వానాకాలం సీజన్‌లో వచ్చే ధాన్యంలో కనీసం 80 లక్షల టన్నుల మేర తీసుకోవాలని ఎఫ్‌సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కానీ తొలుత 48 లక్షల టన్నులే సేకరిస్తామని ఎఫ్‌సీఐ చెప్పింది. తర్వాత 60 లక్షల టన్నులు తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో మిగతా ధాన్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం వరిపంట కోతకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ధాన్యం కొనుగోళ్లపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ధాన్యం సేకరణ విషయంగా కేంద్రం నుంచి మద్దతు కొరవడటం, అదే సమయంలో రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రానుండటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీసం 90 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. కేంద్రం 60 లక్షల టన్నులకు మించి సేకరించలేమని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఏమిటి, కొన్నా ఎక్కడ నిల్వ చేయాలి, ఇందుకు ఏమేం చర్యలు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అంత కొనలేం..!
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలంలో నీటి లభ్యత పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. సుమారు 1.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని.. ఇందులో స్థానిక అవసరాలు, మిల్లర్ల అవసరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి జరిగే క్రయవిక్రయాలు పోనూ కనీసం 90 లక్షల టన్నులకుపైగా సేకరించాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది వానాకాలం లో 48.85 లక్షల టన్నులే సేకరించగా.. యాసంగిలో రికార్డు స్థాయిలో 92 లక్షల టన్నుల సేకరణ జరిగింది. అయితే ప్రస్తుత వానాకాలంలో ధాన్యం సేకరణకు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అనేక కొర్రీలు పెడుతోంది. ధాన్యం తక్కువగా కొంటామని, అందులోనూ ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమని చెప్తోంది.
మిల్లుల్లోనే ధాన్యం.. గోదాముల కొరత
గత యాసంగికి సంబంధించిన ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే విషయంలోనే ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతూ వచ్చింది. 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని పేర్కొంది. అయితే రాష్ట్రం ఒత్తిడితో మరో 20 లక్షల టన్నులు తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఇందులో మొత్తంగా 44.75 లక్షల టన్నులకుగాను ఎఫ్‌సీఐ ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 18 లక్షల టన్నులే తీసుకుంది. మరో 26 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. ఈ ధాన్యా న్ని కూడా ప్రతి నెలా 3–4 లక్షల టన్నులకు మించి తరలించలేకపోతోంది. ప్రస్తుత నిల్వలు ఖాళీ అయ్యేందుకు సమయం పట్టే అవకాశముంది. గోదాములు ఇప్పటికే నిండిపోయాయి. మరోవైపు వానాకాలం దిగుబడులు పోటెత్తనున్నాయి. దీంతో ఆ ధాన్యం నిల్వ సమస్యగా మారుతోంది.
కార్యాచరణ ప్రణాళిక ఏదీ?
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికీ కార్యాచరణ ఖరారు కాలేదు. దసరాకు ముందే ప్రణాళిక సిద్ధం చేసి, ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా ఇంతవరకు ప్రక్రియ మొదలుకాలేదు. గత ఏడాది వానాకాలంలో 48.85 లక్షల టన్నుల మేర చేసిన సేకరణ కోసం 600కుపైగా కొనుగోలు కేంద్రాలు అవసరమయ్యాయి. ఈ ఏడాది భారీగా కొనుగోళ్లు చేయాల్సి ఉండటంతో.. రెట్టింపు కొనుగోలు కేంద్రాలు అవసరమని అంచనా. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద ఈ–అకౌంటింగ్ నిర్వహించడంతోపాటు, నిర్వాహకులు కంప్యూటర్, ప్రింటర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. దీనితోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం షెల్ట ర్లు, తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన ప్లాడీ క్లీనర్లు, విన్నోవింగ్ మెషీన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లను సమకూర్చుకోవాలి. ఈ ఏర్పాట్లకు సంబంధించి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment