రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలను దృష్టిలో పెట్టుకుని తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్రప్రభుత్వానికి మంత్రి శ్రీధర్‌బాబు వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలను దృష్టిలో పెట్టుకుని తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి కె.వి. థామస్‌తో సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలవల్ల దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా ఎఫ్‌సీఐ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను సడలించాలి. వర్షాలు, వరదలవల్ల దారుణంగా నష్టపోయిన రైతాంగాన్ని కొంతలోకొంతయినా ఆదుకునేందుకు తక్షణమే ఎఫ్‌సీఐకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలి’ అని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి థామస్ ఎఫ్‌సీఐ తరఫున వెంటనే రాష్ట్రానికి ఒక బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.