జిల్లాలో జరిపిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ధాన్యం సేకరణ మొదలు మిల్లర్ల నుంచి తిరిగి బియ్యం తీసుకునే వరకు జరిగిన ప్రక్రియ ప్రహసనంగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. గత ఏడాది జరిగిన అక్రమాలను విజిలెన్స్ విభాగం బయటపెట్టినా, పౌరసరఫరాల శాఖ అధికారులు ఈసారి మరొక అడుగు ముందుకేసి బరితెగించారు. ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు ప్రైవేట్ వ్యాపారం చేసుకోవడానికి యథాశక్తి సహకరించడానికి కారణం ఏమై ఉంటుందో నేరుగా చెప్పక్కర్లేదు. అవినీతి నిరోధక శాఖ 10 ప్రత్యేక బృందాలతో జిల్లాలోని మిల్లులపై సోమవారం ప్రారంభించిన తనిఖీలు మంగళవారం రాత్రి దాకా కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్పీ తోట ప్రభాకర్ పౌరసరఫరాల శాఖ అధికారులను అనేక దఫాలుగా విచారించి, రికార్డులు తెప్పించుకున్నారు. ఈసారి 22 మిల్లుల నుంచి బస్తా బియ్యం రాలేదు గత రబీ సీజన్లో జిల్లాలో ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ రంగంలోకి దిగింది. పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో «జిల్లాలో 169 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి జూన్ 17వ తేదీ నాటికి 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.478.50 కోట్లు చెల్లించింది. వీటిని జిల్లాలోని 176 మంది మిల్లర్లకు ఇచ్చినట్లు అధికారులు రికార్డులు రాశారు. గత ఏడాది జరిపిన సీఎంఆర్ బియ్యం సేకరణలో నాలుగు మిల్లుల నుంచి రూ.6 కోట్ల విలువ చేసే బియ్యం పౌర సరఫరాల శాఖకు తిరిగి రాలేదు. ఈసారి ఏకంగా 22 మిల్లుల నుంచి ఒక్క బస్తా బియ్యం కూడా వెనక్కు రాలేదు. ఇవీ అక్రమాలు బోగోలులో వెంకటరమణ రైస్‌మిల్లును అధికారులు సీజ్ చేశారు. ఈ రైస్ మిల్లుకు రూ.2 కోట్ల విలువ చేసే 1385.68 మెట్రిక్ టన్నుల ధాన్యం బియ్యంగా మార్చడానికి పంపినట్లు అధికారుల రికార్డుల్లో రాశారు. తన మిల్లు పేరుతో ఎవరో ధాన్యం తీసుకున్నారని, ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని మిల్లు యజమాని ఈ ఏడాది మేలో అధికారులకు ఫిర్యాదు చేసినా దాని గురించి పట్టించుకోలేదు. వెయ్యి టన్నుల మిల్లింగ్ సామర్థ్యం కూడా లేని అనేక మిల్లులకు రెండింతలు, మూడింతల ధాన్యం ఇచ్చారు. జూన్ 17 లోపు పంపిన 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 2.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు వెనక్కు ఇవ్వాలి. మంగళవారం నాటికి కేవలం 80 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వెనక్కు వచ్చాయి. మిగిలిన 1.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వెనక్కు రాలేదు. వీటి విలువ సుమారు 400 కోట్లు ఉంటుంది. మిల్లర్ల నుంచి రూ.478.50 కోట్లు బ్యాంకు గ్యారంటీ తీసుకోవాల్సిన అధికారులు కేవలం రూ.39 కోట్లకు మాత్రమే సక్రమంగా బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నారు. రూ.269 కోట్లకు ముందస్తు తేదీలతో చెక్కులు తీసుకుని ప్రభుత్వానికి టోపీ పెట్టారు. ఇప్పుడా అకౌంట్లలో సొమ్ములు లేవు. మిల్లర్లు బియ్యం నింపి ఇవ్వడం కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు 82 లక్షల 50 వేల గన్నీ బ్యాగులు ఇచ్చారు. జిల్లాలోని మిల్లులన్నీ తిరిగినా ఈ సంచులకు కూడా లెక్క తేలడం లేదు. భారీ అవినీతి సీఎంఆర్ బియ్యం సేకరణలో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పెద్దస్థాయి అధికారులు లేనిదే ఈ అక్రమాలు వీలు పడదని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు ప్రైవేట్ వ్యాపారం చేసుకోవడానికి అధికారులు సహకరించారని, ఇందులో కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండొచ్చని ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదిక పంపారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి మరో రెండు, మూడు రోజుల్లో మరో నివేదిక అందచేయనున్నారు. సెప్టెంబరు లోగా బియ్యం తీసుకుంటాం : ఇంతియాజ్, జేసీ మిల్లర్ల నుంచి సెప్టెంబరు 30వ తేదీలోగా సీఎంఆర్ బియ్యం తీసుకుంటాం. ఎవరైనా అక్రమాలు పాల్పడి ఉంటే క్రిమినల్ కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా సొమ్ము వసూలు చేస్తాం. గత ఏడాది బియ్యం వెనక్కు ఇవ్వని నెల్లూరుకు చెందిన నలుగురు మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించాం. ఏసీబీ నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. బియ్యం అవినీతి సమాచారం ఉంటే ఇవ్వండి : తోట ప్రభాకర్, ఏసీబీ డీఎస్పీ సీఎంఆర్ బియ్యం సేకరణకు సంబం«ధించిన అవినీతిపై ఏదైనా సమాచారం ఉంటే తెలియచేయాలని కోరుతున్నాను. మిల్లర్లు గానీ ప్రజలు గానీ నేరుగా మా ఆఫీసుకు వచ్చి నన్ను కలవచ్చు. లేదా 94404 46184 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు. -
సీఎమ్మార్ ఇవ్వకపోతే చర్యలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను నిర్దేశించిన సమయంలోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో సీఎస్డీటీలు, రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వచ్చే నెల పదో తేదీలోపు 75 శాతం సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లకు 2.15 లక్షల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వివరించారు. ఇప్పటి వరకు 86 వేల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేశారన్నారు. బాయిల్డ్ రైస్‌ను ఎఫ్సీఐకు సరఫరా చేయాలని పేర్కొన్నారు. రెడ్, బ్లూ రెండు రకాల గన్నీ బ్యాగుల్లో సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని పేర్కొన్నారు. అనంతరం రైస్‌మిల్లర్లు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సీఎమ్మార్‌ను పూర్తిస్థాయిలో సరఫరా చేయాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు. డీఎస్ఓ ధర్మారెడ్డి, డీఎం కొండయ్య, ఏఎస్ఓలు, సీఎస్డీటీలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యంరెడ్డి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.