
ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సింగరేణి సీఎండీ బలరాం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఆటో నడుపుకుంటూ ఉన్న తనకు అంబేడ్కర్ వర్సిటీ కొత్త జీవితాన్ని ఇచ్చిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరాం అన్నారు. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం (ఏఏఏఓయూ) ఆధ్వర్యంలో శనివారం విశ్వవిద్యాలయ గ్లోబల్ అలుమ్ని మీట్ (ప్రపంచ పూర్వ విద్యార్థుల సదస్సు) నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం తన అనుభవాలను పంచుకున్నారు.
అనంతరం వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని, పూర్వ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో సమాజాభివృద్ధికి పాటు పడుతున్నారని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ సూర్య ధనంజయ్ మాట్లాడుతూ ఓ మారు మూల తండా నుంచి వచ్చిన తనను అంబేడ్కర్ వర్సిటీ అమ్మలా ఆదరించిందని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ కట్టా హైమావతి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఆంధ్రప్రదేశ్) సెంట్రల్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, సైబరాబాద్ (శంషాబాద్ ట్రాఫిక్ డివిజన్) అసిస్టెంట్ కమిషనర్ పరికే నాగభూషణం, 2018 ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ బంగారు పతక విజేత మస్కు ప్రవీణ్ కుమార్ తదితరులు అంబేడ్కర్ వర్సిటీ గొప్పతనం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ జి.పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్, ఎల్.విజయ కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు.