
ధర్నాలో మాట్లాడుతున్న అక్బరుద్దీన్ ఒవైసీ
ముస్లిం పర్సనల్‌లా బోర్డు సభలో వక్తల డిమాండ్
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
భారీ సంఖ్యలో హాజరైన ముస్లింలు
కవాడిగూడ (హైదరా బాద్): కేంద్ర ప్రభు త్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవా లని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025ని వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా, భారీ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఎంఐఎం శాసన సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, పర్సనల్‌లా బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ మత పెద్దలు ఈ ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
దీనికి ఎంఐఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అదే విధంగా ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. పర్సనల్‌లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ముస్లింల వ్యక్తిగత హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.