ఆయనకు దేశ పగ్గాలా?
రాహుల్ గాంధీకి మోడీ చురకలు
సొంత నియోజకవర్గం అమేథీనే చక్కబెట్టలేదు
కొడుకును గెలిపించాలని ప్రజలను సోనియా వేడుకుంటున్నారు
సర్గుజా (ఛత్తీస్‌గఢ్): ఎన్నికల్లో తన కొడుకు రాహుల్ గాంధీని గెలిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు విజ్ఞప్తి చేయడాన్ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గమైన అమేథీనే చూసుకోలేని వ్యక్తి దేశానికేం సారథ్యం వహించగలడని చురకలంటించారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ సోనియా, రాహుల్‌లపై పదునైన విమర్శలు చేశారు. ‘‘నా కొడుకు బాధ్యతను మీరు తీసుకుంటే దేశం బాధ్యత అతను చూసుకుంటాడని అమేథీ ప్రజలకు సోనియా చెబుతున్నారు. ఇందులో ఏమైనా తర్కం ఉందా? కొడుకును గెలిపించాలని అమేథీ ప్రజలను ఆమె వేడుకుంటున్నారు. అమేథీనే చూసుకోలేని వ్యక్తి దేశాన్ని ఎలా చూసుకుంటాడు’’ అని మోడీ వ్యాఖ్యానించారు.
మహిళా భద్రత విషయంలోనూ రాహుల్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని మోడీ విమర్శించారు. మహిళా భద్రత గురించి ప్రసంగాల్లో ప్రస్తావించే రాహుల్...ఢిల్లీలో అతివలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. దేశంలోకెల్లా మహిళలపై ఎక్కువగా నేరాలు జరుగుతున్న 10 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలోనే ఉన్నాయని మోడీ గుర్తుచేశారు.
2జీ తరహాలో తెరపైకి జీజాజీ: రాహుల్ బావ రాబర్ట్ వాద్రాపైనా మోడీ విమర్శలు సంధించారు. దేశ ప్రజలు 2జీ గురించి విని ఉంటారని...కానీ కొత్తగా జీజాజీ (బావ) వింటున్నారని పరోక్షంగా వాద్రా భూదందాను గుర్తుచేశారు. తల్లీ కొడుకుల ప్రభుత్వంలో యువతకు రావాల్సిన ఉద్యోగాలు వాద్రాకు వచ్చినట్లున్నాయని...అందుకే ఆయన ఆస్తులు భారీగా పెరిగాయని విమర్శించారు. దేశంలో రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తగల ఇంద్రజాలికుడిని ఎప్పుడైనా చూశారా? అని వాద్రా ఆస్తుల్లో భారీ పెరుగుదలను ప్రస్తావించారు. అమెరికాకు చెందిన ఓ పత్రిక ప్రచురించిన కథనంతో వాద్రా ఆస్తుల గురించి తనకు తెలిసిందన్నారు. 10వ తరగతి పాసైన ఓ యువకుడు చేతిలో ఉన్న కేవలం లక్ష రూపాయలతో మూడేళ్లలోనే రూ. 300 కోట్లకు అధిపతి అయ్యాడని పత్రిక పేర్కొందని...తల్లీ కొడుకులు ఈ ఇంద్రజాలాన్ని చేసి చూపారని విమర్శించారు.
ఓటమిని ఊహించే పవార్ దూరం: మహారాష్ట్రలోని నాసిక్, జల్గావ్‌లలో మోడీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఆయన్ను తెలివైన రాజకీ య నాయకుడని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైందని చమత్కరించార