ఎంసెట్.. ఆల్‌రైట్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్-2014) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికారులు పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులపై ప్రత్యేక నిఘాతోపాటు పరీక్ష నిర్వహణను డేగ కళ్లతో పరిశీలించారు. గురువారం గుంటూరు నగరంతో పాటు సమీప మండలాల్లో ఏర్పాటు చేసిన 55 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఎంసెట్‌కు జిల్లా వ్యాప్తంగా 24,261 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఉదయం 43 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసిన 20,221 మందిలో 19,177 (94.84శాతం) మంది హాజరయ్యారు. మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 5,324 మంది విద్యార్థుల్లో 5,084 (95.4శాతం) మంది హాజరయ్యారు. గత రెండు మూడేళ్లతో పోల్చితే మెడిసిన్ పరీక్షకు ఏ దఫా అత్యధికం హాజరు నమోదయింది.
ముందుగానే విద్యార్థుల రాక..
ఎంసెట్‌కు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పదే, పదే హెచ్చరించడంతో విద్యార్థులు ఉదయం 8.00 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. 9.00 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపిన అధికారులు ఉదయం 10, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత గేట్లను మూసివేసి తాళాలు వేశారు. జిల్లా నలుమూలల నుంచి పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులను వెంట పెట్టుకుని వచ్చిన తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలను కనుక్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఇంజినీరింగ్ పరీక్షకు గుంటూరు నగరంతో పాటు ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, పెదకాకాని, తాడికొండ, చేబ్రోలు మండలాల పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్టమైంది. ఆయా మండలాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తమ విద్యాసంస్థల బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరవేశాయి.
పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
ఇంజినీరింగ్, మెడిసిన్ పరీక్షా కేంద్రాల్లో ఈ సారి ప్రత్యేక నిఘా బృందాలను నియమించిన అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పరీక్షకు అనుమతించారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కలిగి ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని ముందుగానే హెచ్చరించడంతో విద్యార్థుల అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ నుంచి వచ్చిన పరిశీలకులు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఇన్‌చార్జి కలెక్టర్ సందర్శన ..
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మశీ కళాశాల, పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల, జేకేసీ కళాశాలలను సందర్శించిన ఇన్‌చార్జి కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మౌళిక సదుపాయాలపై చీఫ్ సూపరింటెండెంట్లకు తగు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎంసెట్ ప్రశాంతంగా జరిగిందని ఆయన ప్రకటించారు. ఇన్‌చార్జి కలెక్టర్ వెంట ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఇ.శ్రీనివాస రెడ్డి, ఆర్డీవో బి.రామమూర్తి, తహశీల్దార్ చెన్నయ్య, ప్రొఫెసర్ వై.వి.రెడ్డి ఉన్నారు.
ఆర్టీసీ హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు..
పట్నంబజారు(గుంటూరు) : ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులకు ఆర్టీసీ సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమాచారం అందించడంతో పాటు పరీక్ష కేంద్రాల వివరాలు తెలుసుకుని ఇబ్బంది లేకుండా ఆయా రూట్లలో వెళ్లే బస్సెక్కించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పి.వి.రామారావు పర్యవేక్షణలో 50 మంది అధికారులతో పాటుగా 60 మంది సిబ్బంది భాధ్యతలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 80 సర్వీసులు అధికంగా ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం తెలిపారు. నగరంలోని బీఆర్ స్టేడియం, నాజ్‌సెంటర్‌లోని బీఈడీ కళాశాల, ఏసీ కళాశాల, చిలకలూరిపేట, పొన్నూరురోడ్డుతో పాటుగా ప్రతి కళాశాల వద్ద సిబ్బంది విద్యార్థులకు రూట్లు తెలిపేందుకు కేటాయించారు. ఆర్టీసీ అధికారుల చొరవకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.