కళంకితులతో జట్టు కడతారా?
రాహుల్‌పై మోడీ ధ్వజం
కాంగ్రెస్ జట్టుకట్టిన నేతలు జైలు నుంచి వచ్చిన వాళ్లు
పాలకు కాపలా పెట్టగల నమ్మకమైన పిల్లిని నేను చూడలేదు
జార్ఖండ్, బీహార్ సభల్లో కాంగ్రెస్, లాలూలపై మోడీ విసుర్లు
కోడెర్మా (జార్ఖండ్)/ నవధ (బీహార్): కుంభకోణాల కళంకితులైన నేతలతో జట్టుకట్టి దేశ వనరులను కాపాడాలని ‘యువరాజు’ ప్రణాళిక రచించారా? అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎద్దేవాచేశారు. జంతువుల ఊచకోతను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టారంటూ ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌పైనా మోడీ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో ఝుమార్తాలియా, ఆ తర్వాత బీహార్‌లోని నవధలో లో జరిగిన బీజేపీ ఎన్నికల సభల్లో ప్రసంగించారు.
‘‘దేశ వనరులను కాపాడేందుకు 125 కోట్ల మంది ప్రజలు నిర్ణయం తీసుకోవాలని ‘షెహజాదా’ అన్నారు. కానీ ఆయన స్వయంగా కళంకిత నేతలపై ఆధారపడుతున్నారు. మీరు జట్టుకట్టిన వాళ్లు ఎలాంటి వాళ్లు? వారిని నమ్మవచ్చా? కాంగ్రెస్ జట్టుకట్టిన వాళ్లు ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చారు’’ అని ఆయన రాహుల్, లాలూప్రసాద్‌లను పరోక్షంగా విమర్శించారు. పాలకు కాపలా పెట్టేందుకు నమ్మగల పిల్లిని తాను ఇంతవరకూ చూడలేదని ఆయన ఎత్తిపొడిచారు. కేంద్రం విడుదల చేసే నిధుల్లో ఒక రూపాయికి కేవలం 15 పైసలే జనానికి చేరుతున్నాయన్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ఉటంకిస్తూ.. కాంగ్రెస్ గుర్తు హస్తంపై విమర్శలు చేశారు. ‘‘రాహుల్‌గాంధీ తనవద్ద దేశాభివృద్ధికి తన వద్ద రోడ్‌మ్యాప్ ఉందంటున్నారు. ఇది ఆయన బుర్రలోకి రావటానికే ఇంత సమయం పడితే.. అది వాస్తవ రూపం దాల్చటానికి మరో 600 ఏళ్లు పడుతుంది’’ అని ఎద్దేవా చేశారు. తాను సేవకుడినే కానీ శాసకుడిని కాదని మోడీ తనను తాను అభివర్ణించుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే ఖరారయ్యాయని, కేవలం ప్రభుత్వాన్ని మార్చటానికే కాదు, దేశాన్ని లూటీ చేసిన వారిని శిక్షించటానికి కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ఒక్కరూ ఇల్లు లేని వారు లేకుండా చూసేందుకేు తన ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని హామీఇచ్చారు.
యూపీ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్తారా?: దిగ్విజయ్
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ కీలక హిందీ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్, బీహార్‌ల నుంచి వలస వచ్చే వారిని వ్యతిరేకిస్తున్న శివసేన, ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌ఠాక్రేలతో మోడీ సంబంధాలపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ‘‘మోడీ, బీజేపీ, శివసేన, రాజ్‌ఠాక్రేలు.. యూపీ, బీహార్ వలసలకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. మోడీ యూపీ, బీహార్‌లకు వెళ్లినపుడు క్షమాపణ చెప్తారా? ముంబైలో రాజ్‌ఠాక్రే, శివసేనలు యూపీ, బీహార్ వలస జనాన్ని అవమానిస్తున్నపుడు మోడీ దానికి వ్యతిరేకంగా నిలిచారా?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ట్విటర్‌లో ప్రశ్నించారు.