సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఐదేళ్లుగా సీఆర్‌డీఏలో చేపట్టిన కన్సల్టెంట్ల నియామకాలు, జీతభత్యాలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తమకు అనుకూలురైన కార్పొరేట్ ఉద్యోగులు, రిటైరైన పలువురు అధికారులకు టీడీపీ సర్కారు భారీ వేతనాలతో ప్యాకేజీలిచ్చి సీఆర్‌డీఏలో నియమించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో కన్సల్టెంట్లు సీఆర్‌డీఏకు మరింత భారంగా మారారు. పలు విభాగాల్లో నియమించిన పది మందికిపైగా కన్సల్టెంట్లకు ప్రతి నెలా సగటున రూ.20 లక్షలకుపైనే జీతభత్యాలు చెల్లిస్తుండటం గమనార్హం.
ఉన్నతాధికారులను తలదన్నేలా వేతనాలు
నాలుగేళ్లుగా సీఆర్‌డీఏ స్ట్రాటజీ విభాగంలో చక్రం తిప్పిన జోస్యుల శివరామకృష్ణశాస్త్రి జీతం నెలకు రూ.మూడు లక్షలకుపైనే ఉంది. సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు సైతం ఇంత వేతనం ఉండదనే విమర్శలున్నాయి. రాజధాని భూములు, ప్రాజెక్టుల వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించిన ఆయన కమిషనర్ కంటే ఎక్కువనే రీతిలో హవా నడిపించారని చెబుతున్నారు. రాజధాని భూముల వ్యవహారాలు పర్యవేక్షించే డైరెక్టర్ ఎల్.చెన్నకేశవరావు రిటైర్ అయినా తిరిగి అదే పోస్టులో కొనసాగుతూ భారీ వేతనం తీసుకుంటున్నారు. భూ సమీకరణ, భూ కేటాయింపులు, రాజధాని రైతుల భూముల వ్యవహారాల్లో లెక్కలేనన్ని అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో తిరిగి ఆయన్నే ల్యాండ్స్ డైరెక్టర్‌గా కొనసాగించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హౌసింగ్ విభాగంలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసిన అబ్దుల్ షుకూర్ కీలకమైన రాజధాని ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల అభిమతానికి అనుగుణంగా నిబంధనలను తుంగలో తొక్కి పలు సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఏడాదిన్నర క్రితం రిటైర్ అయినా ఆయన్ను అదే విభాగంలో కన్సల్టెంట్‌గా కొనసాగిస్తుండడం గమనార్హం.
పేరుకు ఓఎస్డీ.. నియామకం సీఆర్‌డీఏలో
రాజధాని రైతుల నుంచి భూములు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొన్న తుళ్లూరు రిటైర్డ్ తహశీల్దార్ అన్నే సుధీర్‌బాబు రెండేళ్లుగా ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. ఆయన కాకుండా మరో ఓఎస్‌డీగా రామకృష్ణను నియమించుకున్నారు. మాజీ మంత్రి నారాయణ ఓఎస్‌డీ ప్రభల గోపీనాథ్‌ను సైతం సీఆర్‌డీఏ అధికారిగా చూపిస్తూ జీత భత్యాలు కూడా చెల్లిస్తుండటం గమనార్హం. మంత్రి ఓఎస్‌డీ అంటే ఆయన శాఖలోనే ఉండాలి. కానీ సీఆర్‌డీఏలో కాంట్రాక్టు పద్ధతిన నియమించిన వ్యక్తి నారాయణ వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తుండడం గమనార్హం. రాజధాని మాస్టర్ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఆర్.రామకృష్ణారావును రెండేళ్ల నుంచి సలహాదారుగా కొనసాగిస్తున్నారు.
వాస్తు సిద్ధాంతికి కన్సల్టెంట్ పోస్ట్
మాజీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు సన్నిహితుడైన వాస్తు సిద్ధాంతి వీర రాఘవులను సైతం కన్సల్టెంట్‌గా నియమించడంవిశేషం. రాజధాని శంకుస్థాపన, తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఆయన వాస్తు సలహాలిచ్చారు. దీంతో రాఘవులుకు భారీ ప్యాకేజీ ఇచ్చి వాస్తు కన్సల్టెంట్‌గా నియమించారు. వీరందరికీ నెల వేతనం రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకుపైనే ఉంది. ప్లానింగ్, సోషల్ డెవలప్‌మెంట్, ట్రాఫిక్–రవాణా, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ తదితర విభాగాల్లో కూడా 50 మందికి పైగా కన్సల్టెంట్లు పని చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో నిపుణులైన అధికారులున్నా పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు, రిటైర్ అయిన అధికారులను తెచ్చుకుని భారీగా వేతనాలిస్తుండడంతో సీఆర్‌డీఏపై భారీగా ఆర్థిక భారం పడింది.
Comments
Please login to add a commentAdd a comment