►రాష్ట్రంలో రైస్ మిల్లులు ఎట్టకేలకు తిరిగి తెరుచుకోబోతున్నాయి. 43 రోజులుగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి సెంట్రల్ పూల్‌కు బియ్యం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో మిల్లులు తెరుచుకోనున్నాయి. నిలిచిపోయిన బియ్యం సేకరణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది.
►కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే ఇంతకాలం ధాన్యం మిల్లింగ్, బియ్యం సేకరణలో ప్రతిష్టంభన నెలకొందని ఆరోపించారు. ఎఫ్‌సీఐ నేతృత్వంలో బియ్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నామని, ధాన్యం సేకరణలో అవకతవకలపై తెలంగాణకు ఆడిట్ బృందాలను పంపిస్తామన్నారు.
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో అవకతవకల ఆరోపణలు, మిల్లుల్లో ఎఫ్‌సీఐ ప్రత్యక్ష తనిఖీలు తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మార్చి, మే నెలల్లో కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎఫ్‌సీఐ రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. మార్చి నెలలో జరిపిన తనిఖీల్లో 40 మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం (ఒక్కో బస్తాలో 40 కిలోలు) మాయమైనట్లు గుర్తించింది. మే నెలలో జరిపిన పరిశీలనలో 63 మిల్లుల్లో 1,13,872 ధాన్యం బస్తాల లెక్క తేలలేదు. 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం బస్తాలను నిల్వ చేశారని పేర్కొంది.
ఇదే విషయాన్ని ఎఫ్‌సీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ, ఆయా మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క మిల్లుపైనా చర్యలు తీసుకోలేదని ఎఫ్‌సీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పేదలు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి తీసుకొంది. కానీ ప్రజలకు పంపిణీ చేయలేదు. అయితే ఇందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
అయినప్పటికీ ధాన్యం నిల్వల మాయం, బియ్యం పంపిణీ కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. గత జూన్ 7వ తేదీ నుంచి రాష్ట్రంలో సెంట్రల్ పూల్‌కు బియ్యం సేకరణను నిలిపివేసింది. కస్టమ్ మిల్లింగ్ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కూడా..మిల్లర్లపై తీసుకున్న చర్యలు, బియ్యం పంపిణీ కాకపోవడంపై ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పిస్తేనే సెంట్రల్ పూల్‌కు బియ్యం తీసుకునే అంశం పరిశీలిస్తామని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తేల్చిచెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల ప్రయత్నాలు, మిల్లర్ల ఒత్తిడి వంటి తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది.
నాని మొలకెత్తిన ధాన్యం..
ఈ యాసంగిలో సుమారు 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ధాన్యం మిల్లులకు తరలించినా నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. గత వానాకాలం, అంతకుముందు యాసంగికి సంబంధించిన సుమారు 44 లక్షల టన్నుల ధాన్యం సీఎంఆర్ కోసం మిల్లుల్లోనే ఉండటంతో.. చాలాచోట్ల ధాన్యం బస్తాలు ఆరుబయట, మిల్లుల ఆవరణల్లోనే ఉండిపోయాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు టార్పాలిన్ల కింద ఉంచిన ధాన్యం చాలావరకు తడిచిపోయింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ , ఖమ్మం మొదలైన ఉమ్మడి జిల్లాల్లో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచి మొలకెత్తింది.
ఈ నేపథ్యంలో మిల్లర్లు ఆందోళనలకు కూడా సిద్ధమయ్యారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించినా ఏవీ సత్ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో తడిచిన 10 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించాలని, తరువాత ఇతర ధాన్యాన్ని కూడా అమ్మేయాలని నిర్ణయించినా.. ముఖ్యమంత్రి నుంచి తుది ఆమోదం లభించలేదు. ఎట్టకేలకు బుధవారం సెంట్రల్ పూల్‌కు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడంతో దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. అయితే తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని ఏం చేస్తారనే దానిపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ
రాష్ట్రంలో నిలిచి పోయిన బియ్యం సేకరణను గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది. ఈ మేరకు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్.అశోక్‌కుమార్ బుధవారం రాత్రి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని ఇప్పటికే ప్రారంభించడంతో పాటు, అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలకు దిగిన నేపథ్యంలో బియ్యం సేకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
వివరణ ఇస్తేనే సేకరణ
– కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ తీరు వల్లనే ఆ రాష్ట్రంలో సెంట్రల్ పూల్ కింద బియ్యం సేకరణను నిలిపివేసినట్లు కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో మిల్లుల్లో ధాన్యం బస్తాలు మాయం కావడాన్ని గుర్తించడంతో పాటు, అనేక మిల్లుల్లో ధాన్యం లెక్కించడానికి వీల్లేకుండా ఉండటాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. మరోవైపు పీఎంజీకేఏవై కింద తీసుకున్న కోటా బియ్యాన్ని కూడా పంపిణీ చేయలేదని వివరించింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ పూల్ కింద బియ్యం సేకరణను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇప్పటికైనా సంబంధిత అంశాలపై వివరణతో సమగ్ర నివేదికను అందజేస్తే సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment