కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న విజయ్‌కుమార్ చిత్రంలో పొన్నాల లక్ష్మయ్య తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఆయన గొంతు నులిమి ఓడించడా నికి చాలా మంది నాయకులు వస్తున్నరు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సామంతు లు, మాజీ మంత్రులు దిగుతున్నరు. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్య దండు కట్టి తెలంగాణకు క్యూ కడుతున్నరు. కేసీఆర్ బొండిగ పిసికేందుకు ఎంత మంది వస్తున్నా మేము భయపడం. మేము తెలంగాణ ప్రజలనే నమ్ముకు న్నం. సింహం సింగిల్‌గా వస్తుంది.
తెలంగాణ గొంతు కేసీఆర్‌ను ఖతం చేసేందుకు ఢిల్లీ దొరలు ఒక్కటై దాడి చేస్తే కాపాడుకొనే బాధ్యత తెలంగాణ ప్రజలపైనే ఉంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్, పాలకుర్తి, ముధోల్ కాంగ్రెస్ నేతలు తిరుపతిరెడ్డి, కిరణ్ వాంగ్మోరేతోపాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్, జనగామ, పాలకుర్తికి చెందిన పలువురు నేతలు మంగళవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఇక్కడ నాయకత్వం లేనట్లు చేతకాని, చేవచచ్చిన కాంగ్రెస్, బీజేపీ పక్క రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నాయి. తెలంగా ణ గొంతు కేసీఆర్ ఉండగా మనకు ఇతరుల అవస రం ఏముంది? తెలంగాణ కథకు స్క్రీన్ ప్లే, దర్శక త్వం కేసీఆర్. మన సినిమా బ్లాక్ బస్టర్. కానీ కాంగ్రెస్, బీజేపీకి కన్నడ నిర్మాతలు, ఢిల్లీ దర్శకులు, గుజరాత్ నటులు అని వారి సినిమా డిజాస్టర్‌గా నిలుస్తుంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రేవంత్ రాష్ట్రాన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తాడు
‘ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తాడు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా నడుపుతున్నారు. తెలంగాణలోని ప్రతి వర్గానికీ కేసీఆర్ మంచి చేశారు తప్ప నష్టం చేయలేదు. విద్యుత్, సాగునీరు, తాగునీరుతో అన్ని రంగాల్లో సమృద్దిని సాధిస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 14లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
పాలమూరులో నిండు చెరువులు, పచ్చని పైరులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు 11 మార్లు తెలంగాణ ప్రజలు అధికారం, అవకాశం ఇచ్చినా సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మూడు కరెంటు చాలని రేవంత్, రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు.
తెలంగాణలో మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం’ అని కేటీఆర్ ప్రకటించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాకేశ్, ధర్మేందర్, తుంగబాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment