సాక్షి, హైదరాబాద్: అమెజాన్ గోదాములకు చేర్చాల్సిన కంప్యూటర్ ఉపకరణాలను స్వాహా చేసి అమ్మేసుకున్న అమేజ్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగులతో పాటు రిసీవర్లను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసినట్లు దర్యాప్తు అధికారిగా ఉన్న టీమ్–1 ఏసీపీ ఎం.శ్రీనివాస్‌రావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని సీటీసీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆనందిత్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ సంస్థ కంప్యూటర్ విడి భాగాలు, ఉపకరణాల వ్యాపారం చేస్తుంటుంది.
ఆన్‌లైన్ ద్వారానూ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు అమెజాన్‌లో ‘ఏ1 ప్రై స్ ఏ1 ప్రొడక్ట్స్’ అనే డిస్‌ప్లే నేమ్ నమోదై ఉంది. కస్టమర్ల ఆర్డర్లకు తగ్గట్టు ఆనందిత్ సంస్థ తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ గోదాములకు చేరుస్తుంటుంది. అక్కడి నుంచి ఈ సరుకు అమెజాన్ ద్వారా వినియోగదారులకు డెలివరీ అవుతుంది. తమ ఉత్పత్తులను నిర్ణీత ప్రమాణాలు, పరిమాణంతో ఉండే బాక్సుల్లో ప్యాక్ చేసే ఆనందిత్ సంస్థ వాటిపై షిప్‌మెంట్ లేబుల్‌ను అతికిస్తుంది. వీటిని ఈ సంస్థ నుంచి అమేజాన్ గోదాములకు చేర్చే బాధ్యతను ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అమేజ్ సొల్యూషన్స్ నిర్వహిస్తుంది.
ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు ఆనందిత్ సంస్థ నుంచి ఆయా బాక్సులను సేకరించి భద్రంగా అమేజాన్ గోదాములకు చేరుస్తుంటారు. అమేజ్ సంస్థకు నగరానికి సంబంధించి ఉప్పల్‌లోని హెచ్‌ఎండీఏ లేఔట్‌లో ఉన్న గోదాము ద్వారా ఈ రవాణా జరుగుతుంది. ఈ సంస్థలో అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లు డెలివరీ బాయ్స్‌గా, నర్సింగ్ యాదవ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నగరానికి చెందిన వ్యాపారి కృష్ణకుమార్‌తో అనిల్, మనోజ్‌లకు పరిచయం ఉంది. అమేజాన్ గోదాములకు డెలివరీ చేసే సరుకులో కొంత స్వాహా చేసి తీసుకువస్తే తాను ఖరీదు చేస్తానంటూ అతను వీరిద్దరితో చెప్పాడు. దీనికి అంగీకరించిన ద్వయం కొన్నాళ్లుగా సరుకు స్వాహా చేసి కృష్ణకు అందిస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ మొదలు అమెజాన్ సంస్థ నుంచి ఆనందిత్‌కు ఈ–మెయిల్స్ రూపంలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్డర్ ప్రకారం సరుకు రావట్లేదని, వచ్చిన వాటిలోనూ కొంత తక్కువ ఉంటోందని వాటి సారాంశం. ఈ నేపథ్యంలో ఆనందిత్ సంస్థ లోతుగా ఆరా తీయగా రూ.1.35 కోట్ల విలువైన 4262 బాక్సులు, సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిని దర్యాప్తు చేసిన అధికారులు అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లతో పాటు కృష్ణకుమార్‌ను అరెస్టు చేశారు.
వీరి సరుకు చోరీ చేస్తున్నారని తెలిసినా యాజమాన్యానికి ఫిర్యాదు చేయని డ్రైవర్ నర్సింగ్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణ నేపథ్యంలోనే సరుకు మొత్తం అమీర్‌పేట, సికింద్రాబాద్‌ల్లో ఉన్న ఐదుగురు సెల్‌ఫోన్, కంప్యూటర్ దుకాణదారులకు విక్రయించినట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా పరిగణిస్తూ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రూ.లక్షల విలువైన కంప్యూటర్ విడి భాగాలు రికవరీ చేశారు. ఫిర్యాదుదారులు పేర్కొన్న స్థాయిలో సరుకు చోరీ జరగలేదని భావిస్తున్నారు. దీన్ని నిర్థారించే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
(చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి)
Comments
Please login to add a commentAdd a comment