మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట
తొలిసారిగా నిర్దేశిత గడువులో సీఎంఆర్ వసూలు
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా పౌర సరఫరాల శాఖ తొలిసారిగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను నిర్దేశిత గడువులోగా రాబట్టింది. నెల రోజుల వ్యవధిలో నిర్దేశిత గడువులో 98 శాతం.. అంటే రూ.421 కోట్ల విలువ చేసే 1.58 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టారు. పౌర సరఫరాల సంస్థ నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని అప్పగించడంలో మిల్లర్లు ఏటా తీవ్ర జాప్యం చేస్తున్నారు.
సీఎంఆర్‌ను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పౌర సరఫరాల చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది మిల్లర్లు సీఎంఆర్‌ను ఎగవేస్తూ.. కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లులు, సీఎంఆర్ ఎగవేతదారులు, కేసులున్న వారికి కూడా సీఎంఆర్ ఇవ్వడం వంటి తప్పిదాలు పునరావృతమవుతూ వచ్చాయి. 2014-15లో మిల్లర్ల నుంచి 16.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా.. 15.07 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించారు. రూ. 350 కోట్ల విలువ చేసే 1.38 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌర సరఫరాల శాఖకు బాకీ పడ్డారు. పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం.. 2010-11 నుంచి 2014-15 వరకు 115 మంది మిల్లర్లు రూ.133.39 కోట్లు విలువ చేసే 57,781 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగవేశారు.
ఈ ఏడాది 98 శాతం వసూలు
2015-16కు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి పౌర సరఫరాల శాఖ సేకరించి.. సీఎంఆర్‌లో భాగంగా 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించింది. క్వింటాలు ధాన్యానికి 68 కిలోల బాయిల్డ్ రైస్ లేదా 67 కిలోల ముడి బియ్యాన్ని తిరిగి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2015-16లో మిల్లర్ల నుంచి 15.88 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 30 నాటికి 15.66 లక్షల మెట్రిక్ టన్నులు అప్పగించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సీఎంఆర్ బకాయిలను రాబట్టేందుకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తరచూ మిల్లర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఎస్‌వోలు, పౌర సరఫరాల శాఖ డీఎంలతో సమీక్షలు నిర్వహించారు. అధికారులు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి మిల్లర్లపై ఒత్తిడి తేవడంతో 98 శాతం మేర సీఎంఆర్ రాబట్టారు. కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో వంద శాతం సీఎంఆర్‌ను వసూలు చేయడం ద్వారా పౌర సరఫరాల శాఖ రికార్డు సృష్టించింది. ఇకపై సీఎంఆర్ ఇచ్చే మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఎగవేతదారులు, కేసులు నమోదైన వారికి సీఎంఆర్ ఇవ్వకూడదని నిర్ణయించారు.