లోగుట్టు గిడ్డంగులకెరుక! | Huge Fraud On Warehouses In Telangana | Sakshi
Sakshi News home page

లోగుట్టు గిడ్డంగులకెరుక!

Published Thu, Feb 27 2020 2:11 AM | Last Updated on Thu, Feb 27 2020 4:30 AM

Huge Fraud On Warehouses In Telangana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బియ్యం నిల్వల పేరిట భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ప్రైవేటు పబ్లిక్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్మించిన గిడ్డంగులను ఏళ్ల తరబడిగా ఖాళీగా పెట్టి ఆమ్యామ్యాల కోసం ప్రైవేటు గిడ్డంగుల్లో నాలుగింతలు అధిక అద్దెతో బియ్యం నిల్వ చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఎఫ్‌సీఐ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్‌డబ్ల్యూహెచ్‌సీ) అధికారుల నిర్వాకంతో ఏటా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.

గిడ్డంగులకు అప్రోచ్‌ రోడ్డు ఉన్నా లేదని, లేదా మరేదో కుంటి సాకులు చూపి అధికారులు గత ఏడేళ్లుగా ప్రైవేటు గిడ్డంగులకు కోట్లాది రూపాయలను అప్పనంగా దోచిపెట్టారని ఆధారాలతోపాటు బయటపడింది. కొంతమంది ఎఫ్‌సీఐ అధికారులు తమ బినామీలతోనే ప్రైవేటు గిడ్డంగులను కట్టించి వారికే బియ్యం నిల్వ పనులు అప్పగిస్తున్నారని పీపీపీ విధానంలో గిడ్డంగులు నిర్మించి నష్టపోయిన పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. 

పథకం నేపథ్యం ఇదీ.. 
పీపీపీ విధానంలో గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రోత్సహించి సరుకుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎఫ్‌సీఐ 2008లో ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌ గ్యారెంటీ (పెగ్‌) పథకం ప్రవేశపెట్టింది. గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి పెట్టదు. పెగ్‌ పథకం కింద నిర్మించే గిడ్డంగుల్లో పదేళ్ల పాటు గ్యారెంటీగా బియ్యం నిల్వ చేసి అద్దె చెల్లిస్తామని, దీంతో పెట్టుబడి వ్యయం తిరిగి రాబట్టుకోవచ్చని ఎఫ్‌సీఐ ధీమా కల్పించింది. దీంతో పలువురు పెట్టుబడిదారులు భారీగా గిడ్డంగులు నిర్మిం చారు.

ఏడాదిలోగా శీతల గిడ్డంగులను నిర్మించాలని, రెండో ఏడాది ముగిసేలోగా సమీపంలోని రైల్వే స్టేషన్‌ నుంచి గిడ్డంగుల వరకు బియ్యం రవాణా కోసం రైల్వే లైను(రైల్వై సైడింగ్‌) నిర్మించాలనే షరతులను ఎఫ్‌సీఐ పెట్టింది. రైల్వే లైను నిర్మించేందుకు రైల్వే బోర్డు నుంచి రైల్వే ట్రాన్స్‌పోర్టు క్లియరెన్స్‌ (ఆర్టీసీ) పొందడంలో ఎఫ్‌సీఐ తీవ్ర జాప్యం చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పరిమాణంలో సరుకు రవాణా చేస్తారు? ఎంత రవాణా వ్యాపారం జరుగుతుంది? ఎంత ట్రాఫిక్‌ ఉంటుంది? తదితర సమాచారాన్ని రైల్వే బోర్డుకు పంపడంలో ఎఫ్‌సీఐ అధికారులు కావాలనే జాప్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

నాటి జీఎం లేఖే సాక్ష్యం.. 
ప్రైవేటు గిడ్డంగులకు బదులు పెగ్‌ గిడ్డంగులను వినియోగిస్తే ఏటా రూ.కోట్లు మిగులుతాయని పేర్కొంటూ 2017 మే 1న స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వయంగా ఎఫ్‌సీఐకి లేఖ రాశారు. నిజామాబాద్‌ జిల్లా జానకంపేటలోని పెగ్‌ గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తే ఏటా రూ.4.30 కోట్లు, మేళ్లచెరువులోని గిడ్డంగిలో నిల్వ చేస్తే ఏటా రూ.2.23 కోట్లు ఆదా అవుతాయని అందులో పేర్కొన్నారు. ఇదే లెక్కన టేకులసోమారం గిడ్డంగిలో నిల్వ చేసినా ఏటా రూ.2.23 కోట్లు ఆదా కానున్నాయి. వాస్తనానికి ప్రైవేటు గిడ్డంగులకు బదులు పూర్తి స్థాయిలో ఈ మూడు గిడ్డంగులను ఎఫ్‌సీఐ వాడుకుంటే ఏటా ప్రభుత్వానికి రూ.70 కోట్ల వరకు ఆదా అవుతాయని, ఏడేళ్లలో దాదాపు రూ.500 కోట్లు దుర్వినియోగం కాకుండా మిగిలేవని పెగ్‌ గిడ్డంగుల యజమానులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తూ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

మామూళ్ల దురాశతోనే.
ఎఫ్‌సీఐ గిడ్డంగులు కాకుండా ప్రైవేటు గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తే మామూళ్లు వస్తాయన్న దురాశతో కొందరు అధికారులు ఈ జాప్యం చేసినట్లు పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. రైల్వే బోర్డు నుంచి క్లియరెన్స్‌ వచ్చే సరికి రెండేళ్ల జాప్యం జరిగింది. అప్పటికే రైల్వే సైడింగ్‌ నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. పాత నిబంధనల ప్రకారం ఒకటిన్నర కిలోమీటర్ల రైల్వేలైన్‌ను రైల్వే సొంత ఖర్చుతో నిర్మించనుండగా, కొత్త నిబంధనల్లో ఈ నిడివి అర కి.మీ.కు తగ్గింది. దీంతో మిగిలిన కిలోమీటర్‌ లైను నిర్మాణ వ్యయ భారం పెట్టుబడిదారులపై పడింది.

మారిన పరిస్థితుల నేపథ్యంలో టెండర్లలో ఎఫ్‌సీఐ హామీ ఇచ్చిన అద్దె ధరతో రైల్వే లైన్లు నిర్మిస్తే తమకు గిట్టుబాటు కాదని, ప్రతి బస్తాపై అదనంగా నెలకు రూ.2 అద్దె చెల్లిస్తే రైల్వే లైను పనులు చేపడుతామని పెట్టుబడిదారులు లేఖ రాశారు. రోడ్డు మార్గంతో పోలిస్తే రైల్వేమార్గంలో బియ్యం తరలిస్తే బస్తాపై రవాణా, హమాలీ చార్జీలు కలిపి రూ.20 వరకు అదా అవుతుందని, రూ.2 అదనంగా చెల్లించినా నష్టం లేదని, అయినా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు అంగీకరించలేదని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు.

అప్పుడు వద్దని..ఇప్పుడు కావాలని... 
పత్తి నిల్వకు సీసీఐ ఇటీవల మేళ్లచెరువు, టేకులసోమారం పెగ్‌ గిడ్డంగులను అద్దెకు తీసుకుంది. ఈ గిడ్డంగులను వాడుకోవడానికి ఏడేళ్లుగా నిరాకరిస్తూ వచ్చిన ఎఫ్‌సీఐ అధికారులు ఈ విషయం తెలుసుకుని.. వాటిని ఖాళీ చేసి తమకు అప్పగిస్తే వాడుకుంటామని ఈ నెల 5న లేఖ రాయడం విశేషం. ఈ గిడ్డంగులను వాడుకోవడానికి సీసీఐకి లేని అభ్యంతరం ఎఫ్‌సీఐకు ఎందుకు ఉందనే విమర్శలొస్తాయనే జాగ్రత్త పడినట్టు అర్థమవుతోంది. యాదాద్రి జిల్లా టేకుల సోమారంలో రూ.24 కోట్లతో 50 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో చిరాక్‌ వేర్‌హౌజ్‌ బిల్డర్స్‌ సంస్థ 10 గిడ్డంగులను నిర్మించింది. ఈ గిడ్డంగికి అప్రోచ్‌ రోడ్డు సరిగ్గా లేదని, భవిష్యత్తులో రోడ్డు ఉన్న స్థలం నుంచి నీటిపారుదల కాల్వ వెళ్లనుందని ఏడేళ్లుగా సాకులు చెబుతూ ఇక్కడ పెట్టాల్సిన బియ్యాన్ని దగ్గరలోని ఓ ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేస్తోంది. ఇవి ఎఫ్‌సీఐ అధికారుల బినామీలవన్న విమర్శలున్నాయి. 

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో రూ.24 కోట్ల వ్యయంతో 50 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో దేవిశ్రీ బిల్డర్స్‌ సంస్థ 2013లో 10 గిడ్డంగులను నిర్మించింది. సరైన అప్రోచ్‌ రోడ్డు లేదనే సాకుతో ఎఫ్‌సీఐ ఈ గిడ్డంగులను సైతం ఖాళీగా పెట్టింది. రైల్వే శాఖకు చెందిన భూమిలో అప్రోచ్‌ రోడ్డు ఉందని, ఈ గోదాములను ఉపయోగించలేమని తేలుస్తూ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు గత నవంబర్‌ 11న లేఖ రాశారు. నిజామాబాద్‌ జిల్లా జానకంపేటలో 60 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో ‘లక్ష్మీ కోల్డ్‌ స్టోరేజీ అండ్‌ వేర్‌ హౌసెస్‌’ 12 గిడ్డంగులను నిర్మించింది. 2013లో నిర్మాణం పూర్తి చేసినా, 2017 వరకు ఈ గిడ్డంగులను ఎఫ్‌సీఐ ఖాళీగా పెట్టింది. ఈ గిడ్డంగిలో బియ్యం నిల్వ చేస్తే నెలకు అద్దె బస్తాపై 90పైసలు మాత్రమే కానుంది. 2017 నుంచి ఈ గిడ్డంగులను పాక్షికంగా మాత్రమే వినియోగించుకుంటోంది. బస్తాకు రూ.4.38 పైసలు చెల్లిస్తూ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు గిడ్డంగుల్లో ఎఫ్‌సీఐ బియ్యం నిల్వ చేస్తోంది. జానకంపేట గిడ్డంగిలో బియ్యం నిల్వ చేస్తే ఏటా రూ.4.32 కోట్లు ఆదా అవుతాయని స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ 2017లో ఎఫ్‌సీఐకి లేఖ రాశారు.

ప్రైవేటు దోపిడీ
రైల్వే లైన్ల నిర్మాణం సాధ్యం కాకపోయినా, రోడ్డు మార్గంలో బియ్యం తరలించి 60% అద్దెతో పెగ్‌ స్కీం కింద నిర్మించే గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ హామీ ఇచ్చింది. ‘పెగ్‌’ గిడ్డంగిలో ఎన్ని బస్తాలు నిల్వ చేస్తే ఆ మేరకే అద్దె చెల్లిస్తే సరిపోనుంది. టెండరు ద్వారా నిర్మించిన గిడ్డంగుల్లో 60% అద్దెతో ఒక బస్తా బియ్యం నిల్వ చేస్తే నెలకు రూ.1 వ్యయం మాత్రమే కానుంది. రోడ్డు సరిగ్గా లేదని, హమాలీలు లేరని, క్రాప్‌ లేదని సాకులు చూపి ఏడేళ్లుగా ఎఫ్‌సీఐ అధికారులు చాలా పెగ్‌ గిడ్డంగులను ఖాళీగా ఉంచారు. వీటికి బదులుగా ప్రైవేటు గిడ్డంగుల్లో ప్రతి నెలా బస్తాకు రూ.4.68 చొప్పున బియ్యం నిల్వ చేస్తూ కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement