శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం జరిగిన ఎంసెట్-2014 పరీక్ష జిల్లాలో ప్రశాం తంగా ముగిసింది. జిల్లా కేంద్రంతోపాటు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ విభాగానికి 4,801 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 4,291 (89.38 శాతం) మంది హాజరయ్యారు. 510 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగిన మెడిసిన్ పరీ క్షకు 1658 మందికిగాను 1503 (91.65 శాతం) మంది హాజరయ్యారు. 155 మంది డుమ్మా కొట్టారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉరుకులు, పరుగులు తీశారు. పలాస, ఇచ్ఛాపురం, కవిటి, టెక్కలి, సీతంపేట, రాజాం, నందిగాం, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం తదితర సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. కాగా పరీక్ష ముగిసిన తర్వాత జవాబుపత్రాలను, ఇతర మెటీరియల్‌ను పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ నుంచి తరలించారు.
144వ సెక్షన్, పటిష్ట బందోబస్తు
ఎంసెట్ పరీక్ష జరిగిన అన్ని కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేశారు. ముఖ్యంగా మెడిసిన్ పరీక్ష జరిగిన నాలుగు కేంద్రాల వద్ద రెట్టింపు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద కనీసం ముగ్గురు పోలీసులతోపాటు స్పెషల్ పార్టీకి చెందిన బృందాలు కూడా నిఘా పెట్టాయి. పరీక్ష కేంద్రాల లోపలికి ఆయా కళాశాలలకు చెంది, గుర్తింపు కార్డు చూపించిన సిబ్బందిని మినహా మిగిలిన వారిని పోలీసులు అనుమతించలేదు. గురువారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు చెమటతో తడిసిముద్దయ్యారు.
కిక్కిరిసిన హోటళ్లు, బస్సులు
సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు భోజనాలు చేసేందుకు ఎగబడటంతో స్థానికం గా హోటళ్లు, రెస్టారెంటులు, టిఫిన్ షాపులు కిటకిటలాడాయి. బస్సులు, ఆటోలు, మాక్సీక్యాబ్‌లు కిక్కిరిపోయాయి. కాగా విద్యార్థులను తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. వీటితోపాటు శ్రీ శివానీ, వెంకటేశ్వర, శారద, వైష్ణవి, గురజాడ కళాశాలల యాజమాన్యాలు వివిధ కేంద్రాల వద్ద ఉచిత బస్సులను ఏర్పాటు చేశాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ తదితర కోర్సులను అందిస్తున్న ప్రైవేటు కళాశాలలు తమ కరపత్రా లు (బ్రోచర్లు)ను విద్యార్థులకు అందజేసేం దుకు ఎగబడ్డాయి.
హాట్ కేకుల్లా అమ్ముడైన ‘సాక్షి ఎంసెట్’ బుక్‌లెట్స్
మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద ‘సాక్షి’ ఎంసెట్ ఇంజినీరింగ్, మెడికల్ కౌన్సెలింగ్ పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇంజినీరింగ్, మెడికల్ కౌన్సిలింగ్ సమగ్ర సమాచారాన్ని కేవలం రూ.75తో బుక్‌లెట్స్ రూపంలో అందించడంతో కోనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎగబడ్డారు.
ఎంసెట్ ప్రశాంతం
Published Fri, May 23 2014 2:31 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement