సాక్షి, మెట్‌పల్లి(కోరుట్ల): కాసులిస్తే చాలు.. ఆ పరీక్ష కేంద్రంలో సిబ్బంది కాపీయింగ్‌కే కాదు ఏకంగా అభ్యర్థులకు బదులు వారిస్థానంలో ఇతరులు వచ్చి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. బేరం కుదిరితే దగ్గరుండి చిట్టీలు అందించి ఉత్తీర్ణతకు సహకరిస్తారు. మెట్‌పల్లిలోని ఓపెన్ డిగ్రీ పరీక్ష కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ‘ఓపెన్’గా అక్రమాలు జరుగుతున్నాయి.
మాస్‌కాపీయింగ్‌కు ప్రత్యేకం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పేరొందిన మెట్‌పల్లి కేంద్రంలో కొత్త అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం కేవలం చిట్టీలతో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్న ఈ కేంద్రంలో తాజాగా ఒకరికి బదులు ఇతరులు పరీక్ష రాస్తున్న విషయం బయటపడింది. సిబ్బంది అండతో బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బుధవారం కథలాపూర్ ఎంపీపీ తొట్ల నర్సు భర్త తొట్ల అంజయ్యకు బదులు మరో యువకుడు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు.
ఇదీ జరిగింది...
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సోమవారం నుంచి ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారని కొందరు ప్రిన్సిపాల్ ఆబిద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పట్టించుకోలేదు. అబ్జర్వర్ హరిశంకర్‌కు తెలుపగా ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లి హాల్ టిక్కెట్లు పరిశీలించారు. తోట్ల అంజయ్య అనే పేరుతో పరీక్ష రాస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి ఆన్‌లైన్‌లో పరిశీలించారు.
అందులో మరో వ్యక్తి ఫొటో ఉండడంతో పరీక్ష రాస్తున్న వ్యక్తి నకిలీ అని తేలింది. అసలు వ్యక్తి కథలాపూర్ ఎంపీపీ భర్త కాగా, అతని స్థానంలో కోరుట్లకు చెందిన ఓ యువకుడి ఫొటోను మార్పింగ్ చేసి హాల్ టిక్కెట్ సృష్టించారు. దాంతో యువకుడు పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. కొద్దిసేపటికి అక్కడి వచ్చిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. సిబ్బంది అండతో పరీక్షకు వచ్చినట్లు ఆ యువకుడు చెప్పడం కొసమెరుపు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కానిస్టేబుల్ కూతురిని వదిలేసిన వైనం ?
కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కూతురు కూడా తన సోదరి స్థానంలో మూడ్రోజులుగా పరీక్షకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా సిబ్బంది సహకారంతోనే సాగుతున్నట్లు తెలిసింది. యువకుడు పట్టుబడిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆమెను పరీక్ష మధ్యలోనే కేంద్రం ఉంచి బయటకు పంపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment