సీఎమ్మార్‌ సేకరణకు ఏడు బృందాలు | seven teams for CMR rice collection | Sakshi
Sakshi News home page

సీఎమ్మార్‌ సేకరణకు ఏడు బృందాలు

Published Sun, Aug 21 2016 12:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

సీఎమ్మార్‌ సేకరణకు ఏడు బృందాలు - Sakshi

సీఎమ్మార్‌ సేకరణకు ఏడు బృందాలు

  • 114 రైస్‌మిల్లులకు వే బిల్లులు కట్‌
  • నెల్లూరు (పొగతోట): ప్రభుత్వం సరఫరా చేసిన సీఎమ్మార్‌ ధాన్యంలో అనేక మంది రైస్‌మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలించి తేల్చడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. సీఎమ్మార్‌ సేకరణకు గానూ ఏడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లు, ఒక ఏఎస్‌ఓ ఉంటారు. ఈ బృందాలు రైస్‌ మిల్లుల్లో «ధాన్యం నిల్వలను పరిశీలించి సీఎమ్మార్‌ను సరఫరా చేసేలా చర్యలు చేపడతారు. బృందాల ఆధ్వర్యంలో ధాన్యాన్ని ఆడించి సీఎమ్మార్‌ను సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం రైస్‌ మిల్లుల్లో రికార్డులు, ధాన్యం నిల్వలను పరిశీలించి సీఎమ్మార్‌ను సరఫరా చేయిస్తున్నారు. 
    బయటపడుతున్న అవకతవకలు
    బృందాల పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. అధిక శాతం రైస్‌ మిల్లుల్లో ధాన్యం సరఫరా, నిల్వలకు సంబంధించిన రికార్డులను నిర్వహించడంలేదు. ధాన్యాన్ని ఎంత సరఫరా చేశారు.. ఎంత ఆడించారు.. నిల్వ..తదితర వివరాలను తెలిపే రికార్డులు లేవు. మిల్లుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం నిల్వలు కనిపించకపోవడంతో కేసులు నమోదు చేస్తున్నారు. గత సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సుమారు రూ.478 కోట్ల విలువజేసే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. రైస్‌మిల్లర్లు 2.25 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా సీఎమ్మార్‌ను సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు లక్ష మెట్రిక్‌ టన్నులను మాత్రమే సరఫరా చేశారు. ప్రస్తుతం అధిక శాతం రైస్‌ మిల్లర్ల వద్ద గ్రేడ్‌ – బీ ధాన్యం నిల్వ ఉంది. ధాన్యాన్ని ఆడించి సీఎమ్మార్‌ను ఎఫ్‌సీఐకి సరఫరా చేసినా వాటిని సేకరించారు. ఈ క్రమంలో ఏమి చేయాలో పాలుపోక మిల్లర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్టోబర్‌ వరకు సమయం కోరుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల చివరిలోపు వంద శాతం సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. 
    114 మిల్లుల్లో విక్రయాలు జరగకుండా చర్యలు
    సీఎమ్మార్‌ను సరఫరా చేయకుండా జాప్యం చేస్తున్న 114 రైస్‌ మిల్లులకు వే బిల్లులను కట్‌ చేస్తూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులతో చర్చించి వీటికి వే బిల్లులు జనరేట్‌ కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ రైస్‌మిల్లుల్లో బియ్యం విక్రయాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
    సీఎమ్మార్‌ను సరఫరా చేస్తేనే వే బిల్లులను మంజూరు చేయనున్నారు. మరోవైపు సీఎమ్మార్‌ అవకతవకలపై ఎవరిపై చర్యలు తీసుకుంటారోనని పౌరసరఫరాల శాఖ అధికారులు వణికిపోతున్నారు. అధికారులు అడిగిన నివేదికలను ఒకరికి తెలియకుండా మరొకరు సమర్పిస్తున్నారు.
    రైస్‌మిల్లర్లకు చినబాబు అభయం..!
    కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎమ్మార్‌)ను సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం చేసిన మిల్లర్లపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదికలు పంపిన నేపథ్యంలో మిల్లర్లు సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఆశ్రయించారు. విషయాన్ని తాను చూసుకుంటానని లోకేష్‌ వారికి అభయమిచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం సరఫరా చేసిన సీఎమ్మార్‌ ధాన్యాన్ని అనేక మంది మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించడంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్‌ను ఆశ్రయించి తమకు అండగా నిలవాలని అభ్యర్థించారు. సరఫరా చేసిన దానికి, ప్రస్తుతం రైస్‌ మిల్లుల్లో ఉన్న నిల్వలకు పొంతన లేకపోవడంతో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement