సాక్షి, అమరావతి: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అనే రీతిలో ప్రభుత్వం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపును ఇష్టారాజ్యంగా చేస్తోంది. తమకు కావాల్సినవారికి సేవా సంస్థల పేరుతో కారుచౌకగా భూములు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయల రేటు కడుతోంది. బడా కార్పొరేట్ సంస్థలకు సైతం వందల ఎకరాలను అతి తక్కువ ధరకే ఇస్తోంది. ఇప్పటివరకూ చేసిన భూకేటాయింపులన్నీ ఇదే తరహాలో ఉండటం గమనార్హం. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎకరం రూ.25 లక్షలకే భూమిని ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీకి ఎకరం రూ.4 కోట్లు చొప్పున నిర్ణయించింది. కార్పొరేట్ సంస్థలకు తక్కువ రేటుకు భూములు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
1,500 ఎకరాలు కేటాయింపు
ఇప్పటివరకూ 115కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1,500 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఒక్కోదానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేసింది. 1,500 ఎకరాల్లో 600 ఎకరాలను ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత వంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున అతి తక్కువ ధరకే కట్టబెట్టేసింది. మరో 250 ఎకరాలను బీఆర్‌ఎస్ మెడ్‌సిటీ, ఇండో – యూకే హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌కి ఇదే రేటుకు ఇచ్చింది. కార్పొరేట్ కంపెనీ ఎల్ అండ్ టీకి కూడా ఎకరం కేవలం రూ.1.5 లక్షల చొప్పున, ఏటా ఐదు శాతం పెంచేలా 30 ఏళ్ల లీజుకి ఆ సంస్థకు ఐదెకరాల భూమిని అప్పగించింది. తక్కువ ధరకు భూమిని ఇవ్వడమే కాకుండా ఆయా సంస్థలకు అవసరమైన రోడ్లు, నీరు వంటి సౌకర్యాలను కూడా సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) సొంత ఖర్చులతో సమకూర్చిపెట్టింది. రాష్ట్రంలో 38 క్రీడా సంఘాలు అమరావతిలో స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి మాత్రం ఎకరం రూ.10 లక్షల చొప్పున 12 ఎకరాలు కేటాయించారు. సేవా సంస్థల పేరుతో.. ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి ఎకరం రూ.25 లక్షల చొప్పున, బ్రహ్మకుమారీస్, గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు ఎకరం కేవలం రూ.10 లక్షల చొప్పున భూములు ఇచ్చారు.
ప్రభుత్వ సంస్థలకు అదిరిపోయే ధర
అదే సమయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్, నాబార్డ్, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, సిండికేట్ బ్యాంక్, ఐవోసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్లు చొప్పున వసూలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఇండియన్ నేవీ, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), డిపార్ట్‌మెంట్స్ ఆఫ్ పోస్ట్సŠ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలకు సైతం ఎకరం కోటి రూపాయలు వసూలు చేసి మరీ భూములు కేటాయించారు. కార్పొరేట్ సంస్థలు, తమ అనుయాయులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కారుచౌకగా వందల ఎకరాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఆర్‌బీఐకు 11 ఎకరాలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు విధించారు. దీంతో కేంద్ర సంస్థలు రాజధానిలో తమ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. భూములు కేటాయింపులో స్వప్రయోజనాలు చూసుకుని తక్కువ ధరకు వందల ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎం, విట్, బీఆర్‌ఎస్ మెడ్‌సిటీ వంటి సంస్థలకు శాశ్వతంగా భూములు బదలాయించగా ఆర్‌బీఐ, సీపీడబ్లు్యడీ, ఏపీహెచ్‌ఆర్‌డీ వంటి ప్రభుత్వ సంస్థలకు మాత్రం లీజుకిచ్చింది. ప్రైవేటు సంస్థలకు నేరుగా ఇలా భూములివ్వకూడదని, వేలం ద్వారా కేటాయింపు జరపాలని ఆర్థిక శాఖ, సీఆర్‌డీఏ సూచించినా ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయడం లేదు. కార్పొరేట్ కంపెనీలపై అమిత ప్రేమ కనబరుస్తూ రైతుల నుంచి సేకరించిన భూములను వాటికి తక్కువ రేటుకు కట్టబెడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
నచ్చితే ఒక రేటు.. లేకపోతే మరో రేటు
Published Thu, Jan 17 2019 4:17 AM | Last Updated on Thu, Jan 17 2019 4:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment