సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ తర్వాత సైతం కొనసాగించే అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ కారణాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పథకం ద్వారా 81 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం ప్రతి నెల ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. నిజానికి ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించడం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత బియ్యం పథకాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని అధికార బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది.
గతంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలు అండగా నిలిచిన నేపథ్యంలో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించి ఈసారీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. దీంతోపాటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రెండేళ్లుగా ఏడాది గరిష్టంగా ఒక్కో రీఫిల్‌కు రూ.200 సబ్సిడీ చొప్పున 12 సిలిండర్లను రాయితీ ధరకు అందిస్తోంది. వంటగ్యాస్ ధరలు ఎక్కువ స్థాయిలోనే కొనసాగితే ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment