మిల్లర్లు, అధికారులు మిలాఖత్‌ | Nexus between millers, officers | Sakshi
Sakshi News home page

మిల్లర్లు, అధికారులు మిలాఖత్‌

Published Wed, Aug 10 2016 2:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

మిల్లర్లు, అధికారులు మిలాఖత్‌ - Sakshi

మిల్లర్లు, అధికారులు మిలాఖత్‌

 
  •  సీఎంఆర్‌ వ్యవహారంలో చేతులు మారిన రూ.50 కోట్లు
  •  గత ఏడాది విజిలెన్స్‌ దాడులతో మేల్కొనని అధికారులు
  •   ఈసారి 22 మిల్లుల నుంచి ఒక్క బస్తా బియ్యం వెనక్కు రాలేదు
 
(సాక్షి ప్రతినిధి – నెల్లూరు)
గత రబీ సీజన్‌లో జిల్లాలో జరిపిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) వ్యవహారంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ధాన్యం సేకరణ మొదలు మిల్లర్ల నుంచి తిరిగి బియ్యం తీసుకునే వరకు జరిగిన ప్రక్రియ ప్రహసనంగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. గత ఏడాది జరిగిన అక్రమాలను విజిలెన్స్‌ విభాగం బయటపెట్టినా, పౌరసరఫరాల శాఖ అధికారులు ఈసారి మరొక అడుగు ముందుకేసి బరితెగించారు. ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు ప్రైవేట్‌ వ్యాపారం చేసుకోవడానికి యథాశక్తి సహకరించడానికి కారణం ఏమై ఉంటుందో నేరుగా చెప్పక్కర్లేదు. అవినీతి నిరోధక శాఖ 10 ప్రత్యేక బృందాలతో జిల్లాలోని మిల్లులపై సోమవారం ప్రారంభించిన తనిఖీలు మంగళవారం రాత్రి దాకా కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్‌పీ తోట ప్రభాకర్‌ పౌరసరఫరాల శాఖ అధికారులను అనేక దఫాలుగా విచారించి, రికార్డులు తెప్పించుకున్నారు. 
ఈసారి 22 మిల్లుల నుంచి బస్తా బియ్యం రాలేదు
గత రబీ సీజన్‌లో జిల్లాలో ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ రంగంలోకి దిగింది. పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో «జిల్లాలో 169 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి జూన్‌ 17వ తేదీ నాటికి 3.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.478.50 కోట్లు చెల్లించింది. వీటిని జిల్లాలోని 176 మంది మిల్లర్లకు ఇచ్చినట్లు అధికారులు రికార్డులు రాశారు. గత ఏడాది జరిపిన సీఎంఆర్‌ బియ్యం సేకరణలో నాలుగు మిల్లుల నుంచి రూ.6 కోట్ల విలువ చేసే బియ్యం పౌర సరఫరాల శాఖకు తిరిగి రాలేదు. ఈసారి ఏకంగా  22 మిల్లుల నుంచి ఒక్క బస్తా బియ్యం కూడా వెనక్కు రాలేదు.
 
ఇవీ అక్రమాలు
  •  బోగోలులో వెంకటరమణ రైస్‌మిల్లును అధికారులు సీజ్‌ చేశారు. ఈ రైస్‌ మిల్లుకు రూ.2 కోట్ల విలువ చేసే 1385.68 మెట్రిక్‌ టన్నుల ధాన్యం బియ్యంగా మార్చడానికి పంపినట్లు అధికారుల రికార్డుల్లో రాశారు. తన మిల్లు పేరుతో ఎవరో ధాన్యం తీసుకున్నారని, ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని మిల్లు యజమాని ఈ ఏడాది మేలో అధికారులకు ఫిర్యాదు చేసినా దాని గురించి పట్టించుకోలేదు. వెయ్యి టన్నుల మిల్లింగ్‌ సామర్థ్యం కూడా లేని అనేక మిల్లులకు రెండింతలు, మూడింతల ధాన్యం ఇచ్చారు. 
  •  జూన్‌ 17 లోపు పంపిన 3.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి 2.28 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు వెనక్కు ఇవ్వాలి. మంగళవారం నాటికి కేవలం 80 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే వెనక్కు వచ్చాయి. మిగిలిన 1.48 లక్షల మెట్రిక్‌ టన్నుల  బియ్యం వెనక్కు రాలేదు. వీటి విలువ సుమారు 400 కోట్లు ఉంటుంది.
  •   మిల్లర్ల నుంచి  రూ.478.50 కోట్లు బ్యాంకు గ్యారంటీ తీసుకోవాల్సిన అధికారులు కేవలం రూ.39 కోట్లకు మాత్రమే సక్రమంగా బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నారు. రూ.269 కోట్లకు ముందస్తు తేదీలతో చెక్కులు తీసుకుని ప్రభుత్వానికి టోపీ పెట్టారు. ఇప్పుడా అకౌంట్లలో సొమ్ములు లేవు.
  •  మిల్లర్లు బియ్యం నింపి ఇవ్వడం కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు 82 లక్షల 50 వేల గన్నీ బ్యాగులు ఇచ్చారు. జిల్లాలోని మిల్లులన్నీ తిరిగినా ఈ సంచులకు కూడా లెక్క తేలడం లేదు
భారీ అవినీతి
సీఎంఆర్‌ బియ్యం సేకరణలో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పెద్దస్థాయి అధికారులు లేనిదే ఈ అక్రమాలు వీలు పడదని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు ప్రైవేట్‌ వ్యాపారం చేసుకోవడానికి అధికారులు సహకరించారని, ఇందులో కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండొచ్చని ఏసీబీ డీఎస్‌పీ తోట ప్రభాకర్‌ ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదిక పంపారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి మరో రెండు, మూడు రోజుల్లో మరో నివేదిక అందచేయనున్నారు. 
 
సెప్టెంబరు లోగా బియ్యం తీసుకుంటాం :  ఇంతియాజ్, జేసీ
మిల్లర్ల నుంచి సెప్టెంబరు 30వ తేదీలోగా సీఎంఆర్‌ బియ్యం తీసుకుంటాం. ఎవరైనా అక్రమాలు పాల్పడి ఉంటే క్రిమినల్‌ కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ద్వారా సొమ్ము వసూలు చేస్తాం. గత ఏడాది బియ్యం వెనక్కు ఇవ్వని నెల్లూరుకు చెందిన నలుగురు మిల్లర్ల మీద క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించాం. ఏసీబీ నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం.
 
 
బియ్యం అవినీతి సమాచారం ఉంటే ఇవ్వండి : తోట ప్రభాకర్, ఏసీబీ డీఎస్‌పీ
సీఎంఆర్‌ బియ్యం సేకరణకు సంబం«ధించిన అవినీతిపై ఏదైనా సమాచారం ఉంటే తెలియచేయాలని కోరుతున్నాను. మిల్లర్లు గానీ ప్రజలు గానీ నేరుగా మా ఆఫీసుకు వచ్చి నన్ను కలవచ్చు. లేదా  94404 46184 నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement