కుమ్మక్కు..కక్కుర్తి
► టెండర్‌లో ఫస్ట్ క్వాలిటీ.. సరఫరాలో లో క్వాలిటీ
► ప్రతిదఫా ఆ ఇద్దరికే కాంట్రాక్ట్
► చర్యలకు వెనుకాడుతున్న అధికారులు
► నేడు వసతిగృహాలకు వంట సరుకుల సరఫరాకు టెండర్లు
సంక్షేమ వసతి గృహాలు అధికారులకే కాదు.. కక్కుర్తి కాంట్రాక్టర్లకు వరప్రసాదినిగా మారుతున్నాయి. వసతి గృహ విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించేందుకు అవసరైన నాణ్యమైన సరుకులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఫస్ట్ క్వాలిటీ రేట్లు కేటాయిస్తున్నా.. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై.. కక్కుర్తిగా వ్యవహరిస్తున్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేసి జేబులు నింపు కుంటున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలోని వసతి గృహాలకు ఇద్దరు వ్యక్తులే సరుకులు సరఫరా చేస్తున్నారంటే.. టెండర్ల ప్రక్రియలోనూ అవకతవకలు జరుగుతు న్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలకు వంట సరుకుల సరఫరాలో భారీగానే అవి నీతి జరుగుతోంది. సరుకుల సరఫరా టెండర్ల ప్రక్రియ నుంచే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మ క్కు, కక్కుర్తికి పాల్పడుతున్నారు. టెం డర్లలో ఫస్ట్ క్వాలిటీ సరుకులకు రేట్లను వేస్తూ సరఫరాలో మాత్రంలో నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా ఆ ఇద్దరికే టెం డర్లు దక్కడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. 2017–18 సంవత్సరానికి సంబంధించివసతిగృహాలకు సరుకుల పంపిణీ చేసేందుకు గురువారం టెండర్లు వేయనున్నారు.
ప్రతిదఫా ఆ ఇద్దరికే కాంట్రాక్ట్!
వసతి గృహాల్లో సరుకుల సరఫరాకు పినాకిని, కోడిగుడ్లకు గూడూరుకు చెందిన జిలాని అనే వ్యక్తులు ఏటా టెండర్లు వేస్తున్నారు. ప్రతి సారి వీరికే కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం. గతంలో ధరలు పెరగడంతో వసతిగృహాలకు సరుకులు, కోడిగుడ్లను సరఫరా చేయకుండా నిలిపివేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎంతమంది టెండర్లు వేసినా వీరికే కాంట్రాక్ట్ ఎలా దక్కుతుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
షోకాజ్ నోటీసులు జారీ
వసతిగృహాలకు టెండర్ ప్రకారం కాకుండా లో క్వాలిటీ సరుకులు పంపిణీ చేసినట్లు ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో అప్పట్లో కాంట్రాక్టర్‌కు మొదటి తప్పు కింద షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. కోడిగుడ్లు కూడా చెప్పిన ప్రకారం కాకుండా చిన్నవిగా, కొన్ని గుడ్లు పనికిరాకుండా ఉన్నవి సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్‌కు అధికారులు హెచ్చరికలు జారీ చేసినా లాభం లేకుండా ఉందని విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది కుక్కర్లు, మిక్సీలకూ టెండర్లు
ఏటా వంట సరుకులు, కోడిగుడ్లు, అరటì æపండ్ల మాత్రమే వసతిగృహాలకు సరఫరా చేసే విధంగా టెండర్లు వేస్తుంటారు. ఈ ఏడాది వీటితో పాటు వసతిగృహాలకు కుక్కర్లు, మిక్సీలు, ట్రంకుపెట్టెలకు కూడా టెండర్లు విడుదల చేశారు. వంట సరుకులను నిబంధనల ప్రకారం సరఫరా చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ ఏడాది సరఫరా చేయనున్న మిక్సీలు, కుక్కర్లు, ట్రంకుపెట్టల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బ్లాక్‌లిస్టులో పెడతాం
వసతిగృహాలకు పంపిణీచేసే సరుకుల విషయంలో ఎటువంటి తేడాలున్నా కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతాం. గతంలో కొన్ని సరుకుల విషయంలో నాణ్యతా లోపం ఉండటంతో వారికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాం. ఈ ఏడాది మాత్రం ఎవరు తప్పు చేసినా వారినిబ్లాక్ లిస్టులో పెట్టేస్తాం. మిక్సీలు, కుక్కర్లు, ట్రంకుపెట్టల సరఫరాలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలకు వెనుకాడం. – మధుసూదన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ