ఆర్టీఐ పేదల కడుపు నింపిందా?
కాంగ్రెస్‌పై నరేంద్ర మోడీ ధ్వజం
దీంతో ఎవరు బాగుపడ్డారో రాహుల్ గాంధీకే తెలియాలి
అవినీతి కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది
బెంగళూరు/కాసరగోడ్ (కేరళ): కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి స్కామ్‌లలో కూరుకుపోయిందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. అవినీతి, దోపిడీలు కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉన్నాయని, ఉపాధి హామీ పథకం ఆ పార్టీ నేతల జేబులు నింపుకోడానికే పనికొచ్చిందని మండిపడ్డారు. మోడీ మంగళవారం కర్ణాటకలోని బాగలకోటే, కొప్పళ, మైసూరు, బెంగళూరుల్లో, కేర ళలోని కాసరగోడ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) తెచ్చామని కాంగ్రెస్ నేత రాహుల్ గొప్పగా చెబుతున్నారు. ఆ చట్టం నిరుపేదల కడుపు నింపిందా? యువతకు ఉపాధి కల్పించిందా? రైతులకు మేలు చేసిందా? విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చిందా? దాంతో ఎవరు బాగుపడ్డారో ఆయనకే తెలియాలి.
జనం బొగ్గు లూటీ గురించి మాట్లాడితే ఆయన(రాహుల్) ఆర్టీఐని వాడుకోమంటారు. బొగ్గును ఎవరు కాజేశారో షహజాదా(రాహుల్) చెప్పాలి?’ అని అన్నారు. దేశంలో ఐటీ విప్లవం రాజీవ్ హయాంలో మొదలు కాలేదని, వాజ్‌పేయి హయాంలోనే ఆ విప్లవం వచ్చిందని అన్నారు. ఐటీ హబ్ అయిన బెంగళూరు యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ.. ‘బెంగళూరు యువతకు ఒక మాట చెబుతున్నా. మీ కలలను నా కలలుగా చేసుకుంటా. మీ ఆశయమే నా లక్ష్యం’ అని అన్నారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఆధార్ ప్రాజెక్టు మాజీ అధిపతి నందన్ నీలేకనికి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిందని, ఇంతకూ ఏ నేరం చేశారో ఆయన చెప్పాలని అన్నారు. తరాలు మారినా, నాయకులు మారినా కాంగ్రెస్ బుద్ధులు మారలేదని, ఆ పార్టీని శిక్షించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు.
తెలంగాణలో సీట్ల కోసమే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిందని మోడీ విమర్శించారు. ‘ఎన్డీఏ హయాంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఒప్పించి మూడు రాష్ట్రాలను విభజించాం. తెలంగాణవాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నా, సీమాంధ్రుల మనోభావాలను కూడా కాంగ్రెస్ గౌరవించి ఉండాల్సింది’ అని అన్నారు.
యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కుమ్మక్కు..
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని పాలక యూడీఎఫ్, సీపీఎం సారథ్యంలోని విపక్ష ఎల్డీఎఫ్‌లు ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని, ఒక దాని తప్పులపై ఒక టి మౌనం వహిస్తూ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని మోడీ విమర్శించారు. ‘ఎల్డీఎఫ్ ఎర్రజెండాలు పట్టుకుంటుంది. కాంగ్రెస్ బయటికి ఆకుపచ్చగా లోపల ఎర్రగా ఉండే పుచ్చకాయ’ అని వ్యాఖ్యానించారు. పర్యాటకులకు స్వర్గధామమైన కేరళను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని విమర్శించారు. రక్షణ మంత్రి ఆంటోనీ హయాంలో దేశరక్షణ సామర్థ్యం దెబ్బతిందని, దీనికి ఆయన బదులివ్వాలని అన్నారు.
ఆరు నూరైనా మోడీని మార్చం: రాజ్‌నాథ్
పుణే: రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు గుప్పించినా, ఎన్ని సూచనలు చేసినా బీజేపీ ప్రతిపాదిత ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విషయంలో నిర్ణయం మార్చుకునేది లేదని, రాజీపడే ప్రసక్తి కూడా లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పుణేలో చెప్పారు. ఎన్నికల అనంతరం ఢిల్లీ గద్దెపై ఎన్డీయే కొలువుదీరితే పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీకి డిప్యూటి ప్రధాని పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కాగా మోడీ ముస్లింలకు వ్యతిరేకి కాదని, మైనారిటీలకు రక్షకుడని బీజేపీ నేత రామ్ జెఠ్మలానీ కొనియాడారు.