ఆది నుంచే అడ్డదారే! | Corruption in CMR rice | Sakshi
Sakshi News home page

ఆది నుంచే అడ్డదారే!

Published Fri, Aug 12 2016 12:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ఆది నుంచే అడ్డదారే! - Sakshi

ఆది నుంచే అడ్డదారే!

 
  • ధాన్యం సేకరణ నుంచి అవినీతి
  • సీఎమ్మార్‌ బియ్యం కుంభకోణంలో కొత్త కోణం
  • తలపండిన వారికే అర్థం కాని రీతిలో పౌరసరఫరాల శాఖ రికార్డులు
  • రికార్డుల పరిశీలనకు ఎనిమిది మంది డెప్యూటీ తహసీల్దార్ల నియామకం
  • విచారణ ముందుకు సాగకుండా రాజకీయాన్ని ఆశ్రయించిన అక్రమార్కులు
  • రికార్డులు చూపకుండా తప్పించుకుని తిరుగుతున్న మిల్లర్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
పౌరసరఫరాల శాఖ గత రబీ సీజన్‌లో చేసిన ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, సీఎమ్మార్‌ బియ్యం తీసుకోవడంలో అవినీతి ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసిందనే విషయం బేతాళ ప్రశ్నగా మారింది. నాలుగురోజులుగా రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ, రెవెన్యూ సిబ్బందికి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో అర్థం కానంతగా పౌరసరఫరాల శాఖ అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో కూడా అవినీతి జరిగిన జాడలు బయట పడతున్నాయి. ఈ గండికోట రహస్యం ఛేదించడానికి  కలెక్టర్‌ ముత్యాల రాజు ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లను ప్రత్యేక విధులకు నియమించారు. ఏసీబీ డీఎస్‌పీ తోట ప్రభాకర్‌ ఆయన సిబ్బంది గురువారం రికార్డులతో కుస్తీ పడ్డారు. ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడిన మిల్లర్లు, అధికారులు తప్పించుకునేందుకు రాజకీయ చక్రం విసిరారు.
ధాన్యం సేకరణ నుంచే అక్రమాలు
జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో  జిల్లాలో 169 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి  ఈ ఏడాది మార్చి 21వ తేదీ నుంచి జూన్‌ 17వ తేదీ వరకు  రైతుల నుంచి  3.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.478.50 కోట్లు చెల్లించింది. అయితే ధాన్యం సేకరణ నుంచే సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారనే విషయం ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. కావలి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో రబీ సీజన్‌లో పండిన వరి కంటే రెండింతలు ఆ గ్రామం నుంచే సేకరించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ తీగ లాగి డొంకంతా కదిలించడానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నం మొదలు పెట్టారు. రబీ సీజన్‌లో గ్రామాల వారీగా రైతులు పండించిన వరి వివరాలు తెప్పించి పౌరసరఫరాల శాఖ ఏ గ్రామం నుంచి ఎంత ధాన్యం సేకరించిందో పరిశీలించే దిశగా ఆలోచన జరుగుతోంది. ఈ వ్యవహారంలో జిల్లాలోని కొందరు మిల్లర్లలో సంబంధిత అధికారులు చేతులు కలిపి ధాన్యం సేకరణ కేంద్రాల నుంచే అవినీతికి దారులు వేసిన జాడలు కనిపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది .
తలపండిన వారికే అర్థం కాని రికార్డులు
పౌరసరఫరాల శాఖ సేకరించిన 3.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం  జిల్లాలోని 176 మంది మిల్లర్లకు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అంకె మాత్రం ఠక్కుమని చెబుతున్న సంబంధిత అధికారులు, సిబ్బంది ఏ మిల్లుకు ఎంత ఇచ్చారు? ఎన్ని బియ్యం తిరిగి వచ్చాయి? ధాన్యం పంపిన మిల్లులను బాధ్యులైన అధికారులు తనిఖీ చేశారా? చేసింటే ఏ రోజు? అనే వివరాలే రికార్డుల్లో లేవు. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి దూకిన ఏసీబీ అధికారులు నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నా అసలు విషయం కనుక్కోలేక పోతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశం మేరకు నియమించిన రెవెన్యూ బృందాలు కూడా మిల్లుల తనిఖీల్లోనే తలమునకలవుతున్నాయి. ముందుగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పౌరసరఫరాల విభాగం జిల్లా మేనేజర్‌ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను పరిశీలించిన అధికారులకు వివరాలు అర్థం కానివిధంగా గందరగోళంగా ఉన్నాయి. దీంతో  కలెక్టర్‌ ఆదేశం మేరకు ఈ రెండు  కార్యాలయాల్లో ధాన్యం సేకరణ, సీఎమ్మార్‌ బియ్యం వెనక్కు తెప్పించడానికి సంబంధించిన రికార్డులు బాగా చదివి, అర్థం చేసుకోవడం కోసం జిల్లాలోని ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. 
రాజకీయ చక్రం అడ్డు
 సీఎమ్మార్‌ బియ్యం సేకరణ వ్యవహారం సీరియస్‌గా మారడంతో ఈ ప్రమాదం నుంచి బయట పడటానికి తప్పు చేసిన కొందరు మిల్లర్లు, అధికారులు రాజకీయ చక్రం అడ్డు వేసేందుకు రంగంలోకి దిగారు. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యుడి శరణు కోరారు. ఆయన ద్వారా ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నాయకుడి నుంచి విచారణాధికారుల మీద ఒత్తిడి తెప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖకు వెనక్కు ఇవ్వాల్సిన బియ్యం మొత్తం  ఈనెల 30వ తేదీలోపు ఏదో ఒక విధంగా వెనక్కు ఇచ్చేస్తామని విచారణ ఇంతటితో ముగించేలా చూడాలని కోరినట్లు  తెలిసింది. ఈ పనిచేసిపెడితే ఎవరిని ఎలా సన్మానించుకోవాలో అలా సన్మానించుకుంటామని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
తప్పించుకు తిరుగుతున్న అక్రమార్కులు
ధాన్యం తీసుకోవడం, బియ్యం తిరిగి  ఇవ్వడంలో కచ్చితంగా వ్యవహరించిన మిల్లర్లు దీని గురించి పట్టించుకోవడం లేదు. లేని మిల్లులు ఉన్నట్లు చూపించి ధాన్యం తీసుకున్న వారు మాత్రం ఏసీబీ, రెవెన్యూ అధికారులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వెంకటాచలంలో ఒక మిల్లు యజమాని తన రికార్డులు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తీసుకుని వెళ్లారని చెప్పారు. నెల్లూరు రూరల్‌లోని ఒక యజమాని మిల్లుకు తాళం వేసి ఎక్కడికో వెళ్లారు.  విచారణ ముందుకు పోకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ఎవరికి దొరక్కుండా పోతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. 22 మిల్లుల నుంచి బస్తా బియ్యం వెనక్కు రాలేదని చెబుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ మిల్లుల వివరాలు, ఎంత ధాన్యం పంపిందీ, ఎంత బియ్యం వచ్చిందనే వివరాలు చెప్పకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కొందరు మిల్లర్లు  ప్రభుత్వం ఇచ్చిన ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని మర పట్టి ఆ బియ్యం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నారనే విషయం నిర్ధారణ అయింది. పౌరసరఫరాల శాఖకు ఇప్పటికే సరఫరాచేసిన బియ్యంలో నాసిరకంవి ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement