ప్రశాంతంగా ఎంసెట్ | eamcet exam completed | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎంసెట్

Published Fri, May 23 2014 2:48 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

eamcet  exam completed

 విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం నిర్వహించిన ఎంసెట్-2014  పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు జిల్లాలో 5,228 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,712 మంది హాజరయ్యా రు. 516 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. విజయనగరం జేఎన్‌టీయూకే కళాశాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీతం ఇంజినీరింగ్ కళాశాల, డెంకాడ మండలం చింతలవలసలో ఉన్న ఎంవీజీఆర్, మోదవలసలోని ప్రావీణ్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 
 ఉదయం ఆరు కేంద్రాల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు 3,834 మంది హాజరు కావాల్సి ఉండగా 3,484 మంది హాజరై 350 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 90.87 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన అగ్రికల్చరల్, మెడిసన్ పరీక్షకు 1,394 మంది హాజరు కావాల్సి ఉండగా 1228 మంది హాజరై, 166 మంది గైర్హాజరయ్యారు. మెడి సిన్ విభాగంలో 88.09 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ జి.యేసురత్నం తెలిపారు. ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు ఒక్క నిమిషమైనా ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ముందుగా ప్రకటించడంతో అభ్యర్థులు గంట ముందుగానే  పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జగిత్యాల జేఎన్‌టీయూ ప్రొఫెసర్ మధుసూదనరావు, జేఎన్‌టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ ఇంద్రాణి ప్రత్యేక అబ్జర్వర్లుగా వ్యవహరించారు.
 
 విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు ఆటోలు, మోటారు సైకిళ్లపై పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు, ఇతరులను పరీక్షా కేంద్రాలకు దూరంగా నిలిపివేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు ప్రశాంతగా జరిగాయి.
 
 అయితే అభ్యర్థులకు తోడుగా వచ్చిన వారు పరీక్ష జరుగుతున్న సమయమంతా ఎండలో ఇబ్బందులు పడ్డారు. అనేక మంది పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న చెట్లు నీడనే ఆశ్రయించారు. అభ్యర్థుల తల్లిదండ్రులు మంచినీటికి ఇబ్బందులు పడకుండా స్వచ్ఛంద సంస్థలు పరీక్షా కేంద్రాల సమీపంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగను అందించారు. విజయనగరం పట్టణానికి చెందిన ఉడాకాల నీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement