ambedkar open university
-
ఏ దేవుడు చెప్తున్నాడు.. తన్నుకు చావండని?: మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపైన చర్చించమంటే ముందుకురాని బీజేపీ నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవిళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీపడాలని మత ఘర్షణలు సృష్టించడంలో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అర్థం కాని విషయం ఏంటంటే.. ఏ దేవుడు చెప్తున్నాడు తన్నుకు చావండని ఏ మతం దేవుడైనా చెప్పిండా? అని ప్రశ్నించారు. కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా?. నా మనషులను పంపిస్తున్న భూమి మీదకు ఒకరికొకరు తన్నుకు చావండి.. ఎవరి దేవుడు గొప్ప అనే కాంపిటీషన్ పెట్టుకొని తన్నుకు చావండి అని చెప్పిండా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. చదవండి: (Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ!) -
కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా
బంజారాహిల్స్: కరోనా విజృంభణతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. జేఎన్టీయూ పరిధిలో... కేపీహెచ్‌బీ కాలనీ: జేఏన్‌టీయూహెచ్‌లో జరగనున్న అన్ని పరీక్షలను ఈ నెల 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ యం. మంజూర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓయూలో పరీక్షలు రద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
మహిళలపై అకృత్యాలను సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్ : మహిళలపై ఏ చిన్న అకృత్యం చోటుచేసుకున్నా సహించేది లేదని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. బుధవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన వీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్శిటీల్లో మహిళలు, విద్యార్ధినిల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గత అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో విశ్వవిద్యాలయాల్లో చేపట్టాల్సిన కార్కక్రమాల గురించి వివరించామన్నారు. బయోమెట్రిక్‌తో పాటు, అన్ని యూనివర్శిటీల్లో ఒకే అకాడమిక్ క్యాలెండర్ పాటించాలన్నారు. ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులు రూపొందించి, ఉపాధి అవకాశాలు లేని కోర్సులు తొలగించడానికి చూస్తున్నామని తెలిపారు. ఎన్ఎస్ఎస్లో గ్రామాలు దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో విద్య, వైద్య, స్కిల్ డెవలప్మెంట్కు కృషి చేయాలన్నారు. పీహెచ్‌డీల కోసం యూనిఫాం పద్ధతిని తీసుకొచ్చి పీహెచ్డీ అడ్మిషన్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పరిచయం చాలా ఫలప్రదంగా జరిగిందని, ఆరు నెలల తర్వాత మరో సారి భేటీ అవుతామని తెలిపారు. ఉన్నత విద్యపై అధికారి, మినిస్ట్రీ పరంగా రెగ్యులర్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. గవర్నర్ అభినందించారు : కడియం శ్రీహరి హైదరాబాద్ : అగ్రికల్చర్ యూనివర్శిటీ, బాసర ఐఐఐటీలను గవర్నర్ అభినందించారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరిగిన వీసీల సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ గత అక్టోబర్‌లో వీసీల సమావేశం నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వీసీల వారీగా అడిగి గవర్నర్ తెలుసుకున్నారు. మూడు మాసాల్లో యూనివర్శిటీ పరిధిలోని అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ ప్రారంభించి స్టబడెంట్స్, స్టాఫ్ అటెండెన్స్ రెగ్యులేట్ చేయాలన్నారు. దేశంలో మహిళల పట్ల అక్కడక్కడ చోటుచేసుకుంటున్న అకృత్యాలు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం హాస్టల్స్ ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, గ్రీవియెన్స్ సెల్స్‌తో బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వీసీలకు గవర్నర్ సూచించారు. యూజీసీ గైడ్ లైన్స్ ఎందుకు పీహెచ్డీ అడ్మిషన్లలో పాటించటం లేదని గవర్నర్ ప్రశ్నించారు. సెట్, నెట్, స్లెట్ మెరిట్ ద్వారా పీహెచ్‌డీలో గైడ్స్ సామర్థ్యం, వారి క్యాపబిలిటీ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పీహెచ్డీ పూర్తి చేయకపోతే అడ్మిషన్ రద్దు చేయాలి, రీసెర్చ్ కూడా ప్రామాణికంగా ఉండాలని ఆదేశించారు’’ అని అన్నారు. -
బేరం కుదిరితే పరీక్షంతా ఓపెనే..
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): కాసులిస్తే చాలు.. ఆ పరీక్ష కేంద్రంలో సిబ్బంది కాపీయింగ్‌కే కాదు ఏకంగా అభ్యర్థులకు బదులు వారిస్థానంలో ఇతరులు వచ్చి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. బేరం కుదిరితే దగ్గరుండి చిట్టీలు అందించి ఉత్తీర్ణతకు సహకరిస్తారు. మెట్‌పల్లిలోని ఓపెన్ డిగ్రీ పరీక్ష కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ‘ఓపెన్’గా అక్రమాలు జరుగుతున్నాయి. మాస్‌కాపీయింగ్‌కు ప్రత్యేకం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పేరొందిన మెట్పల్లి కేంద్రంలో కొత్త అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం కేవలం చిట్టీలతో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్న ఈ కేంద్రంలో తాజాగా ఒకరికి బదులు ఇతరులు పరీక్ష రాస్తున్న విషయం బయటపడింది. సిబ్బంది అండతో బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బుధవారం కథలాపూర్ ఎంపీపీ తొట్ల నర్సు భర్త తొట్ల అంజయ్యకు బదులు మరో యువకుడు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. ఇదీ జరిగింది... పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సోమవారం నుంచి ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారని కొందరు ప్రిన్సిపాల్ ఆబిద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పట్టించుకోలేదు. అబ్జర్వర్ హరిశంకర్‌కు తెలుపగా ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లి హాల్ టిక్కెట్లు పరిశీలించారు. తోట్ల అంజయ్య అనే పేరుతో పరీక్ష రాస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి ఆన్లైన్లో పరిశీలించారు. అందులో మరో వ్యక్తి ఫొటో ఉండడంతో పరీక్ష రాస్తున్న వ్యక్తి నకిలీ అని తేలింది. అసలు వ్యక్తి కథలాపూర్ ఎంపీపీ భర్త కాగా, అతని స్థానంలో కోరుట్లకు చెందిన ఓ యువకుడి ఫొటోను మార్పింగ్ చేసి హాల్ టిక్కెట్ సృష్టించారు. దాంతో యువకుడు పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. కొద్దిసేపటికి అక్కడి వచ్చిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. సిబ్బంది అండతో పరీక్షకు వచ్చినట్లు ఆ యువకుడు చెప్పడం కొసమెరుపు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ కూతురిని వదిలేసిన వైనం ? కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కూతురు కూడా తన సోదరి స్థానంలో మూడ్రోజులుగా పరీక్షకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా సిబ్బంది సహకారంతోనే సాగుతున్నట్లు తెలిసింది. యువకుడు పట్టుబడిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆమెను పరీక్ష మధ్యలోనే కేంద్రం ఉంచి బయటకు పంపడం గమనార్హం. -
ఖైదీలే సైకాలజిస్టులు!
- జైళ్లలోని స్టడీ సెంటర్లలో అందుబాటులోకి ఎంఏ సైకాలజీ - ఇప్పటివరకు డిగ్రీ కోర్సులకే పరిమితం - ఇక ముందు పీజీ కోర్సులు కూడా.. - జైళ్ల శాఖ, అంబేడ్కర్ వర్సిటీల మధ్య ఒప్పందం - ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో నేరాలు చేసినవారెం దరో జైళ్లలో ఏళ్లకేళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే కొంత మంది ఖైదీలు ఈ సమయాన్ని తమలో పరివర్తన కోసం, ఉన్నత చదువుల కోసం వినియోగించుకుంటున్నారు. అలా చాలా మంది డిగ్రీ పట్టాలు కూడా పొందారు. తాజాగా డిగ్రీయే కాదు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసేలా తోడ్పాటు అందించేందుకు జైళ్ల శాఖ సిద్ధమైంది. ఖైదీల్లో మానసిక అభివృద్ధి, కౌన్సెలింగ్ కోసం సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటివరకు చాలా మంది ఖైదీలు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఆపై అంబేడ్కర్ యూనివర్సిటీ సహకారంతో డిగ్రీలు పూర్తిచేస్తున్నారు. కానీ పీజీ చేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తున్నారు. రెండు కారాగారాల్లో.. ఏటా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని జైళ్లలో 500 మంది వరకు ఖైదీలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. వారిలో సుమారు 150 మంది వరకు ఉత్తీర్ణులవుతున్నారు. ఇలాంటి ఖైదీలు పీజీ కోర్సులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉండడంతో.. వారిని ప్రోత్సహించేందుకు జైళ్ల శాఖ చర్య లు చేపట్టింది. దీనిపై అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి కేంద్ర కారాగారాల్లో ఉన్న స్టడీ సెంటర్లలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని కోరింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, కడప కేంద్ర కారాగారాలు సైతం ఇదే ప్రతిపాదన చేశాయి. పీజీ కోర్సుల్లో భాగంగా ఎంఏ సైకాలజీని ప్రవేశపెట్టడం ద్వారా అన్ని జైళ్లలోని ఖైదీలకు మానసిక శిక్షణ, అభివృద్ధికి వారి సేవలు వినియోగించుకో వాలని భావిస్తున్నారు. నేర ప్రవృత్తి కారణంగా జైలుకు వచ్చిన ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నా రు. సీట్ల కేటాయింపుతో సంబంధం లేకుండా పీజీ కోర్సును ప్రవేశపెట్టి ఖైదీలనే.. జైళ్ల శాఖలో సైకాలజిస్టు లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎంఏ సైకాలజీ కోర్సు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉందని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. -
ఓపెన్ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే
తొర్రూరు : బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్షను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కొండేటి శ్రీధర్ ఆదివారం రాశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక పూర్తిస్థాయిలో చదువుకోలేకపోయానని, ఇప్పుడు ఉన్నత చదువులు చదివేందుకు ఈ ఓపెన్ డిగ్రీ అర్హత పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. -
ఖైదీల కోసం మరిన్ని కోర్సులు
అంబేడ్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు వెల్లడి హైదరాబాద్: క్షణికావేశంలో తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక పరి వర్తన తెచ్చి, బాధ్యతగా వ్యవహరించేలా చేయడమే తమ లక్ష్యమని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కె.సీతారామారావు తెలిపారు. డిగ్రీలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని 185 కేంద్రాల్లో విశ్వవిద్యాలయం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించింది. చర్లపల్లి కేంద్ర కారాగారంలోని పరీక్షా కేంద్రాన్ని వీసీ తనిఖీ చేశారు. మరిన్ని కోర్సులను ఖైదీలకు ఉపయోగపడేలా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఎమ్మెస్సీ సైకాలజీ ప్రారంభిస్తామన్నారు. ఖైదీల శిక్షాకాలం వృథా కాకుండా, మానసిక పరిస్థితి దెబ్బ తినకుండా అంబేడ్కర్ వర్సిటీ సహకారంతో పలు కోర్సులు నిర్వహిస్తున్నామని చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. -
దగ్గరవుతున్న ‘దూర’ విద్య..!
► బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం ► ఎలాంటి విద్యార్హత లేకుండా డిగ్రీలో చేరేందుకు సువర్ణావకాశం ► 16తో ముగియనున్న గడువు ► మూడు జిల్లాలోని 13 అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ► యూజీ, పీజీ కోర్సుల్లో 23 వేల మంది అభ్యర్థులు నల్లగొండ: ఎలాంటి విద్యార్హత లేకుండా చదువుకోవాలనుకునే వారికి డా.బీర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సువర్ణఅవకాశం కల్పిస్తోంది. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. అతి తక్కువ ఫీజుతో డిగ్రీలో చేరేందుకు అవకాశం కల్పించడంతో పాటు అన్ని రకాల స్టడీ మెటిరీయల్ అందుబాటులో ఉంచుతోంది. అడ్మిషన్లలో రాష్ట్రంలో నల్లగొండ రీజియన్ సెంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. మహిళలకు ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కాలేజీలో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధ్యయన కేంద్రాలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని 13 అధ్యయన కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎన్ కాలేజీ (నల్లగొండ), ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ (నల్లగొండ), ఎస్వీ డిగ్రీ కాలేజీ (సూర్యాపేట), ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (దేవరకొండ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (నాగార్జునసాగర్), రామకృష్ణ డిగ్రీ కాలేజీ (హాలియా), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (మిర్యాలగూడ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (హుజూర్నగర్), కేఆర్ఆర్ జూనియర్ కాలేజీ (కోదాడ), ప్రభుత్వ జూనియర్ కాలేజీలు (ఆలేరు,భువనగిరి), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (రామన్నపేట). డిగ్రీలో ప్రవేశానికి అర్హులు వీరు.... ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరేందుకు ఇంటర్ ఉత్తీర్ణులైన వారు నేరుగా ఆన్లైన్లో డిగ్రీలో చేరొచ్చు. అదేవిధంగా ఐటీఐ, వృత్తి విద్య ఇంటర్ చేసిన వారు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా డిగ్రీలో చేరాలనుకునే వారు యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ పూర్తిచేసిన వారు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు రూ.1450 చెల్లించాలి. అర్హత పరీ క్ష రాసిన వారు రూ.1300 ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి. అభ్యర్థులు 24 తరగతులు ఉంటాయి. అర్హత పరీక్ష సూచనలు అర్హత పరీక్ష –2017 రాసే అభ్యర్థులు ఆన్లైన్లో డా.బీర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోర్టల్ www. bsoauonine.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీకు కావాల్సిన సమచారానికి సమీపంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు పూర్తిచేయోచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300లు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా లేదా రూ.310లు సమీపంలోని ఏపీ/టీఎస్ ఆన్లైన్ ప్రాంచైజ్ సెంటర్లలో చెల్లించాలి. సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ ఫోటో సైజు తప్పనిసరిగా ఆన్లైన్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. మీ మొబైల్ ఫోన్ నంబర్ లేదా స్నేహితుల ఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి. దీం తో యూనివర్సిటీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని వెంటనే పంపగలుగుతారు. దరఖాస్తులకు స్వీరణకు చివరి తేదీ ఈ నెల 16 ప్రవేశ పరీక్ష 26 తేదీన పరీక్ష నిర్వహించే సమయం: ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు. అతి తక్కువ ఫీజుతో విద్యనందిస్తున్నాం దేశంలోనే అతితక్కువ ఫీజుతో విద్యనందిస్తోంది డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మూడు జిల్లాల్లో కలిపి 23 వేల మంది అభ్యర్థులు యూజీ, పీజీ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. దీంట్లో 65 శాతం మంది మహిళలే ఉండటం గర్వకారణం. ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయడం జరుగుతుంది. ఎలాంటి విద్యార్హత లేని వారి కూడా డిగ్రీలో చేరేలా అవకాశం కల్పించి వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నాం. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీజులు చెల్లించాలి. – డాక్టర్ బి.ధర్మానాయక్ (రీజియన్ కోఆర్డినేటర్) -
ఓపెన్ డిగ్రీ పరీక్షలకు ఫీజు గడువు తేదీ ఇదే
అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్ 1లోగా చెల్లించాలని మహిళా అధ్యాయన కేంద్రం కోఆర్డినేటర్ కే రామచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 2 నుంచి, తృతీయ సంవత్సరం విద్యార్థులకు మే 9 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
26 నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు
శ్రీకాకుళం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ బి. లచ్చన్న తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తృతీయ సంవత్సరం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ 26 నుంచి జూలై 1 వరకు, ఫిజిక్స్ ప్రాక్టికల్స్ 26 నుంచి 30వ తేదీ వరకు, బోటనీ 28, 29 తేదీలలో, జువాలజీ 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ జూలై 3 నుంచి 10వ తేదీ వరకు, ఫిజిక్స్ జూలై 4 నుంచి 9వ తేదీ వరకు, బోటనీ 7, 8 తేదీలలో, జువాలజీ 8, 9 తేదీలలో నిర్వహిస్తామని తెలిపారు. ఆయూ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళంతోపాటు టెక్కలి, ఇచ్ఛాపురం, పార్వతీపురం, పాతపట్నం, పలాస స్టడీ సెంటర్లకు చెందిన ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)లో వారి హాల్ టిక్కెట్లతోపాటు రికార్డులు, గుర్తింపు కార్డులతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08942-226504 నెంబరును సంప్రదించాలని కోరారు. -
అంబేడ్కర్ వర్సిటీ సేవలు ఓపెన్!
సేవలు పునఃప్రారంభం పుంజుకున్న అకడమిక్ కార్యకలాపాలు సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల ఫీజు చెల్లింపునకు ఈ నెల 30 ఆఖరు తేది శ్రీకాకుళం న్యూకాలనీ: ఆరు మాసాలకుపైగా అకడమిక్ సేవలకు, పరీక్షలకు దూరమైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ) సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో గత కొన్ని నెలలుగా నెలకున్న స్తబ్దతకు తెరపడినట్లయింది. తాజాగా సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో యూనివర్సిటీ పరిపాలనా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటంతో బీఆర్‌ఏయూ తెలంగాణ రాష్ట్ర పరిధికి చెందినట్లుగా నిర్ణయించారు. దీంతో గత కొన్ని నెలలగా ఆ రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల్లో మాత్రమే వర్సిటీ సేవలను అందుబాటులో ఉంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలను పూర్తిగా పక్కకునెట్టేశారు. దీంతో పుస్తకాలు లేక, సాధారణ-ప్రవేశ పరీక్షల ఫలితాలు రాక, అకడమిక్ కోర్సుల ట్యూషన్ఫీజుల చెల్లింపులు ఆన్లైన్లో నమోదుకాక విద్యార్థులు అవస్థలు పడ్డారు. మొత్తంమీద గవర్నర్ జోక్యంతోపాటు ఉన్నతస్థాయి అధికారుల జోక్యంతో మళ్లీ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరిస్థితి ఇలా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఓపెన్ యూనివర్సిటీ పేరుతో 1982లో ఏర్పాటై... 1991లో డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(బీఆర్ఏఓయూ)గా నామకరణం చెందింది. అప్పటి నుంచి తొలినాళ్లలో సాధారణ డిగ్రీ కోర్సులను అందించి, క్రమేపీ వివిధ పీజీ కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చింది. 1998 తర్వాత ఆన్లైన్ విధానాన్ని అమలుచేసి విద్యార్థులకు మరింత చేరువైంది. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంగా 1983లో అధ్యయన కేంద్రం తొలితగా ముంజూరైంది. అనంతరం ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం, పలాసలకు కూడా సబ్‌సెంటర్లు మంజూరై ప్రస్తుతం కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యా ప్తంగా సుమారు నాలుగు వేల మం ది ఓపెన్ వర్సిటీ ద్వారా వివిధ కో ర్సులను ప్రస్తుతం అభ్యసిస్తున్నారు. 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. బీఆర్ఏఓయూ దూరవిద్య సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిగ్రీ స్పెల్-2, పీజీ స్పెల్-1 పరీక్షలకు నోటిఫికేషన్ విడదలైంది. డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం డిసెంబర్ 26 నుంచి 31 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు 2016 జనవరి రెండు నుంచి ఐదో తేదీ వరకు జరగనున్నాయి. పీజీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 22 నుంచి 31 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు 2016 జనవరి రెండు నుంచి ఆరో తేదీ వరకు జరగనున్నాయి. డిగ్రీ, పీజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ విద్యార్థులు ప్రతీ పేపర్‌కు రూ.150 చొప్పున ఏదైన జాతీయ బ్యాంకులో ‘ది దిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ, హైదరాబాద్’ పేరిట చెల్లుబాటయ్యేలా ఈ నెల 30వ తేదీలోగా డీడీ తీయాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చాలా సుభపరిణామం. వర్సిటీ దూరవిద్య ద్వారా వేలాది మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారు. అకడమిక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఫీజులు సకాలంలో చెల్లించి, పరీక్షలకు సిద్ధమవ్వాలి. వివరాలకు 08942-226504 సంప్రదిస్తుండాలి. - డాక్టర జి.లచ్చన్న, బీఆర్ఏఓయూ రీజినల్ కోఆర్డినేటర్ -
అంధకారంలో అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులు
విడుదల కాని వార్షిక, ప్రవేశ పరీక్షల ఫలితాలు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు దూరంగా ఆంధ్రా విద్యార్థులు గుంతకల్లు టౌన్ : రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు శాపంగా మారింది. వార్షిక, ప్రవేశ పరీక్షలు జరిగి మూడు నెలలు గడిచినా నేటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణకు వెళ్లలేక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంతకల్లు యస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజితోపాటు అనంతపురం-2, హిందూపురం, ఉరవకొండ, రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం ప్రాంతాల్లో అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అటు తెలంగాణ , ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదర లేదు. ఏప్రిల్ 12న ప్రవేశపరీక్షను ఇరు రాష్ట్రాల్లోనూ నిర్వహించింది. బీఏ, బీకాం,బీయస్సీ కోర్సుల్లో చేరేందుకు జిల్లాలో మొత్తం 927 మంది విద్యార్థులు ప్రవేశపరీక్ష రాశారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ ఫలితాలను విడుదలయ్యాయి. ఆంధ్రా విద్యార్థుల ఫలితాలను మాత్రం విడుదల చేయలేదు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. మేలో ఇరు రాష్ట్రాల్లోనూ ఫస్ట్, సెకండ్, థర్ట్ ఇయర్ల విద్యార్థులకు విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షలు నిర్వహించింది. జిల్లాలో రెగ్యులర్, సప్లిమెంటరీ కలిపి సుమారు 6 వేల మందికి పైగా పరీక్షలు రాశారు. మన రాష్ట్రంలో సెకండ్, థర్డ్ ఇయర్ల విద్యార్థుల ఫలితాలను విడుదల చేసినప్పటికీ మార్కుల జాబితాలను స్టడీ సెంటర్లకు పంపలేదు. అవసరమైన వారు నేరుగా యూనివర్సిటీ వచ్చి తీసుకె ళ్లాలని యూనివర్సిటీ అధికారులు హుకూం జారీ చేసినట్లు స్టడీ సెంటర్ సిబ్బంది చెబుతున్నారు. పైగా ఏపీ స్టడీ సెంటర్లల్లో పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను కూడా అధికారిక యూనివర్సిటీ వెబ్సైట్లో నుంచి తొలగించారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అన్వేషించే అభ్యర్థుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. -
అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలు... తెలంగాణకే పరిమితం!
* ఐదుసార్లు లేఖలు రాసినా స్పందించని ఏపీ సర్కారు * తెలంగాణ వరకే డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో 2015-16 సంవత్సరానికిగాను ప్రవేశాలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేయాలని వర్సిటీ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను 2, 3 రోజుల్లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. పదో షెడ్యూలులో ఉన్న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించాల్సి ఉంది. ఇందులో భాగంగా తమ సేవలను ఆంధ్రప్రదేశ్‌కు అందించాలా? వద్దా? స్పష్టం చేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి వర్సిటీ వర్గాలు ఇప్పటికే ఐదుసార్లు లేఖలు రాశారు. అయితే, ఏపీ ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఏపీలో కాకుండా ఒక్క తెలంగాణలోనే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే ప్రతిఏటా డిగ్రీ కోర్సుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 వేల మంది చేరుతుంటారు. ఇందులో ఏపీ నుంచి దాదాపు 25 వేల మంది ఉంటారు. వారికోసం ఆ రాష్ర్టంలో 90 వరకు అధ్యయన కేంద్రాలు ఉండగా, తెలంగాణలో 120కి పైగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. వాటి ద్వారానే ఈ ప్రవేశాలు, తరగతులు, పరీక్షల నిర్వహణ జరుగుతోంది. కానీ, ఏపీ ప్రభుత్వం స్పందించని కారణంగా ఆ రాష్ర్ట విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులు చదువుకునే అవకాశాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికే డిగ్రీ కోర్సులో చేరి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చేస్తున్న ఏపీ విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. -
మార్చి14 వరకు అంబేద్కర్ వర్సిటీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
బంజారాహిల్స్(హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అర్హత పరీక్ష -2015కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును మార్చి 14వ తేదీ వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ.సుధాకర్ శనివారం తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతుందని ఆయన వెల్లడించారు. -
ఏప్రిల్ 12న అంబేద్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో 2015-16 విద్యాసంవత్సరానికి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్స్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీ లోగా www.braouonline.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి విద్యార్హత లేని వారు, చదవడం, రాయడం తెలిసి ఉండి.. 2015 జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
‘ఘంటా’ మోగింది
ఉద్యమ బిడ్డకు ఉత్తమ పదవి.. పెద్దపల్లి: ఉద్యమకారుడు, శాంతిచర్చల ప్రతినిధి ఘంటా చక్రపాణికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీపీఎస్సీ) చైర్మన్ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎలిగేడు మండలం ధూళికట్లలో జన్మించిన ప్రొఫెసర్ చక్రపాణికి అరుదైన అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాకు రాష్ట్రలో ప్రత్యేకచోటు లభించినట్లయింది. ఎలిగేడు గ్రామానికి చెందిన మొగిలయ్య-జననమ్మ దంపతుల రెండో కుమారుడు చక్రపాణి. అక్కడే ఏడో తరగతి వరకు చదివారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు సుల్తానాబాద్‌లో అభ్యసించారు. ఇంటర్, డిగ్రీ కరీంనగర్లో పూర్తి చేశారు. బాల్యం నుంచే సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. కరీంనగర్ నుంచి వెలువడ్డ జీవగడ్డ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన చక్రపాణి.. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కొనసాగారు. శాంతిచర్చల సభ్యడిగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మావోయిస్టులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో మేధావుల కమిటీ నుంచి సభ్యుడిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం మేధావులు, మానవహక్కుల సంఘాలతో కలిసి పనిచేశారు. పౌరహక్కులకు భంగం కలిగిన పలు సందర్భాల్లో చక్రపాణి గొంతెత్తి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర.. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి కీలకపాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన పలు ప్రజాసంఘాలు చేపట్టిన సభలు, సమావేశాల్లో చక్రపాణి ప్రధాన వక్తగా పాల్గొని తెలంగాణ వాణి వినిపించారు. ఉద్యమానికి మేధావులను సమీకరించడంలో ఆయన చేసిన కృషికి నిదర్శనంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడానికి సూచనప్రాయంగా కేసీఆర్ అంగీకరించారు. అప్పట్లో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలోనే బుధవారం చక్రపాణికి అరుదైన టీపీఎస్సీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. అల్లం నారాయణకు సన్నిహితుడైన చక్రపాణికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అవకాశం దక్కింది. ప్రతీ దీపావళికి ఇంటికి.. హైదరాబాద్‌లో స్థిరపడ్డ చక్రపాణి అన్నదమ్ములు, కుటుంబసభ్యులు ప్రతీదీపావళికి ఎలిగేడుకు వస్తుం టారు. ఎలిగేడులో సొంత ఇంట్లోనే కేదారీశ్వరి వ్రతం నోముకుంటారు. ఆయనకున్న పొలం ప్రస్తుతం కౌలుకిచ్చారు. తల్లిదండ్రులు చక్రపాణితోనే ఉంటున్నారు. చక్రపాణికి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. -
మావారికి మరొకసారి థ్యాంక్స్
వేదిక మా ఊరి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకే ఉంది. దాంతో నా చదువు అక్కడితో ఆగిపోయింది. ఇంట్లో పెద్దమ్మాయిని కావడంతో చదువు పూర్తయిన రెండేళ్లకే రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని అబ్బాయికిచ్చి పెళ్లిచేశారు. నా భర్త డిగ్రీ చదువుకున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాతోటి స్నేహితులంతా వేరే ఊరెళ్లి చదువుకుంటుంటే...నేనేమో ఇలా పెళ్లి చేసుకుని వంటింట్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని చాలా బాధ పడేదాన్ని. నా బాధని అర్థం చేసుకున్న నా భర్త నాతో ప్రయివేటుగా పదోతరగతి చదివించాడు. పరీక్ష రాసి పాసయ్యాక అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీకి కూడా అప్లయి చేయించాడు. మా అత్తయ్య ‘సంటి పిల్లల తల్లికి చదువేంది...!’ అంటూ నా భర్తని తిట్టేది. ఎవరేమన్నా ఆయన పట్టించుకునేవాడు కాదు. ‘‘ఇంటి పనికి, వంట పనికి...ఎంత సమయమైనా సరిపోదు...చేసేకొద్దీ పని ఉంటనే ఉంటది. త్వరగా పనులు ముగించుకుని పుస్తకాలు ముందరేసుకో...పిల్లలు స్కూలుకెళ్లేలోపు నీ చదువు పూర్తయిపోవాలి. తర్వాత నీ కిష్టమైతే ఉద్యోగం చేద్దువు...లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. నీ స్నేహితులను తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం నీకు లేదు’’ అని నా భర్త చెప్పిన మాటలు నాకు చాలా బలాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసేశాను. ఇప్పుడు నా భర్త ఫ్యానులకు సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ప్రారంభించాడు. అందులో అడ్మినిస్ట్రేషన్ పని బాధ్యతలు నాకు అప్పగిస్తానన్నారు. దానికోసం సిద్ధం అవుతున్నాను. నాతో ఇలాంటి పెద్ద పనేదో చేయించడం కోసమే అనుకుంటాను. గత ఏడాది స్పోకెష్ ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చి పట్టుబట్టి నాతో చదివించారు. చదువుకోవడం, ఉద్యోగం చేయడమంటే నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి, పిల్లలు తర్వాత వాటికోసం సమయం కేటాయించడమంటే ఏ అమ్మాయికైనా కష్టమే. చిత్రమేమిటంటే...నా స్నేహితులు చాలామంది డిగ్రీ పూర్తిచేసి పెళ్లి తర్వాత ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయారు. నేను మాత్రం పెళ్లి తర్వాత ఊహించని మలుపులు చూశాను. దీనంతటికీ కారణం నా భర్తే. ఒక్క చదువనే కాదు...పెళ్లి తర్వాత మహిళ ఎదుగుదలను ప్రోత్సహించాలన్నా...అడ్డుపడాలన్నా... రెండూ భర్త వల్లే సాధ్యమవుతాయి. నా భర్తలాంటివారు చాలా అరుదుగా ఉంటారనడంలో సందేహం లేదు. అందుకే ఈ వేదిక ద్వారా ఆయనకి మరొకసారి థ్యాంక్స్ చెబుతున్నాను. - శ్రీలత, రంగారెడ్డి జిల్లా -
‘ఓపెన్’ మిస్టేక్
అంబేద్కర్ వర్సిటీ అధికారుల నిర్వాకం హాల్ టికెట్లపై సమయం ముద్రణలో తప్పిదం పరీక్ష నష్టపోయిన పలువురు విద్యార్థులు తిరిగి నిర్వహించాలంటూ డిమాండ్ తాండూరు/ఆలంపల్లి: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారుల తప్పిదం కారణంగా పలువురు విద్యార్థులు వార్షిక పరీక్ష నష్టపోయారు. ఈ నెల 18 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఈనెల 16 నుంచి విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేశారు. ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసేందుకు తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాల, వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాలల్లోని కేంద్రాలకు విద్యార్థులు వచ్చారు. తృతీయ సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్లపై మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని రాసి ఉంది. వారు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి రాగా.. ఉదయమే పరీక్ష అయిపోయిం దని అధికారులు చెప్పారు. దీంతో విద్యార్థులు అవాక్కయ్యా రు. హాల్‌టికెట్‌లో మధ్యాహ్నం 2గంటల నుంచి పరీక్ష ఉన్నట్లుగా రాసిఉంటే ఉదయమే పరీక్షను ఎలా నిర్వహించారని పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. తృతీయ సంవత్సరం విద్యార్థులమైన తాము ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో పాసై ఉన్నత చదువులు చద వాలనుకుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయామని వాపోయారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. వికారాబాద్ స్టడీ సెంటర్లో 105 మంది విద్యార్థులకు 76 మంది మాత్రమే పరీక్షలు రాశారు. మిగతా 29 మంది పరీక్ష రాయలేకపోయారు. తమ పిల్లల భవిష్యత్తుతో వర్సిటీ అధికారులు ఆటాడుకున్నారని, ఒక పరీక్ష కోసం సంవత్సరం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మా తప్పేమీ లేదు యూనివర్సిటీలోనే సమయాన్ని మార్చారు. విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. కొందరు తెలియని వారు మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి వచ్చారు. ఇందులో మా త ప్పేమీ లేదు. యూనివర్సిటి నుంచే పరీక్ష సమయం మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. - రాజరత్నం, స్టడీసెంటర్ కో-ఆర్డినేటర్, వికారాబాద్ -
ప్రవేశాలు
రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ), రాయ్‌బరేలి, ఉత్తరప్రదేశ్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: బీటెక్ వ్యవధి: నాలుగేళ్లు విభాగాలు: పెట్రోలియం/ కెమికల్ ఇంజనీరింగ్ అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక: జేఈఈ(2014) అడ్వాన్స ర్యాంకు ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మే 12 నుంచి చివరి తేది: జూలై 10 వెబ్సైట్: http://www.rgipt.ac.in అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సౌజన్యంతో ఎంబీఏ కో ర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. కోర్సు: ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ( ఫైన్ ఆర్ట్స్, ఓరియెంటల్ లాంగ్వేజెస్ మినహా) ఉత్తీర్ణులు. ఎంపిక: రాత పరీక్ష ద్వారా దరఖాస్తులు విక్రయం ప్రారంభం: మే 1 నుంచి చివరి తేది: జూన్ 7 ప్రవేశ పరీక్ష తేది: జూన్ 15 వెబ్సైట్: http://www.braou.ac.in/ -
అడ్మిషన్లపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్
రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందిచేలా ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న ప్రవేశాల విధానం కొనసాగింపు, ఉన్నత విద్యా మండలి సహా రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు ఉమ్మడి రాష్ట్రాలకు సేవలందించేలా త్వరలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్లలో పొందుపరచాల్సిన అంశాలపై ఉన్నత విద్యా మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూలులో ఉన్నత విద్యా మండలితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ), శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలతోపాటు మరో 100 రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థలు ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలి. చట్టం ప్రకారం మొదటి ఏడాదిలోగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వీటి సేవల విషయంలో పరస్పర అంగీకారానికి రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా మండలి పరిధిలోని ఆరు విద్యా సంస్థలు అపాయింటెడ్ డే జూన్ 2నుంచి వచ్చే ఏడాది జూన్ 2 వరకు రెండు రాష్ట్రాలకు సేవలు అందించేలా గెజిట్ నోటిఫికేషన్లు సిద్ధం అవుతున్నాయి. రాష్ట్రాలు విడిపోయినా వాటి సేవలు మాత్రం రెండు రాష్ట్రాలకు అందించాలి. ఆ సేవలను కొనసాగిస్తారా? లేదా? వేర్వేరుగా ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకుంటారా? అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకునే వరకు ఈ గెజిట్ నోటిఫికేషన్లు అమల్లో ఉంటాయి. ఏడాదిలోగా రెండు ప్రభుత్వాలు అవగాహనకు రాకపోతే చట్టం ప్రకారం వాటిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల విధానం పదేళ్లపాటు పాత పద్ధతి ప్రకారమే ఉంటుందని చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. -
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీ కోసం ఈనెల 2న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలో 62 వీఆర్ఓ పోస్టులకు 76,179మంది, 177 వీఆర్ఏ పోస్టులకు 4519 మంది అభ్యర్థుల మార్కులను వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు 200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : శనివారం విడుదలైన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) ఉద్యోగాల ఫలితాల్లో ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన ఎలగందుల శ్రీకాంత్ 98 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఖానాపురంలో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో రెగ్యులర్‌గా చదువుకోకుండా హైదరాబాద్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ(బీఏ) పూర్తిచేశారు. 2012 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయి తే ఆప్షన్‌గా ఫైర్‌మెన్‌గా ఉద్యోగం పొందారు. శ్రీకాంత్ ప్రస్తుతం జనగామలో ఫైర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే శ్రీకాంత్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన వీఆర్వో పరీక్ష రాసి జిల్లా టాపర్‌గా నిలిచారు. ‘గ్రూప్-1 ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.అరుుతే గ్రూపు-2 కోసం ప్రిపేర్ అవుతున్న దశలో వీఆర్వో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో దీనికి దరఖాస్తు చేశాను. గ్రూపు-2కు ప్రిపేర్ కావడం కూడా తనకు ఈవీఆర్వో పరీక్షకు ఉపయోగపడింది. పోలీస్ కానిస్టేబుల్‌కు ఎంపికైనప్పుడు తనకు సివిల్, ఫైర్స్టేషన్లలో ఉద్యోగాలకు అవకాశం రాగా ఫైర్‌మెన్ ఉద్యోగిగా ఆప్షన్ తీసుకొని పనిచేస్తున్నాను. వీఆర్వో రాతపరీక్షకు హాజరై 99 మార్కులకు గాను 98 మార్కులతో టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఫైర్‌మెన్ నుంచి వీఆర్వోగా విధుల్లో చేరుతాను. అయితే ఇది కూడా చిరుద్యోగమే అయినా ఫైర్ మెన్ కంటే కొంత ప్రశాంతంగా ఉంటుంది. వీఆర్వో ఉద్యోగంతోనే సరిపుచ్చుకోవాలని లేదు. గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించాలనే తపన ఉంది. ఆ దిశగా ప్రిపరేషన్ కొనసాగిస్తాను’ అని శ్రీకాంత్ చెప్పారు. -
అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు విశ్వ విద్యాలయ పౌర సంబంధాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీలో మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసం గడువును పొడిగించామని యూనివర్సిటీ అధికా రులు వెల్లడించారు. రెండు, మూడో సంవత్సరంలో చేరే విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లింపునకు కూడా గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగిం చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.