పాలకొండ:వేల టన్నుల బియ్యాన్ని లెవీగా సేకరిస్తున్న అధికారులు.. వాటిని సకాలంలో తరలించి, సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేయడంపై శ్రద్ధ చూపడంలేదు. అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది బస్తాల బియ్యం నిల్వలను ఆరు బయలు ప్రాంతాల్లోనే వదిలేయడంతో మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. తమపై ఒత్తిడి చేసి కొనుగోలు చేయించిన అధికారులు.. బియ్యం తరలించేందుకు మాత్రం చొరవ చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 114 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు ఆరు లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.
క్వింటా ధాన్యానికి 67 కేజీలు చొప్పున బియ్యం లెవీగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మిల్లుల్లో స్థలాభావం ఉండటంతో బియ్యం ఆడించిన వెంటనే ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తున్నారు. అయితే గత పది రోజులుగా మిల్లుల నుంచి బియ్యం తరలింపు పూర్తి నిలిచిపోయింది. ఎఫ్‌సీఐ గోదాములు పూర్తిగా నిండిపోవడమే దీనికి కారణం. రణస్థలం మండలం పైడి భీమవరం, రాజాం ప్రాంతాల్లోని గోదాములు ఇప్పటికే బియ్యంతో నిండిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాములు ఖాళీగా ఉన్నప్పటికీ అధికారులు దృష్టి సారించకపోవడంతో అవి నిరుపయోగంగానే ఉన్నాయి. లెవీ బియ్యాన్ని వీటిలో నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు.
వర్షం వస్తే...
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాలు దాదాపు పూర్తి కావచ్చాయి. మిల్లులకు పూర్తిస్థాయిలో ధాన్యం చేరాయి. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని మిల్లుల వద్ద ఆరుబయట స్థలాల్లోనే నిల్వ చేస్తున్నారు. వందల టన్నుల బస్తాల బియ్యం ఇలా ఆరుబయటే ఉండిపోయాయి. కాగా గత రెండు రోజులుగా గాలులు వీస్తుండడం, సాయంత్రమైతే ఆకాశం మేఘావృతం అవుతుండడంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వర్షం పడినా కోట్లాది రూపాయల విలువ చేసే బియ్యం పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
బియ్యం నిల్వలను గోదాములకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కె.సాల్మన్‌రాజ్ తెలిపారు. గోదాములు నిండిపోయిన విషయం ఆయన వద్ద ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. మార్కెట్ కమిటీల్లో ఉన్న గోదాములను వినియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించి మిల్లర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.
లెవీ తరలింపులో లేజీ!
Published Mon, Mar 2 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement