- మూడు నిమిషాల లేటుతో ఇద్దరు వెనక్కి
- మొత్తం పది కేంద్రాల్లో పరీక్ష
- 8,137 మంది విద్యార్థుల హాజరు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఒంగోలు నగరం, చీమకుర్తిలోని 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి మొత్తం 8,745 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 8,137 మంది హాజరయ్యారు. 93 శాతం మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి 2,117 మంది దరఖాస్తు చేయగా 1944 మంది పరీక్షకు హాజరయ్యారు. 91 శాతం మంది పరీక్ష రాశారు. ఎంసెట్ పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
హైటెక్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విద్యాశాఖ, పోలీసు అధికారులతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. విద్యార్థులందరూ ఉదయం 9.30 గంటలలోపు, మధ్యాహ్నం 2 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జెడ్ రమేష్‌బాబు తెలిపారు.
మూడు నిమిషాల లేట్‌తో ఇద్దరు వెనక్కి
ఒంగోలు రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయారు. ఎంసెట్ నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులెవరినీ పరీక్షకు అనుమతించరు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు ముందుగానే ప్రకటించారు. నేతివారిపాలెం, సింగరాయకొండకు చెందిన ఇద్దరు 10.03 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవడంతో వారిని లోనికి అనుమతించలేదు. వీరు కుల ధ్రువీకరణ పత్రాలు లేకుండా తొలుత పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారులచే అటెస్ట్ చేయించి సంబంధింత చీఫ్ సూపరింటెండెంట్‌కు అందజేయాలి. చీఫ్ సూపరింటెండెంట్‌లు ఈ కుల ధ్రువీకరణ పత్రాలను విద్యార్థుల నామినల్ రోల్స్‌కు అంటించి పంపుతారు. ఉదయం పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు ఈ విషయం తెలుసుకుని అప్పటికప్పుడు ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకుని వచ్చేటప్పటికి కాలాతీతమైంది. 10.03 గంటలకు ఆ ఇద్దరు విద్యార్థులు రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పటికే (10 గంటలకే) ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. పరీక్ష రాయలేకపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు.
ప్రశాంతంగా ఎంసెట్
Published Fri, May 23 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement