సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్ అందిస్తున్న ఆహార ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లు అందజేయాలని కూడా నిర్ణయించారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీని లక్ష్యమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకాన్ని రెండేళ్ల పాటు కొనసాగిస్తాం. మహిళా సంఘాలకు డ్రోన్ల కొనుగోలు వ్యయంలో 80 శాతం దాకా ఆర్థిక సాయం అందిస్తాం. ఇందుకు ఏటా రూ.1,261 కోట్లు కేటాయిస్తున్నాం. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కలి్పస్తాం. ఈ డ్రోన్లను వ్యవసాయ సేవల నిమిత్తం రైతులకు మహిళా సంఘాలు అద్దెకిస్తాయి. తద్వారా ఒక్కో సంఘం ఏటా కనీసం రూ.లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు’’ అని వివరించారు.
మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేస్తామని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఇక పీఎంజీకేఏవైను మరో ఐదేళ్లు కొనసాగించేందుకు రూ.11.8 లక్షల కోట్లు అవసరమని మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో 2020లో కేంద్రం ఈ పథకాన్ని మొదలు పెట్టడం తెలిసిందే. 2026 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ శాతం తదితరాలపై సలహాలు, సూచనలకు ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘం తాలూకు విధి విధానాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కమిషన్ 2025 అక్టోబర్ అంతానికల్లా నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జనజాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.45 కోట్లు గిరిజన జనాభా ఉంది. అందులో 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్‌లోని 75 గిరిజన సమూహాలను ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మూడేళ్లు కొనసాగించేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment