
ప్రజాపంపిణీపై ఎఫ్‌సీఐ పోటు
లెవీ బియ్యం సేకరణ 75% నుంచి 25 శాతానికి తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: లెవీ బియ్యం సేకరణను 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థపై పెను భారం పడనుంది. రాష్ట్రంలో ఏటా ప్రజా పంపిణీకి అవసరమైన 22 లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొననుంది. లెవీ తగ్గింపువల్ల చిన్న మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు వెనుకంజ వేస్తారని, అదేజరిగితే రైతులు పండించిన పంట అమ్ముడుపోవడం కష్టమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వివరాలిలా ఉన్నాయి... ‘ప్రస్తుతం మిల్లర్లు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చగా వచ్చినదాంట్లో 75 శాతాన్ని లెవీ కింద ఎఫ్‌సీఐ/ పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. మిగిలిన 25 శాతాన్ని లెవీ ఫ్రీ కింద బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అయితే మిల్లర్లు ఇవ్వాల్సిన లెవీ బియ్యాన్ని 75 నుంచి 25 శాతానికి తగ్గించినట్లుగా పేర్కొంటూ ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. లెవీ ఫ్రీ బియ్యాన్ని 25 శాతం నుంచి 75 శాతానికి పెంచినట్లు అందులో స్పష్టం చేసింది. ఇది వచ్చే ఖరీఫ్ ధాన్య సేకరణ సీజన్ (అక్టోబర్ ఒకటో తేదీ) నుంచి అమల్లోకి రానుంది.
లెవీని తగ్గించవద్దని, 75 శాతాన్ని కొనసాగించేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ఎఫ్‌సీఐ స్పందించలేదు. ‘ఖరీఫ్ ధాన్య సేకరణ సీజన్ దగ్గర పడుతోంది. లెవీ ఆదేశాలను సవరించేందుకు ఎఫ్‌సీఐ విముఖతతో ఉంది. ఇక 25 శాతం లెవీతో సరిపెట్టుకోక తప్పదు. ఇది రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు భారమే..’ అని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. లెవీ కుదింపు ప్రభావం ఈ శాఖపైనే ఎక్కువగా పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూపాయి కిలో బియ్యం అమలుకు ఏడాదికి 42 లక్షల టన్నుల బియ్యం అవసరం. (ఆహార భద్రత చట్టం అమలు చేస్తే మరో పది లక్షల టన్నులు అదనంగా అవసరమవుతాయి) ప్రస్తుతం 75 శాతం లెవీ కింద 42 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ సబ్సిడీ ధరతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ఇస్తోంది.
ఈ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సబ్సిడీతో తెల్లకార్డుదారులకు అందిస్తోంది. ‘లెవీ 25 శాతానికి కుదించడంవల్ల రాష్ట్రంలో మిల్లర్ల నుంచి ప్రజాపంపిణీకి వచ్చే బియ్యం 20 లక్షల టన్నులకే పరిమితమవుతుంది. లెవీ కింద ఎఫ్‌సీఐ టన్ను బియ్యాన్ని ప్రస్తుతం రూ.2082 - 2130 ధరతో (వెరైటీని బట్టి) కొనుగోలు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.2500 - 2700 ఉంటుందని అంచనా. లెవీ కోత వల్ల రాష్ట్రంలో ఏటా ప్రజా పంపిణీకి అవసరమైన మిగిలిన 22 లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వంపై పెనుభారం పడుతుందన్నమాట. అందువల్ల పౌరసరఫరాల శాఖ నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేయించి బియ్యాన్ని (కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ - సీఎంఆర్) ప్రజా పంపిణీకి వినియోగించాలని యోచిస్తోంది. అయితే కొద్ది పరిమాణంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సరిపడ ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేసేందుకు గిడ్డంగుల సామర్థ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందువల్ల బహిరంగ మార్కెట్‌లో బియ్యం కొనుగోలు చేయక తప్పదు..’ అని అధికారులు అంటున్నారు.
సబ్సిడీ తగ్గించేందుకు కేంద్రం ఎత్తుగడ!
‘ప్రస్తుతం సబ్సిడీతో బియ్యాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించి పరిమిత సబ్సిడీతో సరిపెట్టాలనే యోచనలో ఉంది. ఆహార భద్రత బిల్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు అయ్యే వ్యయంలో కొంత మాత్రమే సబ్సిడీగా ఇస్తుంది. మిగిలినది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి వస్తుంది. లెవీ బియ్యం ఇస్తే ఎక్కువ సబ్సిడీ భారం కేంద్ర ప్రభుత్వంపై పడుతుంది. లేవీ లేకుండా బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసేలా చేస్తే కొంత సబ్సిడీ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి సబ్సిడీ ఇచ్చినా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారం నుంచి తప్పుకునే అవకాశం ఉంది. బియ్యం లెవీ కుదింపు నిర్ణయం ఇందులో భాగమే. ఇప్పటికే చక్కెర లెవీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు బియ్యం వంతు వచ్చింది. అయితే చక్కెర విషయం వేరు. అది చాలా తక్కువ పరిమాణంలో సేకరించేది. దీనివల్ల పౌరసరఫరాల శాఖకు సంబంధించి సమస్య స్వల్పమే. బియ్యం విషయంలో అలా కాదు. లెవీ తగ్గింపువల్ల మిల్లర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసి ధరలను పెంచే ప్రమాదం ఉంది. ఇది ప్రజలకు తీవ్ర భారమవుతుంది’ అని ఆర్థిక, ప్రజాపంపిణీ నిపుణులు చెబుతున్నారు.