సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎఫ్‌సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు.
అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్‌లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్‌కు వెళ్లి అక్కడి ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్‌కు తరలించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది.
ఆ బియ్యం రవాణా అయితేనే...
మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు.
మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment