exam centre
-
అప్పుడేమో నీట్ టాపర్లు, రీఎగ్జామ్ ఫలితాల్లో మాత్రం..
న్యూఢిల్లీ: ఆ సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. అది ఫలితాలపై, మొత్తం పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తూ .. దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అయితే గ్రేసు మార్కులు కలపవడం వల్లే అలా జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నాం సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేశారు. అయితే.. హర్యానాలో 720కి 720 ఆరుగురికి వచ్చిన సెంటర్లో ఈసారి ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. బహాదుర్‌ఘడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో మొత్తం 494 మంది పరీక్ష రాశారు. కానీ, ఆ సెంటర్లో రీఎగ్జామ్ రాసిన వాళ్లలో ఎవరికీ 700 దాటలేదు. ఆ సెంటర్లో హయ్యెస్ట్ మార్కులు 682 మాత్రమే. మరో పదమూడు మందికి 600కి పైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది.మే 5వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షలో.. హర్యానా సెంటర్లో రాసిన ఆరుగురికి ఫుల్‌స్కోర్, మరో ఇద్దరికి 719, 718 మార్కులు వచ్చాయి. అయితే.. రీటెస్ట్ తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఫలితాల తర్వాత ఎన్టీఏ వెల్లడించడం తెలిసిందే. గతంలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో 24 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగా జూన్ 4న ఫలితాలు ఇవ్వడం, అందులోనూ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అభ్యర్థుల్లో అనుమానాల్ని రేకెత్తించింది. రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై రాజకీయ దుమారం సైతం చెలరేగడం, ఆపై వివాదం సుప్రీం కోర్టుకు చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తూ రీటెస్ట్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది. జూన్ 24వ తేదీన నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహించగా.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి 813 మంది మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు.ఇక.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోపక్క ఈ అవకతవకలపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఎన్టీఏ తన వెబ్సైట్లో ఫలితాలు ఉంచింది. అయితే.. ఫలితాల వెల్లడి టైంలో విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సుప్రీం సూచనను టెస్టింగ్ ఏజెన్సీ పాటించింది. -
ప్రమాద గాయాలతోనే పరీక్షలకు..
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ పరీక్షలను మిస్సవ్వకూడదని భావిస్తారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ముగ్గురు ప్రమాదం బారినపడినా పరీక్షలను ఎంతో ధైర్యంగా రాశారు. జైపూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరారు. అయితే దారిలో వారి బైక్ ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేందుదుకు ఆ విద్యార్థులు ఉదయం 7:45 గంటలకు బైక్‌పై బయలుదేరారు. అయితే సెంటర్‌కు చేరుకునేలోగా వారి బైక్‌ను ప్రయాణికుల వ్యాన్ ఢీకొంది. దీంతో ఆ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారి గాయాలకు డ్రెస్సింగ్ చేశారు. అదే పరిస్థితిలో వారు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అక్కడి ఉపాధ్యాయులను అభ్యర్థించాక వారికి అందుకు అనుమతిచ్చారు. వారి కాళ్ల నుంచి రక్తం కారుతున్నా వారు పరీక్ష రాయడం విశేషం. తరువాత వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యార్థుల ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలియజేస్తూ ఈ విద్యార్థులు ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారని తెలిపారు. వీరిని మన్పురా మచాడీ నివాసి లోకేష్ యాదవ్, ఉదయపురియా నివాసి అంకిత్ గుర్జార్, ఏకలవ్య ఫుల్వాడియాగా గుర్తించారు. ముగ్గురూ ఒకే బైక్‌పై పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రయాణికులు వాహనం వీరి బైక్‌ను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. -
పరీక్షకు ఆలస్యం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
జైనథ్: పరీక్షకు ఆలస్యం కావడంతో ఆవేదన చెందిన ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘జీవితంలో మొదటిసారి ఎగ్జామ్ మిస్సయ్యాను. క్షమించు నాన్నా..’అంటూ లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టులో దూకాడు. గురువారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన టేకం రాము, పంచపుల దంపతుల రెండో కుమారుడు శివకుమార్ (16). ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఇంటర్ సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మొదటి పరీక్ష ఉండగా.. ఉదయం 8.30గంటలకు గ్రామం నుంచి ఆటోలో ఆదిలాబాద్‌కు బయల్దేరాడు. మధ్యలో ఉండగా ఆలస్యం అవుతోందని ఆవేదన చెందాడు. ఆ సమయంలో ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ పరిచయమున్న వ్యక్తి ద్విచక్రవాహనంపై ఎక్కాడు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్‌చౌక్ వద్దకు చేరుకునే సరికే.. సమయం 9 గంటలు దాటిపోయింది. అక్కడే దిగిపోయిన శివకుమార్.. టీఎస్టీడబ్ల్యూ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆలస్యం కావడంతో పరీక్షకు రానివ్వరని దిగులు చెందాడు. ఆటో ఎక్కి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గ్రామ సమీపంలోని సాత్నాల ప్రాజెక్టు వద్ద ఆటో దిగాడు. సూసైడ్ నోట్ రాసి, దానితోపాటు చేతి వాచీ, పెన్ను, పర్సు వంటివి ఒడ్డుపై ఉంచి ప్రాజెక్టులో దూకేశాడు. కాసేపటికి దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా మధ్యాహ్నం సమయంలో శివకుమార్ మృతదేహం లభ్యమైంది. ‘‘నాన్నా నన్ను క్షమించు.. నాకోసం ఎంతో చేశావు.. నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను.. జీవితంలో మొదటిసారి ఎగ్జామ్ మిస్ అయ్యాను..’’అని శివకుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పరీక్షకు ఆలస్యంగా వెళ్తే రానివ్వరనే ఆందోళనతో శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
టెట్ పరీక్షలో విషాదం.. గర్భిణి మృతి
సాక్షి, సంగారెడ్డి: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి ఎగ్జామ్ సెంటర్లో మృతి చెందిన పటాన్చెరు మండలం పరిధిలో జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే భయంతో.. రాధిక అనే అభ్యర్థిని పరీక్షకు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించింది. గచ్చిబౌలిలో రాధిక, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. రాధిక 8 నెలల గర్భంతో ఉంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్ పడింది. బైక్ పై ప్రయాణమై ఇస్నాపూర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆమె వేగంగా పరిగెత్తింది. సెంటర్‌కు చేరుకున్న వెంటనే ఆమెకు బీపీ ఎక్కువై చెమట్లు పట్టేశాయి. పరీక్ష సెంటర్లోనే కుప్పకూలి పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దిరికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
వైరల్: వామ్మో.. అంత మంది అమ్మాయిలా?
Viral News: పాపం.. పరీక్ష హాల్లో అంత మంది అమ్మాయిలను ఒక్కసారిగా చూసేసరికి ఆ కుర్రాడికి ఏం అనిపించిందో ఏమో!. వాళ్ల మధ్యలో తానొక్కడే ఉన్నాడన్న సంగతి తెలిసిన ఆ కుర్రాడు.. ఏకంగా స్పృహ కోల్పోయాడు. బిహార్‌లోని నలందాలో బుధవారం ఈ ఘటన జరిగింది. బీహార్‌లో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మనీశ్ శంకర్ ప్రసాద్ (17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజ్ స్టూడెంట్. తొలి పరీక్ష మ్యాథ్‌మెటిక్స్ రాసేందుకు మనీశ్‌ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్, సుందరగడ్లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకొచ్చాడు. అయితే.. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్లోకి వెళ్లాడు. అక్కడ అంతా బాలికలు ఉండేసరికి.. ఆశ్చర్యపోయాడు. అతని చూసి అమ్మాయిలంతా ఒక్కసారిగా ఘోల్లుమనడంతో.. అర్థంకాని అయోమయంలో ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు మనీశ్. దీంతో అతన్ని సర్దార్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు పరీక్షా నిర్వాహకులు. ‘‘ఒకేసారిగా అంతమంది అమ్మాయిలను చూసి చాలా కంగారుపడ్డాడు. అందుకే స్పృహతప్పిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యంగానే ఉన్నాడని ఆస్పత్రిలో అతని బాగోగులు చూసుకుంటున్న మనీశ్ శంకర్ మేనత్త చెబుతోంది. పూర్తిగా అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో పొరపాటున మనీష్‌కు కేటాయింపు జరిగిందని అక్కడి విద్యాధికారులు చెప్తున్నారు. बिहार बोर्ड की 12वीं की परीक्षा के दौरान हुई अजीबोगरीब घटना | Unseen India pic.twitter.com/5awOkkjK6L — UnSeen India (@USIndia_) February 1, 2023 -
NEET అభ్యర్థి లోదుస్తుల తొలగింపుపై రగడ
తిరువనంతపురం: నీట్ పరీక్షలో అభ్యర్థి లోదుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షకు అనుమతించారనే వ్యవహారం ముదురుతోంది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. స్పందించిన మానవ హక్కుల సంఘం.. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది కూడా. అయితే.. నీట్ ఎగ్జామ్ కోసం వెళ్లిన అభ్యర్థిని లోదుస్తులు తొలగించారనే ఘటనపై ఎట్టకేలకు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జులై 17న నీట్ పరీక్ష సందర్భంగా.. కేరళ కొల్లాంలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థినిని లోదుస్తులు తొలగించాల్సిందిగా సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. 90 శాతం విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, వాళ్లంతా మానసిక వేదన అనుభవించారని ఆరోపించారు. మీడియా కథనాల ఆధారంగా.. ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ డ్రెస్ కోడ్ ప్రకారం.. నీట్ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవు. కోడ్ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్టీఏ తెలిపింది. విమర్శల నేపథ్యంతో.. కేరళ కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రంలో తన కూతురికి ఎదురైన ఘోర అవమానంపై కొట్టారకారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్టీఏ రూల్స్‌లో లేకున్నా తన కూతురి లోదుస్తులు విప్పించి స్టోర్ రూమ్‌లో పడేయాలని, ఆపైనే పరీక్షకు అనుమతించారని.. తద్వారా ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. మెజార్టీ విద్యార్థులకు ఇలాంటి సమస్యే ఎదురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేరళ లోక్‌సభ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు. ఈ మేరకు ఘటనపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నారు. పోలీస్ కేసు నమోదు బలవంతగా విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. అలాగే.. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్‌వేర్‌ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. అయితే పరీక్ష నిర్వాహణ కేంద్రం అయిన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు.. తమ సిబ్బంది ఎవరూ తనిఖీల ప్రక్రియలో పాల్గొనలేదని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ విద్యాశాఖ కూడా తమ పరిధిలో ఈ పరీక్ష జరగలేదని, రాష్ట్ర నిర్వాహణ అధికారులు ఎవరూ అందులో లేరని అంటోంది. డ్రెస్ కోడ్ ఏంటంటే.. అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే శాండల్స్, ఓపెన్ స్లిప్పర్స్ వేస్కోవచ్చు. షూలు ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్లెట్, కెమెరా, నగలు, మెటాలిక్ వస్తువులు నిషిద్ధం. అయితే మెటాలిక్ హుక్స్ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేరళలోనే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017లో కేరళ కన్నూర్‌లోనే ఓ అభ్యర్థితో బ్రా విప్పించారు సెంటర్ నిర్వాహకులు. ఆ ఘటన విమర్శలకు దారి తీసింది. తొలుత.. హాప్ స్లీవ్, బ్లాక్ ప్యాంట్‌తో సెంటర్‌కు చేరుకుంది ఓ అభ్యర్థి. అయితే డార్క్ కలర్ అనుమతించకపోవడంతో.. ఆమె ఆందోళనకు గురైంది. ఆదివారం కావడంతో దుకాణాలు సైతం తెరవలేదు. దీంతో రెండు కిలోమీటర్లు తల్లితో పాటు వెళ్లి కొత్త దుస్తులు కొనుగులు చేసుకుని మార్చుకుని వచ్చింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మెటల్ డిటెక్టర్ గుండా వెళ్తున్న టైంలో.. బ్రాకు ఉన్న హుక్స్ కారణంగా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇన్నర్‌వేర్ తొలగించి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆమె పరీక్ష రాసింది. ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లునీట్ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం పాలక్కడలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ ఏడాది నీట్ పరీక్షల సమయంలో హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు సైతం రావడం విశేషం. -
ఏపీ పాలీసెట్ 2022: విద్యార్థులూ ఇవి తెలుసుకోండి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం (మే 29) నిర్వహించనున్న పాలీసెట్–2022కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కమిషనర్ పోల భాస్కర్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్ జరుగుతుందన్నారు. పది గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా లేని విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతోపాటు బాల్ పెన్ను, పెన్సిల్, రబ్బరును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,37,371 మంది విద్యార్థులు పాలీసెట్‌కు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష పూర్తి అయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. -
విద్యార్థినితో ఇన్విజిలేటర్ అనుచిత ప్రవర్తన
ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది. సాక్షి, మానకొండూర్(కరీంనగర్) : ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పరీక్ష నిర్వహించాల్సిన ఇన్విజిలేటర్ విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరించడంతో బాధితురాలు తాను చదివే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చే సింది. ఈ మేరకు యాజమాన్యం సదరు అధ్యాపకుడిని పిలిపించి మందలించగా, విద్యార్థులు దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతు న్న విద్యార్థిని జేఎన్టీయూ నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలు రాస్తోంది. ఇదే మండలంలోని మరో ప్రైవేటు కళాశాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. రోజులాగే సోమవారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా, ఇన్విజిలేటర్‌గా బి.వెంకటేశ్‌ను కేటాయించారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన సదరు ఇన్విజిలేటర్ పరీక్ష రాస్తున్నంత సేపు తనను వేధించినట్లు విద్యార్థిని తెలిపింది. అవసరం లేకున్నా తన వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని, పరీక్ష పూర్తయ్యే సమయంలో ఫోన్ నంబర్ ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురించి మంగళవారం తాను చదివే కళాశాల యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కళాశాల చైర్మన్ అధ్యాపకుడిని కళాశాలకు పిలిపించి మందలించారు. విషయం తెలిసి అక్కడికి చేరిన విద్యార్థులు సదరు అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. చైర్మన్ పోలీసులకు సమాచారం అందించడంతో గొడవ సద్దుమణిగింది. అధ్యాపకుడిని ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
‘టెట్’ ఇదేం పని!
పాడేరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. డీఎస్సీ అర్హత కోసం ముందుగా నిర్వహించే టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 3 వేల మంది అభ్యర్థులు పేపర్–1(ఎస్జీటీ), పేపర్–2(స్కూల్ అసిస్టెంట్), పేపర్–3 (లాంగ్వేజ్ పండిట్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తు చేసుకున్న సమయంలో గతంలో మాదిరిగా పరీక్షకు హాజరయ్యే జిల్లా పేరును ఎంచుకోవాలని ప్రస్తావించలేదు. పరీక్ష కేంద్రం జిల్లా కోసం తర్వాత ఆప్షనల్ ఎంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయం ముందుగా ప్రకటించకపోవడం తో అభ్యర్థులు పెద్దగా పట్టించుకోలేదు. దరఖాస్తు గడువు ముగిసిన రెండు రోజుల తర్వాత టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 29 వరకు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సెల్ఫోన్లకు మెసెజ్‌లు పంపించింది. సెల్ సిగ్నల్ అందుబాటులో ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి పరీక్ష కేంద్రాలను ఎంచుకున్నారు. కానీ ఏజెన్సీలో సమాచార వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో మారుమూల గ్రామాల్లో అభ్యర్థులకు ఈ విషయం తెలియలేదు. చివరి రోజు కొంతమంది ఆన్లైన్ సెంటర్లకు వచ్చి సెంటర్లకు ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నించగా విశాఖ జిల్లాల్లో పరీక్ష సెంటర్లు ఖాళీగా లేవని కర్ణాటక, చెన్నై, హైదరబాద్ వంటి ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నాయి.దీంతో అభ్యర్థులు షాక్ తిన్నారు. దూరం కారణంగా చాలా మంది అభ్యర్థులు ఆ సెంటర్లను ఎంపిక చేసుకోలేదు. ఈ విషయాన్ని పలువురు అభ్యర్థులు పాడేరు ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసి విశాఖ జిల్లాలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం నిరుద్యోగుల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ అన్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న కొందరు గిరిజన అభ్యర్థులు మంగళవారం ఆయనను కలిసి సమస్యను విన్నవించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. -
బేరం కుదిరితే పరీక్షంతా ఓపెనే..
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): కాసులిస్తే చాలు.. ఆ పరీక్ష కేంద్రంలో సిబ్బంది కాపీయింగ్‌కే కాదు ఏకంగా అభ్యర్థులకు బదులు వారిస్థానంలో ఇతరులు వచ్చి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. బేరం కుదిరితే దగ్గరుండి చిట్టీలు అందించి ఉత్తీర్ణతకు సహకరిస్తారు. మెట్‌పల్లిలోని ఓపెన్ డిగ్రీ పరీక్ష కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ‘ఓపెన్’గా అక్రమాలు జరుగుతున్నాయి. మాస్‌కాపీయింగ్‌కు ప్రత్యేకం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పేరొందిన మెట్పల్లి కేంద్రంలో కొత్త అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం కేవలం చిట్టీలతో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్న ఈ కేంద్రంలో తాజాగా ఒకరికి బదులు ఇతరులు పరీక్ష రాస్తున్న విషయం బయటపడింది. సిబ్బంది అండతో బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బుధవారం కథలాపూర్ ఎంపీపీ తొట్ల నర్సు భర్త తొట్ల అంజయ్యకు బదులు మరో యువకుడు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. ఇదీ జరిగింది... పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సోమవారం నుంచి ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారని కొందరు ప్రిన్సిపాల్ ఆబిద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పట్టించుకోలేదు. అబ్జర్వర్ హరిశంకర్‌కు తెలుపగా ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లి హాల్ టిక్కెట్లు పరిశీలించారు. తోట్ల అంజయ్య అనే పేరుతో పరీక్ష రాస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి ఆన్లైన్లో పరిశీలించారు. అందులో మరో వ్యక్తి ఫొటో ఉండడంతో పరీక్ష రాస్తున్న వ్యక్తి నకిలీ అని తేలింది. అసలు వ్యక్తి కథలాపూర్ ఎంపీపీ భర్త కాగా, అతని స్థానంలో కోరుట్లకు చెందిన ఓ యువకుడి ఫొటోను మార్పింగ్ చేసి హాల్ టిక్కెట్ సృష్టించారు. దాంతో యువకుడు పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. కొద్దిసేపటికి అక్కడి వచ్చిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. సిబ్బంది అండతో పరీక్షకు వచ్చినట్లు ఆ యువకుడు చెప్పడం కొసమెరుపు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ కూతురిని వదిలేసిన వైనం ? కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కూతురు కూడా తన సోదరి స్థానంలో మూడ్రోజులుగా పరీక్షకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా సిబ్బంది సహకారంతోనే సాగుతున్నట్లు తెలిసింది. యువకుడు పట్టుబడిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆమెను పరీక్ష మధ్యలోనే కేంద్రం ఉంచి బయటకు పంపడం గమనార్హం. -
విద్యార్థినికి కన్నీటి పరీక్ష
నిజాంసాగర్(జుక్కల్): ఏడాది నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టిన కస్తూర్బా విద్యార్థినికి పదో తరగతి పరీక్ష కన్నీటి పరీక్ష అయ్యింది. పరీక్షకు సన్నద్ధం అయిన కూతురికి ధైర్యం చెప్పి, పరీక్ష సెంటర్లోకి సాగనంపిన తండ్రి శాశ్వతంగా దూరమయ్యాడు. ఇంట్లో తండ్రి శవం.. పుట్టెడు దుఖంతో కన్నీళ్లను దిగమింగుతూ విషాదవదనంతో పదో తరగతి పరీక్ష రాసింది మౌనిక. వివరాలు.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మైలారం కృష్ణ (44)కు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. రెండో కూతురు మౌనిక నిజాంసాగర్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతుంది. గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో కృష్ణ తన కూతురి పరీక్ష కోసం నిజాంసాగర్ మండల కేంద్రానికి వచ్చాడు. కస్తూర్బా నుంచి తోటి విద్యార్థినులతో కలిసి వచ్చిన మౌనిక పరీక్ష కేంద్రం వద్ద తండ్రితో కొద్దిసేపు గడిపింది. అనంతరం కృష్ణ తన కూతురికి ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపాడు. కూతురి కోసం నిజాంసాగర్ మండల కేంద్రంలోనే ఉన్న కృష్ణకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. అదే సమయంలో మౌనిక పరీక్ష పూర్తవడంతో బయటకు వచ్చింది. తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి స్థానికుల సహాయంతో కృష్ణను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అయితే అస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. తండ్రి మృతితో రాత్రంతా రోదించిన మౌనికకు బంధువులు ధైర్యం చెప్పారు. తండ్రి మరణాన్ని తట్టుకొలేని మౌనికకు కుటుంబీకులు ధైర్యం చెప్పడంతో శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి వచ్చింది. బంధువుల సహకారంతో తెలుగు పరీక్ష –2 రాసిన అనంతరం మౌనిక తండ్రి అంత్యక్రియలకు వెళ్లింది. మృతుడికి ఐదుగురు కూతుళ్లు ఉండగా మౌనిక రెండో కూతురు. -
అడవిలో పరీక్ష అని తెలియక..
సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: ఐదు నిమిషాల ఆలస్యంగా వెళ్లడంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. రెండో విడత ఆన్లైన్ పరీక్ష మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థులు 30 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రాజానగరం మండలం దివాన్‌చెరువులోని శ్రీప్రకాశ్ విద్యానికేతన్ స్కూల్ గ్రామానికి లోపల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలోనే విద్యాసంస్థ ఉందని భావించిన అభ్యర్థులు ఆ మేరకు తమ ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా దివాన్‌చెరువు గ్రామానికి వచ్చిన తర్వాత స్కూలు మూడు కిలోమీటర్ల లోపల, అడవిలో ఉందని తెలియడంతో అక్కడకు ఎలా వెళ్లాలో తెలియక కంగారు పడ్డారు. రవాణా సౌకర్యం కూడా లేకపోవడం, ఓ పక్క సమయం మించిపోతుండడంతో పలువురు అభ్యర్థులు పరుగులు పెట్టారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యేందుకు ఒంటి గంటకు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే పలువురు అభ్యర్థులు 1.05 గంటలకు చేరుకోవడంతో గేటు వద్దే వారిని నిలిపివేశారు. జరిగిన విషయం వివరించినా సెక్యూరిటీ సిబ్బంది వారిని అనుమతించలేదు. స్కూలు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలియక తాము నష్టపోయామని భావించిన కె.సత్యనారాయణ, ప్రసాద్, నవీన్‌కుమార్ తదితర పది మంది అభ్యర్థులు మరొకరు తమలా నష్టపోకూడదంటూ ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చారు. జరిగిన విషయం చెప్పి వాపోయారు. పరీక్ష కేంద్రం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, రవాణా సౌకర్యం కూడా లేకపోవడం ఆ సెంటర్‌ను మరోసారి ఎంపికచేసే సమయంలో అధికారులు పునరాలోచన చేయాలని విజ్జప్తి చేస్తున్నారు. నెలల తరబడి పరీక్షకు సిద్ధమైన తాము తమ తప్పు లేకుండానే నష్టపోయామని వాపోయారు. -
పరీక్ష హాలులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
విజయవాడ : ఓ విద్యార్థి ఎగ్జామ్హాల్లో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన అనంతసాయి తిరువూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సు మొదటి ఏడాది చదువుతున్నాడు. అయితే గురువారం వార్షిక పరీక్షలుకు హాజరైన అనంతసాయి పరీక్షహాలులోనే పురుగుల మందు తాగాడు. అప్రమత్తమైన అధికారులు విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యాయత్యానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. (తిరువూరు) -
ప్రశాంతంగా ఎంసెట్
- మూడు నిమిషాల లేటుతో ఇద్దరు వెనక్కి - మొత్తం పది కేంద్రాల్లో పరీక్ష - 8,137 మంది విద్యార్థుల హాజరు ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఒంగోలు నగరం, చీమకుర్తిలోని 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి మొత్తం 8,745 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 8,137 మంది హాజరయ్యారు. 93 శాతం మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి 2,117 మంది దరఖాస్తు చేయగా 1944 మంది పరీక్షకు హాజరయ్యారు. 91 శాతం మంది పరీక్ష రాశారు. ఎంసెట్ పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హైటెక్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విద్యాశాఖ, పోలీసు అధికారులతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. విద్యార్థులందరూ ఉదయం 9.30 గంటలలోపు, మధ్యాహ్నం 2 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జెడ్ రమేష్‌బాబు తెలిపారు. మూడు నిమిషాల లేట్తో ఇద్దరు వెనక్కి ఒంగోలు రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయారు. ఎంసెట్ నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులెవరినీ పరీక్షకు అనుమతించరు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు ముందుగానే ప్రకటించారు. నేతివారిపాలెం, సింగరాయకొండకు చెందిన ఇద్దరు 10.03 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవడంతో వారిని లోనికి అనుమతించలేదు. వీరు కుల ధ్రువీకరణ పత్రాలు లేకుండా తొలుత పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారులచే అటెస్ట్ చేయించి సంబంధింత చీఫ్ సూపరింటెండెంట్‌కు అందజేయాలి. చీఫ్ సూపరింటెండెంట్లు ఈ కుల ధ్రువీకరణ పత్రాలను విద్యార్థుల నామినల్ రోల్స్‌కు అంటించి పంపుతారు. ఉదయం పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు ఈ విషయం తెలుసుకుని అప్పటికప్పుడు ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకుని వచ్చేటప్పటికి కాలాతీతమైంది. 10.03 గంటలకు ఆ ఇద్దరు విద్యార్థులు రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పటికే (10 గంటలకే) ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. పరీక్ష రాయలేకపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. -
ప్రశాంతంగా ఎంసెట్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, వనపర్తి టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంతోపాటు వనపర్తిలో గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మెడిసిన్‌లో 3,604 మంది, ఇంజనీరింగ్ 5,084 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను, వనపర్తి పాలిటెక్నిక్, బాలికల ఉన్నత పాఠశాల, పురుషల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్ల్రాను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శర్మన్, జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుధాకర్‌లు సందర్శించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, హాజరు తదితర వివరాలను పరీక్షా కేంద్రం పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు 7 కేంద్రాల్లో 4,215 మంది విద్యార్థులకు గాను 285 మంది గైర్హాజరవ్వగా 3,930 మంది పరీక్షలకు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మెడికల్ విభాగం పరీక్షకు 6 కేంద్రాల్లో మొత్తం 3,061 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 237 మంది గైర్హాజరవ్వగా 2,824 మంది పరీక్షలు రాశారు. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో పదినిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థినికి అనుమతించలేదు. కేంద్రాల వద్ద పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్రాల వద్ద రద్దీ బాగా కనిపించింది. వనపర్తి పట్టణంలోనూ ఎంసెట్ ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 1237 మంది విద్యార్థులకు 1154 మంది హాజరయ్యారు. 83 మంది ైగె ర్హాజరయ్యా రు. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సా యంత్రం 5.30 వరకు పాలిటెక్నిక్, ప్రభు త్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నిర్వహిం చిన మెడిసిన్ విభాగం పరీక్షకు 822 మంది విద్యార్థులకు 780 మంది హాజరయ్యా రు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ భాస్కర్‌ను ఎన్పోర్స్మెంట్ అధికారిగా వచ్చారు. పలు పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బందుల నడుమ పరీక్షలు రాశారు. వనపర్తి రీజినల్ కో-ఆర్డినేటర్ కుమారస్వామి పరీక్షలను పర్యవేక్షించారు. -
శ్రద్ధ+సాధన=నవ విజయం
ఉత్తమ విద్యకు.. మంచి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచాయి నవోదయ విద్యాలయాలు. వీటిలో సీటు సాధించిన వారికి 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యనందించనున్నారు. అంతేకాకుండా కాకుండా భోజనం, వసతి సదుపాయం కూడా అందుతుంది. జిల్లాలో బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ఎమ్మిగనూరు సమీపంలో వెలిసింది. ఇందులో ప్రవేశానికి ఈనెల 8న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 6,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చదవాల్సిన పాఠ్యాంశాలపై సూచనలు, సలహాలు.. - న్యూస్‌లైన్, ఎమ్మిగనూరు రూరల్ ఇవి నిషేధం.. నవోదయ పరీక్షకు హాజరయ్యే విద్యార్థి తప్పనిసరిగా బ్లాక్/బ్లూ బాల్‌పాయింట్ పెన్ను వెంట తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రంలో అందజేసే ఓఎంఆర్ షీట్‌లోని జవాబులను ఆ పెన్నుతోనే నింపాలి. పెన్సిల్, రబ్బర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించొద్దు. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తీసుకెళ్లరాదు. వెంట ప్యాడ్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. గంట ముందే చేరుకోవాలి.. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్‌టికెట్ అందిన విద్యార్థులు ముందస్తుగా ఏ ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయించారో తెలుసుకోవాలి. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం వల్ల ఎలాంటి ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉండవు. ఈ పరీక్షకు అరగంట ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అయినా.. నిర్ణీత సమయంలోనే పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది. గ్రూపు చర్చలతోప్రయోజనం.. నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గ్రూపు చర్చలకు ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి చర్చలతో సబ్జెక్టులను ఎక్కువగా అవగతం చేసుకోవచ్చు. తద్వారా పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించడానికి వీలుంటుంది. రిజర్వేషన్లు.. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి విద్యాలయంలో సీటు దక్కుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు ఏడున్నర శాతం, పీహెచ్‌సీలకు 2, బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. పట్టణ విద్యార్థులకు 25 సీట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 సీట్లు భర్తీ చేస్తారు. పాత ప్రశ్నపత్రాలను గమనించాలి.. విద్యార్థులు పూర్వ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. కనీసం మూడేళ్ల నుంచి ప్రశ్నపత్రం ఏ విధంగా రూపొందిస్తున్నారో, ఏయే చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఏ చాప్టర్ కీలకమో గమనించాలి. భాష భాగంలో కొద్దిపాటిగా తర్ఫీదు తీసుకుంటే మార్కులు సాధించడం కష్టమేమి కాదు. ముఖ్యంగా విద్యార్థులు సమయంతో పోటీపడాలి. తక్కువ సమయంలోనే జవాబులు గుర్తించగలగాలి. తొలుత తెలిసిన సమాధానాన్ని పూర్తిచేయాలి. తదుపరి మిగతా ప్రశ్నలపై ఆలోచించాలి. జవాబుపత్రంలో కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానం రాయాలి. భాషపై పట్టు తప్పనిసరి... విద్యార్థుల భాష, పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాష పరీక్ష ఉంటుంది. మెజార్టీ విద్యార్థులు తెలుగునే ఎంచుకుంటారు. 25 మార్కులు కేటాయిస్తారు. ఏదేని మూడు పాఠ్యాంశాలను ఇస్తారు. ఒక్కో పాఠ్యాంశంలో ఐదు ప్రశ్నలుంటాయి. వ్యాకరణం, లేఖన నైపుణ్యం, పరీక్షించేందుకు మరో పది ప్రశ్న లుంటాయి. పాఠ్యాంశాల ఆధారంగా వచ్చే ప్రశ్నకు సమాధానాలు దాదాపు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులను ఎంచుకోవాలి. వ్యాకరణంలో ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నా అభ్యాసమే అత్యంత ప్రాధాన్యం. రోజూ ఓ గంట వ్యాకరణం చదవడం మేలు. పరీక్ష జరిగే విధానం.. నవోదయ ప్రవేశ పరీక్ష ఎలాంటి విరామం లేకుండా ఏకధాటిగా రెండు గంటలపాటు ఉంటుంది. నిర్ధేశించిన సమయంలోనే విద్యార్థులు పరీక్ష రాయాలి. మేధాశక్తి, గణితం, భాషా సంబంధిత పరీక్షలు (మూడు విభాగాలుగా) ఉంటాయి. వంద మార్కులకు వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మేధా శక్తి(రీజనింగ్)లో 50 మార్కులు, గణితంలో 25 మార్కులు, తెలుగు/ఆంగ్లం పఠనాంశంలో 15 మార్కులు, వ్యాకరణంలో 10 మార్కులు ఉంటాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి వీలైనంత మేరకు ప్రశ్నలన్నింటికీ జవాబురాయడం ఉత్తమం. -
సుదూర ‘పరీక్ష’!
100 కిలోమీటర్ల దూరంలో వీఆర్వో పరీక్ష కేంద్రాలు అభ్యర్థులకు తంటాలు, ఆటంకాలు ఖాయం అధికారుల అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపణలు ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’ అన్నట్లుగా.. వీఆర్వో పరీక్ష రాసే అభ్యర్థులు చేరుకోవాల్సిన పరీక్ష కేంద్రం ‘జీవిత కాలం సుదూరం’ అనే చందంగా మారింది అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా. అందుకు ఉదాహరణలివిగో.. మోమిన్‌పేట మండలం టేకులపల్లికి చెందిన వనజాక్షి ఆదివారం వీఆర్వో పరీక్షకు హాజరు కానుంది. పరీక్ష కేంద్రం ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల. ఆమె ఇక్కడికి చేరుకోవాలంటే కనీసం వంద కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. ఉదయం 10గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ముందు రోజు రాత్రే అన్నీ సర్దుకుని రావాలి. యాలాలకు చెందిన మోయిజ్‌కు సైతం ఇదే సమస్య తలెత్తింది. మేడ్చల్ మండలంలోని నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన వీఆర్వో పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో ఆయన యాలాల నుంచి తాండూరుకు, అక్కణ్నుంచి హైదరాబాద్.. సికింద్రాబాద్ మీదుగా ప్రయాణం చేయాలి. పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే కనిష్టంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన వి.సత్యనారాయణకు బీహెచ్ఈఎల్ ప్రభుత్వ కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయిస్తూ హాల్ టికెట్ వచ్చింది. అక్కణ్నుంచి ఆయన పరీక్షకు హాజరుకావాలంటే వంద కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రానికి రావాల్సిందే. - సాక్షి, రంగారెడ్డి జిల్లా