రేపు ఎంసెట్... నేడు పాలిసెట్, పీసెట్ ప్రవేశ పరీక్షలు | Eamcet 2014 entrance exam to be held on tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఎంసెట్... నేడు పాలిసెట్, పీసెట్ ప్రవేశ పరీక్షలు

Published Wed, May 21 2014 5:25 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Eamcet 2014 entrance exam to be held on tomorrow

* ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
* ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష
* 2.30 నుంచి 5.30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2014 గురువారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు  తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష... మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటలకు వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇంజనీరింగ్ అభ్యర్థులను ఉదయం 9 గంటలకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ వారిని మధ్యాహ్నం 1:30గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. హాల్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
 
 ఎంసెట్‌కు మొత్తంగా 3,94,543 మంది విద్యార్థులు (ఇంజనీరింగ్‌కు 2,81,695 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 1,11,777 మంది) హాజరుకానున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ పూర్తి చేసిన  దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు లేనందున ఎంసెట్‌లో వారి అర్హతను, ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని నిర్ధారించేందుకు కుల ధ్రువీకరణ పత్రాన్ని కచ్చితంగా పరీక్ష కేంద్రంలో అందజేయాలని సూచించారు.  
 
 నేటి నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలు
 గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే పీసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) బుధవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో జరుగుతుందని కన్వీనర్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. పురుషుల విభాగంలో బుధవారం నుంచి జూన్ 13 వరకు, మహిళల విభాగంలో జూన్14 నుంచి జూన్18వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. పురుషుల విభాగంలో 20,545 మంది, మహిళల విభాగంలో4,068 మంది చొప్పున మొత్తం 24,631 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. తొలిరోజు హాల్‌టికెట్ నంబర్ 10001 నుంచి 10604 వరకు అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు.
 
 నేడు పాలిసెట్
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పాలిసెట్-2014)ను ఈనెల 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని  సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రంలోని 68 ప్రాం తాల్లో 649 పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేశారు. బాలికల కోసం ప్రత్యేకంగా 12 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 2,54,060 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కీని ఈ నెల 28న, ఫలితాలను జూన్ 4న విడుదల చేస్తారు. కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఈ నెలాఖరులోనే విడుదలవుతుంది. జూన్ రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
 
ఇంటర్‌లో ప్రవేశాలకు 26నుంచి దరఖాస్తులు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో మొదటి దశ ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి ఆయా కాలేజీల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ కథనం ప్రకారం.. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా కాలేజీల్లో అందజేయాలి. జూన్ 30వ తేదీతో మొదటి దశ ప్రవేశాలు పూర్తవుతాయి. తరగతులు జూన్ 4నుంచి ప్రారంభం అవుతాయి. పదోతరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారం ఎంపిక ఉం టుంది. ప్రతి సెక్షన్‌లో 88 మందికి మించకుండా ప్రవేశాలు చేపట్టాలని  ఆదేశించారు.
 
 26నుంచి ఓయూసెట్ హాల్‌టికెట్లు
 హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓయూసెట్-2014 హాల్‌టికెట్లు ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓయూసెట్‌కు రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసిందని, మొత్తం 64 వేలకు పైగా దరఖాస్తులు అందాయని పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.శివరాజ్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా చూస్తే 79 వేల మంది విద్యార్థులు వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షలు జూన్ 4 లేదా 5 నుంచి ప్రారంభం కానున్నాయి.
 
 26, 27 తేదీల్లో ఎండీఎస్ కౌన్సెలింగ్
 విజయవాడ, న్యూస్‌లైన్: డెంటల్‌పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎండీఎస్) కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈనెల 26, 27 తేదీల్లో విజయవాడలోని యూనివర్శిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.బాబూలాల్ తెలిపారు. 30న సెకండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న ఉదయం 11గంటలకు వర్సిటీలో మెడికల్ బోర్డు పరిశీలించనున్నట్లు తెలిపారు. పీజీ సీట్ల వివరాలు, ఇతర  సమాచారాన్ని కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు యూనివర్శిటీ వెబ్‌సైట్ జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
 
 తెలుగు వర్సిటీ దూరవిద్య తరగతులు
 హైదరాబాద్, న్యూస్‌లైన్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం విద్యార్థులకు బుధవారం నుంచి కాంటాక్టు తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ప్రథమ సంవత్సరం ఎంఏ తెలుగు, సంస్కృతం, టూరిజం మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, జ్యోతిషం, ఎంసీజే, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, బీఏ స్పెషల్ తెలుగు, బీఏ కర్ణాటక సంగీతం(మొదటి/నాల్గవ సంవత్సరం), సినిమా రచన డిప్లొమా కోర్సు విద్యార్థులకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులను హైదరాబాదులోని విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, సంగీత విశారద, లలిత సంగీతం, జ్యోతిషం సర్టిఫికెట్, జ్యోతిషం డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం కోర్సు విద్యార్థులకు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కాంటాక్టు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, విద్యార్థులు తమ వార్షిక పరీక్ష ఫీజును జూన్ 10లోగా చెల్లించాలని రిజిస్ట్రార్ ఆశీర్వాదం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement