ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం
వర్సిటీలపై రాష్ట్రాల అధికారాలను లాక్కోవడానికి కుట్రలు చేస్తోంది
ఇది రాజ్యాంగంపై, రాష్ట్రాలపై సాంస్కృతిక దాడే.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నా
లేకుంటే నిరసనలకు వెనకాడం
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
పలు భవనాలకు శంకుస్థాపన
బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై దండయాత్ర చేయాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. విశ్వవిద్యాలయాలపై రాష్ట్రాలకున్న అధికారాలను లాక్కొని ఆధిపత్యం చెలాయించాలని కుట్రలు చేస్తోందని... వర్సిటీల వైస్ చాన్స్‌లర్ల (వీసీ) నియామకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా చేపట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం యూజీసీ మార్గదర్శకాలను మార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆవరణలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీఎస్ శాంతికుమారి, వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొందరి విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదిత నిర్ణయాన్ని రాజ్యాంగంపై, రాష్ట్రాలపై సాంస్కృతిక దాడిగా అభివర్ణించారు.
విశ్వవిద్యాలయ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్, మంత్రి పొన్నం తదితరులు
రాష్ట్రాల హక్కులను గుంజుకుంటే ఎలా?
‘వర్సిటీలపై రాష్ట్రాల హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది? ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది. కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను గుంజుకుంటే ఎలా? కేంద్రం తీరు ఇలాగే ఉంటే రాష్ట్రాలన్నీ నామమాత్రం అవుతాయి. ఇలాంటి చర్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయి. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు కూడా వెనుకాడం. దీనిపై ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం. దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టరకరం’అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
విద్యా వ్యవస్థను గాడిన పెడతాం..
నాటి ప్రధాని పీవీ నరసింహారావు సామాజిక బాధ్యతగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ఉన్నది కేవలం సర్టీఫికెట్ల జారీ కోసమే కాదని.. సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలుకావాలని పేర్కొన్నారు. విద్యాహక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వందేళ్లలో తొలిసారి ఓయూకు దళిత వీసీని నియమించాం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వీసీలను నియమించాలని సీఎం రేవంత్ చెప్పారు. వందేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామన్నారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించామన్నారు. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రొఫెసర్లపై ఉందన్నారు.
పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే అమలుచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మంచిది కాదని, రాష్ట్రంలో యూనివర్సిటీల పునఃనిర్మాణం జరగాలన్నారు. ప్రొఫెసర్ల వయో పరిమితికి 65కు పెంచే ఆలోచన ఉందని సీఎం చెప్పారు. అంబేడ్కర్ వర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు.
2034 వరకు ప్రభుత్వం మాదే..
మరో పదేళ్ల వరకు తమ ప్రభుత్వమే కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, 2014 నుంచి 2024 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని.. ఆయా పార్టీ లకు పదేళ్లపాటు ప్రజలు అధికారం ఇచ్చారని.. తమకు కూడా 2034 వరకు ప్రజలు అందిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
పద్మ అవార్డుల్లో అన్యాయంపై ప్రధానికి లేఖ రాస్తా..
పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయ«దీర్ తిరుమలరావు లాంటి ప్రముఖులను గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం సిఫారసు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారని, తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులు ఇచ్చినా బాగుండేదన్నారు. ఈ అన్యాయంపై త్వరలోనే ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment