విభజించు.. పాలించు
ఇదే మోడీ విధానం అస్సాంలో రాహుల్ మండిపాటు
బీజేపీ, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీలది విభజించు-పాలించు విధానమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. బ్రిటిషర్ల మాదిరిగా వారు కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడుతూ.. బీజేపీ, మోడీలపై విరుచుకుపడ్డారు. ‘‘మోడీ సాబ్ తన గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన అక్కడ చేసిందేమిటి? పేద రైతులను మోసం చేసి తీసుకున్న 35వేల ఎకరాల వ్యవసాయ భూమిని కేవలం ఒక రూపాయికి మీటరు చొప్పున అదానీ అనే పారిశ్రామికవేత్తకు కట్టబెట్టారు. అనంతరం అదానీ మీటరు భూమిని రూ.800 చొప్పున అమ్ముకుని.. రూ.3వేల కోట్ల విలువైన తన కంపెనీని రూ.40వేల కోట్లకు పెంచుకున్నారు. ఇదీ గుజరాత్ మోడల్’’ అని విమర్శించారు.
ఇక్కడ రూపాయికి ఒక చాక్లెట్ వస్తుందని, మీరు అదానీ అయ్యి, ఓ చాక్లెట్ ఇస్తే, గుజరాత్ సర్కారు మీకు ఓ మీటరు భూమి ఇస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లో మార్పులు తీసుకొస్తానని మోడీ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. ఒక్క వ్యక్తితో ఎలాంటి మార్పూ రాదు. కోట్లాది మంది ప్రజల సంఘటిత కృషితోనే అది సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు. అలాగే మహిళలను అన్నిరంగాల్లో బలోపేతం చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ వారి పోస్టర్లలో ఒకే ఒక్క వ్యక్తి తప్ప.. సుష్మాస్వరాజ్ లేదా ఆ పార్టీకి చెందిన ఇతర మహిళా నేతల ఫొటోలు లేవని మోడీని ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
బెంగాల్‌లో మహిళలకు భద్రతేదీ?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనా రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. దేశం మొత్తమ్మీద చూస్తే బెంగాల్‌లో మహిళా భద్రత చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఓ మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయంలో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే ‘శారదా పోంజీ’ ఆర్థిక కుంభకోణంలో నిందితులపై చర్యలు తీసుకోకుండా, వారిని రక్షించేందుకు బెంగాల్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.