బియ్యం ‘మార్కెట్' ఫ్రీ | Rice 'market' in the Free | Sakshi
Sakshi News home page

బియ్యం ‘మార్కెట్' ఫ్రీ

Published Sat, Nov 29 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

Rice 'market' in the Free

నెల్లూరు (రెవెన్యూ) : కేంద్ర ప్రభుత్వం బియ్యం మార్కెట్‌కు స్వేచ్ఛ కల్పించింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) లెవీ సేకరణలో మార్పులు చేపట్టిన కేంద్రం తాజాగా మరో జీఓ ద్వారా పర్మిట్లు లేకుండా ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా నేరుగా తీసుకెళ్లి విక్రయించుకునేందుకు మిల్లర్లకు ద్వారాలు తెరిచింది.

కేంద్రం తీసుకున్న నూతన విధానం మిల్లర్లకు ఆదాయం పెరుగుతుండగా, ప్రభుత్వ ఖజానాకు మాత్రం గండి పడనుంది. కేంద్రం లెవీ సేకరణ తగ్గించడంతో మిగులు బియ్యం అమ్ముకునేందుకు మిల్లర్లు సైతం నానా పాట్లు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. నాణ్యమైన బియ్యా నికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో జిల్లాలో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.

 భారత ఆహార సంస్థ గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం లెవీగా కొనుగోలు చేసేది. మిగిలిన 25 శాతం బియ్యాన్ని రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు వీలుగా పర్మిట్లు మంజూరు చేసేది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేది. ప్రస్తుతం పర్మిట్ విధానం రద్దు చేయడంతో రాబడికి గండిపడే అవకాశం ఉంది.

ఇటీవల కేంద్రం లెవీ నిబంధనల్లో మార్పులు చేసి మిల్లర్ల నుంచి  25 శాతం లెవీగా తీసుకోవాలని నిర్ణయించింది. మిగిలిన 75 శాతం బియ్యం మిల్లర్లు అమ్ముకునే వీలు కల్పించింది. ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు పర్మిట్ల నిబంధనలు అలాగే ఉంచింది. దీంతో మిల్లర్లు 75 శాతం బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో ఎలా అమ్ముకోవడమని తలలు పట్టుకున్నారు.

అయితే తాజాగా కేంద్రం ఈనెల 27న మరో జీఓ జారీ చేసింది. మిల్లర్లు 75 శాతం బియ్యాన్ని రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకోవచ్చని, ఇందుకు పర్మిట్లు అవసరం లేదని స్పష్టం చేసింది. ఏ రైతు వద్ద ఎంత కొనుగోలు చేశారు.. ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి తరలిస్తున్నారో మాత్రం తెలియజేసి రికార్డుల్లో పొందుపరిస్తే చాలనేది కొత్త జీఓ సారాంశం.

కొత్త నిబంధనలతో జిల్లాలో బియ్యానికి రెక్కలొస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 25 శాతం బియ్యం పేరుతో మిల్లర్లు నాణ్యమైన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు నానా అడ్డదార్లు తొక్కేవారు. ఇప్పుడు స్వేచ్ఛ ఉండటంతో పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతే జిల్లాలో డిమాండ్ ఏర్పడి బియ్యం ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

 రైతులకు ‘మద్దతు' కరువు
 కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులకు మద్దతు ధర కరువయ్యే పరిస్థితి పొంచి ఉంది. ఎఫ్‌సీఐ 25 శాతమే తీసుకుని మిగిలిని 75 శాతం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడం కష్టమని, రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగొలు చేస్తే తాము నష్టపోతామని మిల్లర్లు బహిరంగంగానే చెబుతున్నారు. సమీప రాష్ట్రాల్లో కూడా వరి పంటలు బాగా పండుతున్నాయని, అక్కడ మన బియ్యంకు అంత డిమాండ్ లేదని మిల్లర్లు చెబుతున్నారు.

 పక్క రాష్ట్రాల్లో నాణ్యమైన బియ్యానికి గిరాకీ :
 తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నాణ్యమైన బియ్యానికి గిరాకీ ఉంది. దీంతో ఇక్కడ పండే నాణ్యమైన బియ్యం గతంలో 25 శాతం మాత్రమే అధికారికంగా వెళుతున్నా.. అనధికారికంగా మరెంతో వెళుతుండేది. ఇప్పుడు కేంద్రం బియ్యం మార్కెట్‌కు స్వేచ్ఛ కల్పించడంతో నాణ్యమైన బియ్యం భారీగా తరలిపోయే అవకాశం ఉంది.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన బియ్యం కిలో రూ.40లకు మించి ఉంది. నూతన విధానం వల్ల బియ్యం ధరలు అకాశాన్నంటే అవకాశం ఉంది. అదే సమయంలో సాధారణ రకాలకు డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశాలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

 నూతన విధానంలో ధాన్యం కొనుగోలు : సంధ్యారాణి, డీఎస్‌ఓ
 నూతన విధానంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేపట్టాలి.

25 శాతం లెవీ కింద ప్రభుత్వానికి ఇచ్చి మిగిలిన 75 శాతం బహిరంగా మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడానికి ప్రత్యేక పర్మిట్లు అవసరం లేదు. ఎక్కడ కొనుగోలు చేశారు. ఎక్కడికి తీసుకుపోతున్నారో తదితర వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.

 రైతులు, మిల్లర్లు ఇద్దరికి నష్టం - సుబ్రహ్మణ్యంరెడ్డి,రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతు, మిల్లర్లు ఇద్దరు నష్టపోతారు. పాత విధానంలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులు, మిల్లర్లు ఇద్దరికి నష్టం ఉండదు. నూతన విధానంతో 25 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలి. 75 శాతం ఇతర రాష్ట్రాల్లో  విక్రయించుకోవచ్చు.

నూతన విధానం వల్ల ధాన్యం ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు పర్మిట్లు అవసరం లేదు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ధాన్యం అధికంగా పండిస్తున్నారు. దాని వల్ల బియ్యానికి డిమాండ్ లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించలేక నిల్వ చేయడానికి స్థలం లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement