నిజామాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పరిశీలిస్తున్న అకున్ సబర్వాల్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సర్కారు ధాన్యంతో సొంత వ్యాపారాలు చేసుకోవడానికి మరిగిన కొందరు రైసు మిల్లర్లకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల సంస్థ కమిషనర్ అకున్ సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.90 కోట్లకు పైగా విలువ చేసే 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించకుండా సాకులు చెబుతున్న మిల్లర్ల నుంచి ఆ బియ్యాన్ని ముక్కుపిండి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. శనివారం జిల్లాలో పర్యటించిన సబర్వాల్.. జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు చాంబర్‌లో రైసుమిల్లర్లతో భేటీ అయ్యారు. ఈ సర్కారు బియ్యాన్ని వెంటనే ఎఫ్‌సీఐకి అప్పగించాలని ఆయన మిల్లర్లను ఆదేశించారు.
సాకులు చెబుతున్న మిల్లర్లు..?
2018 ఖరీఫ్ సీజనులో జిల్లాలోని రైతుల వద్ద ప్రభుత్వం 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సీఎంఆర్ (మర ఆడించి బి య్యం ఇవ్వడం) కోసం రైసుమిల్లులకు ఈ ధాన్యా న్ని అప్పగించింది. సుమారు 1.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైసుమిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 35 వేల మెట్రిక్ టన్ను ల బియ్యం ఇవ్వకుండా మిల్లర్లు సాకులు చెబుతు వస్తున్నారు. ఎఫ్‌సీఐ అధికారులు నాణ్యత లేదం టూ బియ్యాన్ని తిరస్కరిస్తున్నారంటూ దాట వేస్తూ వస్తున్నారు. ఇలా నెలల తరబడి సర్కారు బియ్యాన్ని తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో సబర్వాల్ సీరియస్ అయ్యారు. దీనిపై ప్రత్యేక కమిటీ నియమించారు. పౌరసరఫరాల సంస్థలోని టెక్నికల్ అధికారి, రైసుమిల్లర్లకు సంబంధించిన ఓ ప్రతినిధి, ఎఫ్‌సీఐ అధికారులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ మిల్లర్లు ఇస్తున్న బియ్యాన్ని ఎఫ్‌సీఐకి వెంట వెంటనే అప్పగించడంలో కీలకంగా వ్యవహరించనుంది.
నిర్వహణ వ్యయాన్ని అధిగమించేందుకు..
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వద్ద ఇప్పటికే రాష్ట్ర ఏడాది అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలున్నాయి. ఈ 35 వేల మెట్రిక్ టన్నులను కూడా తమ వద్ద ఉంచుకుంటే రూ.90 కోట్ల విలువ చేసే ఈ బియ్యంపై వడ్డీతో పాటు నిల్వ చేసేందుకు నిర్వహణ వ్యయం భారం పడుతుందని భావించి ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ మిల్లర్లు మాత్రం ఈ బియ్యాన్ని ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే నాణ్యత పేరుతో ఎఫ్‌సీఐ అధికారులే బియ్యాన్ని తిరస్కరిస్తున్నారనే సాకులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా నియమించిన ఈ కమిటీ రైసుమిల్లర్లు ఇచ్చిన బియ్యం ఎఫ్‌సీఐకి వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. కాగా బకాయిపడిన 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ నెల 29 నుంచి సరఫరా చేస్తామని మిల్లర్లు హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment