‘సన్నా’లపై సన్నాయి రాగం
సన్న బియ్యం సరఫరాలో బడా మిల్లర్ల జిమ్మిక్కులు
మార్కెట్‌లో సన్న ధాన్యం ధర తక్కువ ఉన్నప్పుడు సరఫరా..
ఇప్పుడు ఈ ధర పెరగ్గానే.. ఇతర మిల్లర్లపై ఒత్తిడి..
వ్యతిరేకించిన చిన్నా, చితక మిల్లర్లు..
ప్రశ్నార్థకంగా 5,800 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ
నిజామాబాద్ :సర్కారుకు సన్న (బీపీటీ) బియ్యం సరఫరాలో మిల్లర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. అత్యధిక లాభాల పంట పండించే స్టీమ్ రైస్‌ను రాజకీయ పలుకుబడి కలిగిన కొద్ది మంది మిల్లర్లు సరఫరా చేయగా.. ఇప్పుడు రాౖ రెస్ విషయానికి వచ్చే సరికి చిన్న, చితక మిల్లర్లపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఒకవర్గం మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సర్కారు సన్న బియ్యం సేకరణ ప్రశ్నార్థకంగా తయారైంది. మధ్యాహ్న భోజన పథకం, వివిధ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనం వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందుకోసం అవసరమైన సన్న బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరిస్తోంది. క్వింటాలలుకు రూ.మూడు వేల చొప్పున మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సన్న బియ్యం సేకరణ ప్రక్రియ చేపట్టారు.
స్టీమ్ రైస్ సరఫరాలో లాభాల పంట
పౌర సరఫరాల సంస్థ ఇప్పటి వరకు 4,900 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం స్టీమ్ రైస్ సేకరించింది. గత నెల రోజులుగా మార్కెట్‌లో సన్న రకాల ధాన్యం తక్కువ ధరకు లభించింది. జైశ్రీరాం వంటి రకాలు కూడా రూ.1,700 వరకు తగ్గింది. ఇలా సన్న రకం ధాన్యం మార్కెట్‌లో తక్కువ ధరకు లభించినప్పుడు రాజకీయ అండదండలున్న మిల్లర్లు పెద్ద మొత్తంలో సన్న బియ్యాన్ని సర్కారుకు అంటగట్టి లాభాలను ఆర్జించారు. కేవలం తొమ్మిది మంది బడా మిల్లర్లు ఒక్కొక్కరు 20 నుంచి 45 ఏసీకేలు స్టీమ్ రైస్ సరఫరా చేశారు. తీరా ఇప్పుడు రా రైస్ విషయానికి వస్తే మాత్రం జిల్లాలో ఉన్న అందరు మిల్లర్లు సరఫరా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చిన్నా, చితక మిల్లర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. స్టీమ్ రైస్ సరఫరా చేసి లాభాలను ఆర్జిన మిల్లర్లే ఇప్పుడు రా రైస్ కూడా సరఫరా చేయాలని ఇటీవల జరిగిన మిల్లర్ల సమావేశంలో డిమాండ్ చేసినట్లు సమాచారం.
5,800 మెట్రిక్ టన్నుల రా రైస్
రానున్న తొమ్మిది నెలల అవసరాల కోసం అదనంగా 5,800 మెట్రిక్ టన్నుల రా రైస్ కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ సన్నద్ధమవుతోంది. సరఫరా చేసే మిల్లర్ల జాబితా ఇవ్వాలని సంస్థ అధికారులు మిల్లర్స్ అసోసియేషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో మిల్లర్లు సమావేశమయ్యారు. రారైస్ జిల్లాలోని అందరు మిల్లర్లు సరఫరా చేయాలని బడా మిల్లర్లు ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం సన్న రకం ధాన్యానికి ధర పెరిగింది. క్వింటాలుకు రూ.రెండు వేల వరకు పలుకుతోంది. ఈ తరుణంలో రా రైస్ సరఫరా చేస్తే పెద్ద ఒరిగేదేమీ ఉండదని భావించిన బడా మిల్లర్లు ఇప్పుడు ఈ బాధ్యతను అందరు మిల్లర్లపై ఒత్తిడి తెచ్చారు.