సీఎమ్మార్ కుంభకోణంపై విచారణ
-
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి
నెల్లూరు(బారకాసు):
సీఎంఆర్ బియ్యం నిధుల్లో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ విధానం ద్వారా 2.2 లక్షల టన్నుల బియ్యం సేకరించడంలో కేంద్రప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. సీఎంఆర్ బియ్యం సేకరించేందుకు కేంద్రం నిధులు రూ.478 కోట్లును ఖర్చు చేయడంలో జిల్లా అధికారయంత్రాంగం విఫలమైందన్నారు. ఈ ప్రక్రియలో అధికారులు, దళారులు కమ్మక్కు కావడంతోపాటు కొంతమంది మిల్లర్ల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. కేవలం బ్యాంక్ గ్యారంటీ ద్వారా మాత్రమే మిల్లర్లకు ధాన్యం సరఫరా చేయాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.269కోట్లకు పోస్ట్ డేటెడ్ చెక్కును తీసుకున్నారన్నారు. చెక్కును తీసుకున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంఆర్ బియ్యం కుంభకోణం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
విజయవంతంగా తిరంగాయాత్ర..
70వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేట్టిన తిరంగయాత్ర విజయవంతమైందని ఆంజనేయరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు కుడుముల సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులగౌడ్, కాయలమధు, కామేశ్వరమ్మ, శ్రీహరి, శ్రీను పాల్గొన్నారు.