పూర్తికాని లెవీ సేకరణ
మిర్యాలగూడ : ప్రజావసరాల కోసం ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రతిఏటా మిల్లర్ల నుంచి సేకరించే లెవీబియ్యం లక్ష్యం నెరవేరలేదు. సేకరణకు గడువు ఇంకా 20 రోజులే ఉన్నా, మొత్తంగా 77శాతం లక్ష్యమే పూర్తయ్యింది. 2013-14వ సంవత్సరానికి గాను గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి లెవీబియ్యం సేకరణ ప్రారంభించారు. జిల్లాలో వరిసాగు గణనీయంగా ఉన్నప్పటికీ, మిల్లర్ల పట్ల అధికారులు మెతకవైఖరి అవలంబించడం వల్ల లెవీ సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2012-13లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 8.09 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. కాగా పచ్చిబియ్యం నూరుశాతం లక్ష్యం పూర్తి చేసినా, బాయిల్డ్ బియ్యం మాత్రం కేవలం 5.86 లక్షలు మెట్రిక్‌టన్నులు మాత్రమే సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. అయినా లెవీబియ్యం ఇవ్వని మిల్లర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, సాధ్యమైనంత త్వరగా టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది నుంచి నూతన లెవీ విధానం?
ఈ ఏడాది నుంచి కేంద్రప్రభుత్వం నూతన లెవీవిధానం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిల్లర్లు రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 25 శాతం బయట మార్కెట్‌లో విక్రయించుకునేవారు. కానీ నూతనవిధానం ద్వారా 25 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 75 శాతం బయట మార్కెట్‌లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కాగా 2014-15లో లెవీబియ్యం సేకరణ లక్ష్యం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.