సీఎమ్మార్ ఇవ్వకపోతే చర్యలు
నెల్లూరు(పొగతోట): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను నిర్దేశించిన సమయంలోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో సీఎస్డీటీలు, రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వచ్చే నెల పదో తేదీలోపు 75 శాతం సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లకు 2.15 లక్షల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వివరించారు. ఇప్పటి వరకు 86 వేల టన్నుల సీఎమ్మార్‌ను సరఫరా చేశారన్నారు. బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐకు సరఫరా చేయాలని పేర్కొన్నారు. రెడ్, బ్లూ రెండు రకాల గన్నీ బ్యాగుల్లో సీఎమ్మార్‌ను సరఫరా చేయాలని పేర్కొన్నారు. అనంతరం రైస్‌మిల్లర్లు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సీఎమ్మార్‌ను పూర్తిస్థాయిలో సరఫరా చేయాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు. డీఎస్‌ఓ ధర్మారెడ్డి, డీఎం కొండయ్య, ఏఎస్‌ఓలు, సీఎస్డీటీలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యంరెడ్డి, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.