బియ్యంతో నిండిపోయిన గోదాములు | Telangana: Warehouse Filled With Rice Stocks | Sakshi
Sakshi News home page

బియ్యంతో నిండిపోయిన గోదాములు

Published Sat, Jul 24 2021 3:03 AM | Last Updated on Sat, Jul 24 2021 3:03 AM

Telangana: Warehouse Filled With Rice Stocks - Sakshi

నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ షెడ్‌లో నిల్వ ఉంచిన ధాన్యం

నల్లగొండ జిల్లాలో గోదాముల్లో 4,81,838 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అందులో ఎఫ్‌సీఐ గోదాములు బియ్యంతో ఇప్పటికే నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 8.58 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా మిల్లుల్లో పెట్టింది. గోదాములు ఖాళీ లేక బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. రోజుకు ఒక వ్యాగన్‌ ద్వారా 3800 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అవసరమైన చోటికి పంపాల్సి ఉండగా, 4 రోజులకు ఒక వ్యాగన్‌ ద్వారానే బియ్యం సరఫరా చేస్తున్నారు.

నిజామాబాద్‌లోనూ ఎఫ్‌సీఐతోపాటు చిన్నాచితక గోదాముల్లో 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టోరేజ్‌ కెపాసిటీ ఉంది. అక్కడ 12 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి మిల్లులకు అప్పగించింది. అక్కడున్న గోదాములు 90 శాతం బియ్యంతో నిండి ఉన్నాయి. అక్కడినుంచి రోజుకు రెండు వ్యాగన్లలో బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు లేదా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తేనే సేకరించిన ధాన్యాన్ని మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక వ్యాగన్‌ ద్వారా మాత్రమే బియ్యాన్ని ఎక్స్‌పోర్టు చేస్తుండటంతో మిల్లింగ్‌ కుంటుపడుతోంది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలు నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా తగ్గడంతో గోదాముల్లో ఖాళీలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మిల్లుల నుంచి బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. దీనికితోడు తాజాగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోబోమని పేర్కొనడంతో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)గా మార్చి ఎఫ్‌సీఐ ఇచ్చే ప్రక్రియ స్తంభించిపోయింది. దీంతో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం వర్షాలకు తడిచి నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది.

కేంద్రం వద్దన్నా ముందుకొచ్చిన రాష్ట్రం
కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని ఆ చట్టంలో పేర్కొంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లాల్లో గోదాముల సామర్థ్యం తక్కువగా ఉన్నా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ మార్కెట్‌యార్డులు, ఫంక్షన్‌ హాళ్లను తీసుకొని మిల్లర్లకు ఇచ్చి అక్కడ ధాన్యం నిల్వ చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఎఫ్‌సీఐ గోదాముల్లోని బియ్యం అంతర్రాష్ట్ర సరఫరా మందగించింది. ఒక్కో జిల్లా నుంచి రోజుకు నాలుగైదు వ్యాగన్ల ద్వారా బియ్యం పంపించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యాగన్‌ ద్వారా బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళుతోంది.

నల్లగొండ మండలంలోని ఓ రైస్‌మిల్‌ ఆవరణలో నిల్వ ఉంచిన ధాన్యం  

ప్రైవేటు గోదాములు ఉన్నా వాడుకోలేని పరిస్థితి..
ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోయిన నేపథ్యంలో ప్రైవేటు గోదాములు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు గోదాములను టెండర్‌ ద్వారానే తీసుకోవాలని కేంద్రం నిబంధన విధించింది. ఆన్‌లైన్‌ టెండర్‌ జారీ చేసి, 15 రోజులు సమయం ఇవ్వాలని, తర్వాతే గోదాములను తీసుకోవాలని పేర్కొంది. ఇందుకు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఏర్పడింది.

అందుకే వద్దంటున్న కేంద్రం
2019–20 రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని సీఎంఆర్‌గా మార్చి ఎఫ్‌సీఐ ఇస్తూ వచ్చారు. చివరలో దాదాపు 1.01 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి చేరలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇక ఈ సీజన్‌లో బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని రాష్ట్రం... కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. బియ్యం తీసుకోబోమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గడిచిన సీజన్లలో మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేదని, అందుకే ఈ సారి ఇప్పటికే గడువు దాటినందున బియ్యం తీసుకోబోమని పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం సేకరించిన ధాన్యం పరిస్థితి ఏంటన్నది గందరగోళంగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement