రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో.. | TDP Seniors 800 BPL Card Holders Involved in Amaravati Insider Trading | Sakshi
Sakshi News home page

పక్కా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

Published Fri, Jan 3 2020 4:44 AM | Last Updated on Fri, Jan 3 2020 1:55 PM

TDP Seniors 800 BPL Card Holders Involved in Amaravati Insider Trading - Sakshi

సాక్షి, అమరావతి :  రాజధాని ప్రాంతంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నేరం బయట పడటం వల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతోనే  రైతులను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇందుకు సంబంధించి గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు వివరాలు వెల్లడించారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై 21 నిమిషాల నిడివిగల వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి.

భూ దందాలో మరో కోణం క్విడ్‌ ప్రో కో
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్‌ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్‌.వి.రమేష్, ఎల్వీఎస్‌ రాజశేఖర్‌ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్‌ అకడమిక్‌ ఫౌండేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్‌ లిమిటెడ్, లౌక్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, విఘ్నేష్‌ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి.

విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి గానీ రాలేదు. లింగమనేని ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అసైన్డ్‌ భూముల వ్యవహారం..
రాజధాని అసైన్డ్‌ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు. అధికార పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూములకు ప్లాట్లు రావని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్‌ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్‌రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీ చేశారు. ఇలా అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన వారిలో దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం.

అసైన్డ్‌ భూములను తక్కువకు కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్‌ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్‌కు మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్‌ 42.925 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్‌ను చేజిక్కించుకున్నారు. ఇంకో సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరా తక్కువ ధరకు లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్‌ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు.   

జోన్ల అలైన్‌మెంట్ల కుంభకోణం..
రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్‌మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూము లేవీ ల్యాండ్‌ పూలింగ్‌ జోన్‌లోకి రాకుండా చేయడానికి సరిహద్దులను మార్చారు. 2015 జూన్‌లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన సుర్బానాజురాంగ్‌కు డ్రాఫ్ట్‌ ప్లాన్‌ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్‌ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్‌ అందించింది. ఈ ప్లాన్‌ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్‌ ప్లాన్‌ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టింది. జురాంగ్‌ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్‌ ప్లాన్‌కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్‌ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది.


► మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్‌ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్‌ను సీఆర్డీయే జోన్‌ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు.

► చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు చందర్లపాడులో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు.

► రాజధాని చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్‌ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలోనూ అలైన్‌మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు పక్కనే ఉన్నాయి.

► చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీ మోహన్‌ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్‌ రింగు రోడ్డు వచ్చేలా చేశారు.


పక్కా ప్లాన్‌తో భూ దందా
 2014 జూన్‌ 1 నుంచి 2014 డిసెంబర్‌ 31 వరకు అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజధాని ఎక్కడ రాబోతున్నదనే ముందస్తు సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చందర్లపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై 2014 ఆగస్టు 27న శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను పూర్తిగా పక్కన పడేశారు.

తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ 2014 డిసెంబర్‌ 30న ఏపీ సీఆర్డీయే చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన 2014 సెప్టెంబర్‌ 4లోపు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో తమ బంధువులు, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా లబ్ధి పొందారు.  

లంకా దినకర్‌ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), కంభంపాటి రామ్మోహన్‌రావు కుమార్తె కంభంపాటి స్వాతి , పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష.. వారు నడుపుతున్న ఆర్‌.ఆర్‌.ఇన్‌ఫ్రా అవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. కూడా భారీగా భూములు కొనుగోలు చేశారు.     (పైన పేర్కొన్న వాటికి అసైన్డ్‌ భూములు అదనం)

రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్లరేషన్‌ కార్డు దారులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్లరేషన్‌ కార్డు దారులు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

చదవండి: 

వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు

ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే

రాజధాని దందా నిగ్గు తేలుస్తాం

బట్టబయలైన అమరావతి కుంభకోణం

మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’

రాజధానిలో తవ్వేకొద్దీఇన్సైడర్బాగోతాలు

రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం

నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు

వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement