కోరుట్ల: ధాన్యం మిల్లింగ్‌లో అధికారులు..ప్రజాప్రతినిధులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలిపోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఏటా స్థానిక మిల్లర్లు అభ్యంతరాలు తెలుపుతున్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఎప్పటిలాగే ఈ ఖరీఫ్ సీజన్‌లో మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంగా మారింది.
ఇదీ..తిరకాసు
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సివిల్ సప్లయ్ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 35 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 60 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఒక్క సీజన్‌లో జిల్లాలోని అన్ని రైస్‌మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పరిగణనలోకి తీసుకుంటే మూడు లక్షల మెట్రిక్ టన్నులపైగానే ఉంటుంది. అయినప్పటికీ జిల్లాలోని రైస్‌మిల్లులకు ఉత్పత్తి అయిన ధాన్యంలో కేవలం 1,35,100 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లింగ్‌కు కేటాయించారు. మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. స్థానికంగా రైస్ మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికి పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వెనక ఏదో తిరకాసు ఉందని స్థానిక రైస్‌మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.17కోట్ల భారం
మిల్లర్ల విషయాన్ని పక్కన బెడితే ఒక్కో క్వింటాలుకు రూ.15 చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది. 1,15,250 మెట్రిక్ టన్నుల ధా న్యం జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి పరిసరాల కు తరలించడానికి ఎంత తక్కువ అనుకున్నా రూ. 17 కోట్లకు మించిన రవాణా భారం పడుతుంది. జిల్లాలోని దాదాపు 100 రైస్‌మిల్లుల్ల పనిచేసే సు మారు 5వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లింగ్ చేసేం దుకు అనుమతి వచ్చేలా ఒత్తిడి తెస్తే ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో అధికారులు..ప్రజాప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
మిల్లింగ్ సామర్థ్యం తక్కువ
జిల్లాలోని రైస్ మిల్లుల్లో మన దగ్గర ఉత్పత్తి అయిన ధాన్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం లే దు. ఈ కారణంగా పొరుగు జిల్లాల్లోని రైస్ మిల్లులకు పంపాల్సి వస్తోంది. ఇందులో ఏలాంటి సందేహాలకూ తావు లేదు. మిల్లింగ్ సామర్థ్యం పెరిగితే స్థానికంగా మిల్లర్లకు ధాన్యం కేటాయించడానికి ఇబ్బంది లేదు.
– చందన్‌కుమార్, ఏఎస్‌వో, సివిల్ సప్లయిస్
Comments
Please login to add a commentAdd a comment