సేవలు పునఃప్రారంభం
పుంజుకున్న అకడమిక్ కార్యకలాపాలు
సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
ఫీజు చెల్లింపునకు ఈ నెల 30 ఆఖరు తేది
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆరు మాసాలకుపైగా అకడమిక్ సేవలకు, పరీక్షలకు దూరమైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో గత కొన్ని నెలలుగా నెలకున్న స్తబ్దతకు తెరపడినట్లయింది. తాజాగా సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో యూనివర్సిటీ పరిపాలనా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటంతో బీఆర్‌ఏయూ తెలంగాణ రాష్ట్ర పరిధికి చెందినట్లుగా నిర్ణయించారు.
దీంతో గత కొన్ని నెలలగా ఆ రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల్లో మాత్రమే వర్సిటీ సేవలను అందుబాటులో ఉంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలను పూర్తిగా పక్కకునెట్టేశారు. దీంతో పుస్తకాలు లేక, సాధారణ-ప్రవేశ పరీక్షల ఫలితాలు రాక, అకడమిక్ కోర్సుల ట్యూషన్‌ఫీజుల చెల్లింపులు ఆన్‌లైన్‌లో నమోదుకాక విద్యార్థులు అవస్థలు పడ్డారు. మొత్తంమీద గవర్నర్ జోక్యంతోపాటు ఉన్నతస్థాయి అధికారుల జోక్యంతో మళ్లీ సేవలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలో పరిస్థితి ఇలా
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఓపెన్ యూనివర్సిటీ పేరుతో 1982లో ఏర్పాటై... 1991లో డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)గా నామకరణం చెందింది. అప్పటి నుంచి తొలినాళ్లలో సాధారణ డిగ్రీ కోర్సులను అందించి, క్రమేపీ వివిధ పీజీ కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చింది. 1998 తర్వాత ఆన్‌లైన్ విధానాన్ని అమలుచేసి విద్యార్థులకు మరింత చేరువైంది. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంగా 1983లో అధ్యయన కేంద్రం తొలితగా ముంజూరైంది. అనంతరం ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం, పలాసలకు కూడా సబ్‌సెంటర్లు మంజూరై ప్రస్తుతం కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యా ప్తంగా సుమారు నాలుగు వేల మం ది ఓపెన్ వర్సిటీ ద్వారా వివిధ కో ర్సులను ప్రస్తుతం అభ్యసిస్తున్నారు.
18 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
బీఆర్‌ఏఓయూ దూరవిద్య సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిగ్రీ స్పెల్-2, పీజీ స్పెల్-1 పరీక్షలకు నోటిఫికేషన్ విడదలైంది.
డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం డిసెంబర్ 26 నుంచి 31 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు 2016 జనవరి రెండు నుంచి ఐదో తేదీ వరకు జరగనున్నాయి.
పీజీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 22 నుంచి 31 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు 2016 జనవరి రెండు నుంచి ఆరో తేదీ వరకు జరగనున్నాయి.
డిగ్రీ, పీజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ విద్యార్థులు ప్రతీ పేపర్‌కు రూ.150 చొప్పున ఏదైన జాతీయ బ్యాంకులో ‘ది దిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ, హైదరాబాద్’ పేరిట చెల్లుబాటయ్యేలా ఈ నెల 30వ తేదీలోగా డీడీ తీయాల్సి ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చాలా సుభపరిణామం. వర్సిటీ దూరవిద్య ద్వారా వేలాది మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారు. అకడమిక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఫీజులు సకాలంలో చెల్లించి, పరీక్షలకు సిద్ధమవ్వాలి. వివరాలకు 08942-226504 సంప్రదిస్తుండాలి.
- డాక్టర జి.లచ్చన్న, బీఆర్‌ఏఓయూ రీజినల్ కోఆర్డినేటర్
అంబేడ్కర్ వర్సిటీ సేవలు ఓపెన్!
Published Sat, Nov 28 2015 3:37 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
Advertisement