రిమోట్ కంట్రోల్ పాలన వద్దు
అస్సాం ప్రచారంలో కాంగ్రెస్‌పై మోదీ ధ్వజం
రహా, గువాహటి : గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం అనేక ఇబ్బందులు పడిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ‘రిమోట్ కంట్రోల్’ పాలన సాగించిందని ద్వజమెత్తారు. ఆ పార్టీనుంచి జాగ్రత్తగా ఉండాలని, అస్సాంలో అస్థిరమైన ప్రభుత్వం వస్తే ప్రజలు మరోసారి ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. శుక్రవారం రహాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తూ, బీజేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. తమది చేతల ప్రభుత్వమని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించారు. ఒకరకంగా మన్మోహన్ చెప్పింది నిజమేనన్నారు.
వారి హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. వెనకసీటు డ్రైవింగ్ వల్ల దేశం ఎన్నో కష్టాలు ఎదుర్కొందని మన్మోహన్ పాలనను ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ పాలన సాగిస్తున్నారని, కీలక నిర్ణయాలు ఆమే తీసుకుంటున్నారని బీజేపీ ఆరోపించడం తెలిసిందే.కాగా, రాష్ట్రంలో సీఎం గొగోయ్ సర్కారు అవినీతిలో మునిగిపోయిందని మోదీ అన్నారు. అస్సాంలో ఒకవేళ అస్థిర ప్రభుత్వం ఏర్పడితే దేశాన్ని విభజించాలనుకుంటున్న శక్తులకు లబ్ధికలుగుతుందని అన్నారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్‌ను ప్రస్తావిస్తూ అలాంటివి జరగకూడదనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనను ప్రారంభించిందని చెప్పారు. ప్రధాని శుక్రవారం ఉదయం ప్రధాని గువాహటిలోని కామాఖ్యదేవి గుడిలో పూజలు చేశారు.