సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో గత జనవరి ఒకటవ తేదీ నాటికి పాడైన ఆహార ధాన్యాలు 7.2 లక్షల టన్నులు ఉండగా, మే ఒకటవ తేదీ నాటికి, అంటే నాలుగు నెలల కాలంలో అవి 71.8 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంటే దాదాపు 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. లాక్‌డౌన్ సందర్భంగా ‘పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ఏప్రిల్, మే నెలల్లో పేద ప్రజలకు పంపిణీ చేసిన ఆహార ధాన్యాలకన్నా ఇవి ఎక్కువ. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు, ఆహార కొరత ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కోసం భారత ఆహార సంస్థ ఈ ఆహార ధాన్యాలను ఏటా సేకరిస్తోంది.
అయితే ఆహార ధాన్యాలను నిల్వచేసే గిడ్డంగుల సామర్థ్యం కన్నా ఎక్కువ ధాన్యాలను సేకరించడం, ఉన్న గిడ్డంగులు ఎప్పటికప్పుడు మరమ్మతులు నోచుకోక పోవడం వల్ల దేశంలో ఏటా ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. 2018, అక్టోబర్ నెల నుంచి దేశంలో ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువైంది. 2020, మే ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్థ గరిష్టంగా 668 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించాల్సి ఉండగా, 878 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించింది.
ఆహార ధాన్యాల కొనుగోలుకే కాకుండా వాటి రవాణాకు, నిల్వకు భారత ఆహార సంస్థకు ఎంతో ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నిల్వల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వాలు ఆహార ధాన్యాల కొనుగోలుతో పాటు, వాటి రవాణా, నిల్వకు అయ్యే ఖర్చును కూడా భరించేవి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ధాన్యం ధరనే చెల్లించి సరకును తీసుకుంటోంది. అదనపు నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాల్సిందిగా భారత ఆహార సంస్థను కేంద్రం ఆదేశించింది. చాలా సందర్భాల్లో బహిరంగ మార్కెట్ రేటుకన్నా ఎక్కువ మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి సేకరించడం వల్ల, తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది.
ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తంలో డబ్బు రాకపోవడం ఒకటైతే, మార్కెట్‌లో అదనపు నిల్వలను తక్కువ ధరకు అమ్మాల్సి రావడం, అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ధాన్యాలు పాడవడం వల్ల భారత ఆహార సంస్థ భారీగా నష్టపోతోంది. దాన్ని పూడ్చుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. 2019, డిసెంబర్ 31వ తేదీ వరకు ఆ సంస్థకు 2.36 లక్షల కోట్ల అప్పు పేరకు పోయింది. భారత ఆహార సంస్థ నిల్వల్లో ఎక్కువగా బియ్యం, గోధుమలే ఉంటాయన్న విషయం తెల్సిందే. అదనంగా సేకరించిన దాదాపు 200 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఏం చేయాలో భారత ఆహార సంస్థకు అర్థం కావడం లేదు.
2019–20 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే ఆ సంస్థ బహిరంగ మార్కెట్‌లో విక్రయించగలిగింది. కరోన లాక్‌డౌన్ సందర్భంగా రైళ్లు, బస్సుల్లోనే కాకుండా కాలి నడకన స్వగ్రామాలకు బయల్దేరిన లక్షలాది మంది వలస కార్మికులు ఆకలి కోసం అల్లాడుతుంటే, ఏటా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటించి చనిపోతుంటే మరోపక్క టన్నుల కొద్ది ఆహార ధాన్యాలు వృధా అవడం గమనిస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment