ఉద్యమ బిడ్డకు ఉత్తమ పదవి..
పెద్దపల్లి: ఉద్యమకారుడు, శాంతిచర్చల ప్రతినిధి ఘంటా చక్రపాణికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీపీఎస్‌సీ) చైర్మన్ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎలిగేడు మండలం ధూళికట్లలో జన్మించిన ప్రొఫెసర్ చక్రపాణికి అరుదైన అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లాకు రాష్ట్రలో ప్రత్యేకచోటు లభించినట్లయింది. ఎలిగేడు గ్రామానికి చెందిన మొగిలయ్య-జననమ్మ దంపతుల రెండో కుమారుడు చక్రపాణి. అక్కడే ఏడో తరగతి వరకు చదివారు.
ఎనిమిది నుంచి పదో తరగతి వరకు సుల్తానాబాద్‌లో అభ్యసించారు. ఇంటర్, డిగ్రీ కరీంనగర్‌లో పూర్తి చేశారు. బాల్యం నుంచే సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. కరీంనగర్ నుంచి వెలువడ్డ జీవగడ్డ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన చక్రపాణి.. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కొనసాగారు.
శాంతిచర్చల సభ్యడిగా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మావోయిస్టులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో మేధావుల కమిటీ నుంచి సభ్యుడిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం మేధావులు, మానవహక్కుల సంఘాలతో కలిసి పనిచేశారు. పౌరహక్కులకు భంగం కలిగిన పలు సందర్భాల్లో చక్రపాణి గొంతెత్తి ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర..
తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి కీలకపాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన పలు ప్రజాసంఘాలు చేపట్టిన సభలు, సమావేశాల్లో చక్రపాణి ప్రధాన వక్తగా పాల్గొని తెలంగాణ వాణి వినిపించారు. ఉద్యమానికి మేధావులను సమీకరించడంలో ఆయన చేసిన కృషికి నిదర్శనంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడానికి సూచనప్రాయంగా కేసీఆర్ అంగీకరించారు.
అప్పట్లో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలోనే బుధవారం చక్రపాణికి అరుదైన టీపీఎస్‌సీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. అల్లం నారాయణకు సన్నిహితుడైన చక్రపాణికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అవకాశం దక్కింది. ప్రతీ దీపావళికి ఇంటికి..
హైదరాబాద్‌లో స్థిరపడ్డ చక్రపాణి అన్నదమ్ములు, కుటుంబసభ్యులు ప్రతీదీపావళికి ఎలిగేడుకు వస్తుం టారు. ఎలిగేడులో సొంత ఇంట్లోనే కేదారీశ్వరి వ్రతం నోముకుంటారు. ఆయనకున్న పొలం ప్రస్తుతం కౌలుకిచ్చారు. తల్లిదండ్రులు చక్రపాణితోనే ఉంటున్నారు. చక్రపాణికి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు.
‘ఘంటా’ మోగింది
Published Thu, Dec 18 2014 2:02 AM | Last Updated on Sat, Aug 11 2018 5:13 PM
Advertisement
Advertisement