‘హెలికాప్టర్’ దొంగలను శిక్షించాలా? వద్దా?
సోనియాపై మోదీ పరోక్ష విమర్శ
♦ ఇటలీలో మీ బంధువులున్నారా? నా బంధువులున్నారా?
హోసూరు: అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల ఒప్పందం దొంగతనమని (చోరీ) అభివర్ణిస్తూ.. అందులో దోషులు ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హోసూరులో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మోదీ పాల్గొన్నారు. అగస్టా హెలికాప్టర్ల ఒప్పందంపై తొలిసారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చీఫ్ సోనియాపేరును ప్రస్తావించకుండానే ఆమెపైన, కాంగ్రెస్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇటలీ కోర్టు భారత్‌లోని గత ప్రభుత్వంలోని వారు డబ్బులు తీసుకున్నారని చెప్పిందా? అలాంటపుడు మీరు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఇబ్బందిపెడుతున్నారు? మీ బంధువులు ఎవరైనా ఇటలీలో నివసిస్తున్నారా? నా చుట్టాలు ఎవరైనా ఇటలీలో నివసిస్తున్నారా? నేను ఇటలీని చూడలేదు.
ఇటలీ వాళ్లు వారిపై ఆరోపణలు చేస్తే మేం ఏం చేయాలి’’ అని ప్రశ్నలు సంధించారు. ‘హెలికాప్టర్ దొంగతనంలో పాలుపంచుకున్న వాళ్లని శిక్షించాలా? వద్దా? వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలా? వద్దా? తమిళనాడు ప్రజలు చెప్పాలి’ అని కోరారు. ‘ఢిల్లీలోని వాళ్లు మోదీ పనిచేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారన్న విషయం తమిళులకు ఇప్పుడు తెలిసివుంటుందన్నారు. ‘ఆయన శీలలు బిగించాడు కాబట్టి. అది అవినీతిపరులపై ప్రభావం చూపింది. అది వారి నిద్రను చెడగొట్టింది. కాబట్టి వాళ్లు నాపై దాడి చేస్తున్నారు. నేను భయపడను’ అని పేర్కొన్నారు. ‘గతంలో తమిళనాడు ప్రజలకు ఏ ప్రత్యామ్నాయమూ లేదు. రెండు పార్టీలే ఉండేవి. ప్రజలు ఒక పార్టీపై అసంతృప్తిగా ఉంటే రెండో పార్టీకి అధికారం ఇచ్చేవాళ్లు. అలా మారుతుండేది. కొన్నిసార్లు వాళ్లు బావిలోకో, లోయలోకో పడిపోయేవాళ్లు’ అంటూ బీజేపీని మూడో ప్రత్యామ్నాయంగా చూపించారు.
కేరళలో ప్రభుత్వం ఉందా?
పాలక్కడ్: కేరళలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య.. సోలార్ స్కాంపై తదితర అంశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూడీఎఫ్ తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. అసలు కేరళలో ప్రభుత్వమే ఉన్నట్టు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలక్కడ్‌లో ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో ఒక దళిత సోదరి, అత్యాచారానికి, హత్యకు గురైంది. మనకు ప్రభుత్వం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు’ అని చెప్పారు.