మంత్రిఉత్తమ్ వెల్లడి
రైతులకు రూ.2,760.22 కోట్లు చెల్లింపు
రైతులుతొందరపడి దళారులకు అమ్ముకోవద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 20.6 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం కొనుగోలు చేయగా, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 21.73 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని ఇప్పటివరకు రూ.5,040.01 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేశామని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నుంచి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 8 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. గతంలో కంటే 2,447 కేంద్రాలను అధికంగా ప్రారంభించామన్నారు.
మొత్తం 16.06 ఎల్‌ఎంటీల దొడ్డు, 5.67 ఎల్‌ఎంటీల సన్నాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సన్నాలకు సంబంధించి రూ.283.25 కోట్ల బోనస్ ఇవ్వాల్సి ఉండగా.. రూ.8.17 కోట్లు చెల్లించామని తెలిపారు. చెల్లింపుల్లో గత ప్రభుత్వం కంటే ముందంజలో ఉన్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో వానాకాలం సీజన్‌లో రూ.2,414.23 కోట్లు చెల్లిస్తే.. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు తాము రూ.2,760.22 కోట్లు చెల్లించామన్నారు.
రికార్డు స్థాయిలో దిగుబడి
ఉమ్మడి ఏపీలో కూడా రాని దిగుబడి ఈ సారి తెలంగాణలో వచ్చిందని ఉత్తమ్‌చెప్పారు. 66.07 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 153 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని పండించారని, ఇది భారతదేశంలోనే రికార్డు సృష్టిస్తుందని అన్నారు. కాళేశ్వరం కింద మూడు బరాజ్‌లు పని చేయకున్నా.. రికార్డు స్థాయిలో ఉత్పత్తి రావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు.
చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జనవరి 10వ తేదీ వరకు కొనుగోళ్లు సాగుతాయని మంత్రి చెప్పారు. రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు.
ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలి
అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
హుజూర్‌నగర్ రూరల్: కొనుగోలుకేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని వేపలసింగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. యంత్రం ద్వారా ధాన్యం తేమను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోందని, లారీలు సకా లంలో రావడం లేదని రైతులు చెప్పారు. దీంతో మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment