Eamcet-2014
-
ప్రశాంతంగా ఎంసెట్
- మూడు నిమిషాల లేటుతో ఇద్దరు వెనక్కి - మొత్తం పది కేంద్రాల్లో పరీక్ష - 8,137 మంది విద్యార్థుల హాజరు ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఒంగోలు నగరం, చీమకుర్తిలోని 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి మొత్తం 8,745 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 8,137 మంది హాజరయ్యారు. 93 శాతం మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి 2,117 మంది దరఖాస్తు చేయగా 1944 మంది పరీక్షకు హాజరయ్యారు. 91 శాతం మంది పరీక్ష రాశారు. ఎంసెట్ పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హైటెక్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విద్యాశాఖ, పోలీసు అధికారులతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. విద్యార్థులందరూ ఉదయం 9.30 గంటలలోపు, మధ్యాహ్నం 2 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎంసెట్ రీజనల్ కో ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జెడ్ రమేష్‌బాబు తెలిపారు. మూడు నిమిషాల లేట్తో ఇద్దరు వెనక్కి ఒంగోలు రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయారు. ఎంసెట్ నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులెవరినీ పరీక్షకు అనుమతించరు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు ముందుగానే ప్రకటించారు. నేతివారిపాలెం, సింగరాయకొండకు చెందిన ఇద్దరు 10.03 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవడంతో వారిని లోనికి అనుమతించలేదు. వీరు కుల ధ్రువీకరణ పత్రాలు లేకుండా తొలుత పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారులచే అటెస్ట్ చేయించి సంబంధింత చీఫ్ సూపరింటెండెంట్‌కు అందజేయాలి. చీఫ్ సూపరింటెండెంట్లు ఈ కుల ధ్రువీకరణ పత్రాలను విద్యార్థుల నామినల్ రోల్స్‌కు అంటించి పంపుతారు. ఉదయం పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు ఈ విషయం తెలుసుకుని అప్పటికప్పుడు ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకుని వచ్చేటప్పటికి కాలాతీతమైంది. 10.03 గంటలకు ఆ ఇద్దరు విద్యార్థులు రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పటికే (10 గంటలకే) ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. పరీక్ష రాయలేకపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. -
ప్రశాంతంగా ఎంసెట్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, వనపర్తి టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంతోపాటు వనపర్తిలో గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మెడిసిన్‌లో 3,604 మంది, ఇంజనీరింగ్ 5,084 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను, వనపర్తి పాలిటెక్నిక్, బాలికల ఉన్నత పాఠశాల, పురుషల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్ల్రాను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శర్మన్, జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుధాకర్‌లు సందర్శించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, హాజరు తదితర వివరాలను పరీక్షా కేంద్రం పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు 7 కేంద్రాల్లో 4,215 మంది విద్యార్థులకు గాను 285 మంది గైర్హాజరవ్వగా 3,930 మంది పరీక్షలకు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మెడికల్ విభాగం పరీక్షకు 6 కేంద్రాల్లో మొత్తం 3,061 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 237 మంది గైర్హాజరవ్వగా 2,824 మంది పరీక్షలు రాశారు. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో పదినిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థినికి అనుమతించలేదు. కేంద్రాల వద్ద పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్రాల వద్ద రద్దీ బాగా కనిపించింది. వనపర్తి పట్టణంలోనూ ఎంసెట్ ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 1237 మంది విద్యార్థులకు 1154 మంది హాజరయ్యారు. 83 మంది ైగె ర్హాజరయ్యా రు. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సా యంత్రం 5.30 వరకు పాలిటెక్నిక్, ప్రభు త్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నిర్వహిం చిన మెడిసిన్ విభాగం పరీక్షకు 822 మంది విద్యార్థులకు 780 మంది హాజరయ్యా రు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ భాస్కర్‌ను ఎన్పోర్స్మెంట్ అధికారిగా వచ్చారు. పలు పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బందుల నడుమ పరీక్షలు రాశారు. వనపర్తి రీజినల్ కో-ఆర్డినేటర్ కుమారస్వామి పరీక్షలను పర్యవేక్షించారు. -
ప్రశాంతంగా ఎంసెట్
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశ పరీక్ష(ఎంసెట్) గురువారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. నెల్లూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఇంజనీరింగ్ విభాగం ప్రవేశపరీక్షకు 10,934 మంది దరఖాస్తు చేసుకోగా 10,265 మంది రాశారు. మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ విభాగ పరీక్షకు 3,265 మంది హాజరుకాగా 131 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 20, మధ్యాహ్నం 7 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. నిర్ణీత సమయం కన్నా గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ప్రకటించడంతో స్పందన లభించింది విద్యార్థులు ఉదయమే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న పలువురు మాత్రం హడావుడిగా పరుగులు తీస్తూ పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారు. దాదాపు అందరూ సకాలంలో పరీక్షకు హాజరయ్యారు. సీతారామపురం, వరికుంటపాడు, డక్కిలి, మర్రిపాడు, కొండాపురం తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పలువురు ముందు రోజే నెల్లూరుకు చేరుకుని బంధుమిత్రుల ఇళ్లు, లాడ్జీల్లో బస చేశారు. పరీక్ష నిర్వహణను జేఎన్టీయూ నుంచి వచ్చిన ఏడుగురు ప్రొఫెసర్లు పర్యవేక్షించారు. 25 మంది రెవెన్యూ ఉద్యోగులతో కూడిన ప్రత్యేక స్క్వాడ్ పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసింది. భానుడి ఉగ్రరూపం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులతో పాటు వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు విలవిలలాడారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి వచ్చిన వారు పరీక్ష కేంద్రాల ఆవరణలో ఆరుబయటే నిలుచుని అవస్థ పడ్డారు. తమ పిల్లలు పరీక్ష ఎలా రాస్తున్నారోనని బయట ఉత్కంఠగా ఎదురుచూశారు. పరీక్ష ముగిసిన వెంటనే సమీపంలోని శీతలపానీయాల దుకాణాలు విద్యార్థులతో కిటకిటలాడాయి. ఆయా కేంద్రాల ఆవరణలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. వివిధ విద్యాసంస్థలకు చెందిన వారు కరపత్రాల పంపిణీకి పోటీపడడంతో కోలాహల వాతావరణం నెలకొంది. పలువురి సహకారం ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వేచి వుండేందుకు నగరానికి చెందిన పలు సంస్థలు సహకరించారు. డీకేడబ్ల్యూ కళాశాల వద్ద శ్రీరామకృష్ణ వివేకానంద ప్రచార సమితి, సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో షామియానా ఏర్పాటు చేయడంతో పాటు నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు అన్వేష్, వసంతకుమార్‌రెడ్డి, ఖాజా, అసంఘనానందరెడ్డి, అశోక్ పాల్గొన్నారు. మెడిసిన్ ప్రశ్నపత్రంలో తప్పులు - ఆందోళనలో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఎంసెట్ మెడిసిన్ విభాగానికి సంబంధించిన ప్రశ్నపత్రంలో పలు తప్పులు దొర్లినట్లు అధ్యాపకులు గుర్తించారు. బి సిరీస్‌లో జువాలజీ సబ్జెక్టుకు సంబంధించి 63వ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. 80 ప్రశ్నకు సంబంధించి ఇచ్చిన సమాధానాల్లో రెండు కరెక్ట్‌గా ఉన్నాయని తెలిపారు. ఏ సిరీస్‌లో బోటనీ సబ్జెక్టుకు సంబంధించి 24వ ప్రశ్నకూ రెండు సమాధానాలు ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎంసెట్ నిర్వాహకులు ఏ సమాధానాన్ని ఫైనల్ చేస్తారోనని విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. సరైన నిర్ణయం తీసుకోకపోతే మూడు మార్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులోని విశ్వసాయి కళాశాల డెరైక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తప్పులు దొర్లింది వాస్తవమేనని, విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎంసెట్.. ఆల్రైట్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్-2014) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికారులు పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులపై ప్రత్యేక నిఘాతోపాటు పరీక్ష నిర్వహణను డేగ కళ్లతో పరిశీలించారు. గురువారం గుంటూరు నగరంతో పాటు సమీప మండలాల్లో ఏర్పాటు చేసిన 55 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఎంసెట్‌కు జిల్లా వ్యాప్తంగా 24,261 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 43 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసిన 20,221 మందిలో 19,177 (94.84శాతం) మంది హాజరయ్యారు. మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 5,324 మంది విద్యార్థుల్లో 5,084 (95.4శాతం) మంది హాజరయ్యారు. గత రెండు మూడేళ్లతో పోల్చితే మెడిసిన్ పరీక్షకు ఏ దఫా అత్యధికం హాజరు నమోదయింది. ముందుగానే విద్యార్థుల రాక.. ఎంసెట్‌కు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పదే, పదే హెచ్చరించడంతో విద్యార్థులు ఉదయం 8.00 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. 9.00 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపిన అధికారులు ఉదయం 10, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత గేట్లను మూసివేసి తాళాలు వేశారు. జిల్లా నలుమూలల నుంచి పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులను వెంట పెట్టుకుని వచ్చిన తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలను కనుక్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఇంజినీరింగ్ పరీక్షకు గుంటూరు నగరంతో పాటు ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, పెదకాకాని, తాడికొండ, చేబ్రోలు మండలాల పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్టమైంది. ఆయా మండలాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తమ విద్యాసంస్థల బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరవేశాయి. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా.. ఇంజినీరింగ్, మెడిసిన్ పరీక్షా కేంద్రాల్లో ఈ సారి ప్రత్యేక నిఘా బృందాలను నియమించిన అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పరీక్షకు అనుమతించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కలిగి ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని ముందుగానే హెచ్చరించడంతో విద్యార్థుల అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ నుంచి వచ్చిన పరిశీలకులు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జి కలెక్టర్ సందర్శన .. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మశీ కళాశాల, పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల, జేకేసీ కళాశాలలను సందర్శించిన ఇన్చార్జి కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మౌళిక సదుపాయాలపై చీఫ్ సూపరింటెండెంట్లకు తగు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎంసెట్ ప్రశాంతంగా జరిగిందని ఆయన ప్రకటించారు. ఇన్చార్జి కలెక్టర్ వెంట ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఇ.శ్రీనివాస రెడ్డి, ఆర్డీవో బి.రామమూర్తి, తహశీల్దార్ చెన్నయ్య, ప్రొఫెసర్ వై.వి.రెడ్డి ఉన్నారు. ఆర్టీసీ హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు.. పట్నంబజారు(గుంటూరు) : ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులకు ఆర్టీసీ సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమాచారం అందించడంతో పాటు పరీక్ష కేంద్రాల వివరాలు తెలుసుకుని ఇబ్బంది లేకుండా ఆయా రూట్లలో వెళ్లే బస్సెక్కించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పి.వి.రామారావు పర్యవేక్షణలో 50 మంది అధికారులతో పాటుగా 60 మంది సిబ్బంది భాధ్యతలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 80 సర్వీసులు అధికంగా ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం తెలిపారు. నగరంలోని బీఆర్ స్టేడియం, నాజ్‌సెంటర్‌లోని బీఈడీ కళాశాల, ఏసీ కళాశాల, చిలకలూరిపేట, పొన్నూరురోడ్డుతో పాటుగా ప్రతి కళాశాల వద్ద సిబ్బంది విద్యార్థులకు రూట్లు తెలిపేందుకు కేటాయించారు. ఆర్టీసీ అధికారుల చొరవకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఈ నెల 31న ఎంసెట్ ఫైనల్ కీ
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎంసెట్ -2014 పరీక్ష కన్వీనర్ రమణారావు వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో మాట్లాడుతూ... వచ్చే నెల 9వ తేదీన ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఎల్లుండ ఎంసెట్ ప్రాధమిక కీ, 31న ఫైనల్ కీ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఎక్కడ జరగలేదన్నారు. పరీక్షకు 5 నుంచి 10 మంది మాత్రమే ఆలస్యంగా వచ్చారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో 94.37 శాతం, మెడికల్ విభాగంలో 93.03 శాతం మంది విద్యార్థులు హాజరైయ్యారన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు విజయవాడలో అత్యధికంగా హాజరైయ్యారని రమణారావు వెల్లడించారు. -
రేపు ఎంసెట్... నేడు పాలిసెట్, పీసెట్ ప్రవేశ పరీక్షలు
* ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ * ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష * 2.30 నుంచి 5.30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2014 గురువారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష... మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటలకు వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇంజనీరింగ్ అభ్యర్థులను ఉదయం 9 గంటలకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ వారిని మధ్యాహ్నం 1:30గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంసెట్‌కు మొత్తంగా 3,94,543 మంది విద్యార్థులు (ఇంజనీరింగ్‌కు 2,81,695 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 1,11,777 మంది) హాజరుకానున్నట్లు తెలిపారు. ఆన్లైన్ పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు లేనందున ఎంసెట్‌లో వారి అర్హతను, ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని నిర్ధారించేందుకు కుల ధ్రువీకరణ పత్రాన్ని కచ్చితంగా పరీక్ష కేంద్రంలో అందజేయాలని సూచించారు. నేటి నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలు గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే పీసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) బుధవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో జరుగుతుందని కన్వీనర్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. పురుషుల విభాగంలో బుధవారం నుంచి జూన్ 13 వరకు, మహిళల విభాగంలో జూన్14 నుంచి జూన్18వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. పురుషుల విభాగంలో 20,545 మంది, మహిళల విభాగంలో4,068 మంది చొప్పున మొత్తం 24,631 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. తొలిరోజు హాల్‌టికెట్ నంబర్ 10001 నుంచి 10604 వరకు అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. నేడు పాలిసెట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పాలిసెట్-2014)ను ఈనెల 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రంలోని 68 ప్రాం తాల్లో 649 పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేశారు. బాలికల కోసం ప్రత్యేకంగా 12 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 2,54,060 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కీని ఈ నెల 28న, ఫలితాలను జూన్ 4న విడుదల చేస్తారు. కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఈ నెలాఖరులోనే విడుదలవుతుంది. జూన్ రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇంటర్లో ప్రవేశాలకు 26నుంచి దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో మొదటి దశ ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి ఆయా కాలేజీల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ కథనం ప్రకారం.. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా కాలేజీల్లో అందజేయాలి. జూన్ 30వ తేదీతో మొదటి దశ ప్రవేశాలు పూర్తవుతాయి. తరగతులు జూన్ 4నుంచి ప్రారంభం అవుతాయి. పదోతరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారం ఎంపిక ఉం టుంది. ప్రతి సెక్షన్లో 88 మందికి మించకుండా ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. 26నుంచి ఓయూసెట్ హాల్‌టికెట్లు హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓయూసెట్-2014 హాల్‌టికెట్లు ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓయూసెట్‌కు రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసిందని, మొత్తం 64 వేలకు పైగా దరఖాస్తులు అందాయని పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.శివరాజ్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా చూస్తే 79 వేల మంది విద్యార్థులు వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షలు జూన్ 4 లేదా 5 నుంచి ప్రారంభం కానున్నాయి. 26, 27 తేదీల్లో ఎండీఎస్ కౌన్సెలింగ్ విజయవాడ, న్యూస్‌లైన్: డెంటల్పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీఎస్) కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈనెల 26, 27 తేదీల్లో విజయవాడలోని యూనివర్శిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.బాబూలాల్ తెలిపారు. 30న సెకండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న ఉదయం 11గంటలకు వర్సిటీలో మెడికల్ బోర్డు పరిశీలించనున్నట్లు తెలిపారు. పీజీ సీట్ల వివరాలు, ఇతర సమాచారాన్ని కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు యూనివర్శిటీ వెబ్సైట్ జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. తెలుగు వర్సిటీ దూరవిద్య తరగతులు హైదరాబాద్, న్యూస్‌లైన్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం విద్యార్థులకు బుధవారం నుంచి కాంటాక్టు తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ప్రథమ సంవత్సరం ఎంఏ తెలుగు, సంస్కృతం, టూరిజం మేనేజ్మెంట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, జ్యోతిషం, ఎంసీజే, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, బీఏ స్పెషల్ తెలుగు, బీఏ కర్ణాటక సంగీతం(మొదటి/నాల్గవ సంవత్సరం), సినిమా రచన డిప్లొమా కోర్సు విద్యార్థులకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులను హైదరాబాదులోని విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, సంగీత విశారద, లలిత సంగీతం, జ్యోతిషం సర్టిఫికెట్, జ్యోతిషం డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం కోర్సు విద్యార్థులకు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, విద్యార్థులు తమ వార్షిక పరీక్ష ఫీజును జూన్ 10లోగా చెల్లించాలని రిజిస్ట్రార్ ఆశీర్వాదం సూచించారు. -
'ఎంసెట్ 2014 అన్ని ఏర్పాట్లు పూర్తి'
ఎంసెట్- 2014కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు. శుక్రవారం రమణారావు ఆచార్య నాగార్జున యునివర్శిటీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇంజినీరింగ్ విభాగంలో 2,82,800, మెడికల్ విభాగంలో 1,12,900 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇంజినీరింగ్‌కు 523, మెడికల్‌కు 227 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంసెట్ పరీక్ష మే 22న జరగనున్న సంగతి తెలిసిందే. -
రేపటి నుంచి ఆన్లైన్లో ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
మే 2 నుంచి హాల్‌టికెట్ల జారీ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మే 17న జరిగే ఎంసెట్-2014 పరీక్షకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు మంగళవారం తెలిపారు. ఈసేవ/మీసేవ/ ఏపీ ఆన్లైన్/ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి 13 వరకు దరఖాస్తుల్లో తప్పులను ఆన్లైన్లోనే సవరించుకోవచ్చని, రిజిస్ట్రేషన్ కోసం ఇంజనీరింగ్ అభ్యర్థులు రూ.250, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులు రూ. 250 చొప్పున, రెండింటికీ హాజరయ్యేవారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 2 నుంచి 15 వరకు హాల్ టి కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు పంపవచ్చన్నారు. అదేవిధంగా రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 5వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులు పంపవచ్చని వివరించారు. -
ఎంసెట్ కోసం పక్కా ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, మెట్రోరైల్ పనులు, గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో.. పరీక్షకు హాజరు కానున్న విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసెట్ అధికారులు తెలిపారు. గతంలో గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాలను నాలుగు జోన్లుగా విభజించగా, తాజాగా 8 జోన్లుగా విభజించారు. ఏ జోన్ల పరిధిలో నివసించే అభ్యర్థులకు ఆ జోన్లలోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. -
మే 17న ఎంసెట్ పరీక్ష
హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్-2014) ఎంసెట్ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గురువారం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంసెట్ జరిగిన వారం రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 10న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మే 17న పరీక్ష నిర్వహించి జూన్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. వచ్చే ఏడాది ఆన్లైన్ విధానం ద్వారా ఎంసెట్ నిర్వహించే యోచన ఉన్నట్లు తెలిపారు. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే పరీక్షల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు ఫిబ్రవరి 10న ఎంసెట్ నోటిఫికేషన్ మే 17న ఎంసెట్, 2న ఎంసెట్ ఫలితాలు మే 5న పీఈ సెట్ మే 10న ఈసెట్ మే 21 పాలిసెట్ మే 25 ఐసెట్ జూన్ 2న ఎడ్ సెట్ జూన్ 8న లాసెట్ జూన్ 25 నుంచి 29 వరకూ పీజీ ఈసెట్